1, సెప్టెంబర్ 2021, బుధవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *31.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - నాలుగవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*4.6 (ఆరవ శ్లోకము)*


*ధర్మస్య దక్షదుహితర్యజనిష్ట మూర్త్యాం నారాయణో నరఋషిప్రవరః ప్రశాంతః|*


*నైష్కర్మ్యలక్షణమువాచ చచార కర్మ యోఽద్యాపి చాస్త ఋషివర్యనిషేవితాంఘ్రిః॥12306॥*


దక్షుని యొక్క కూతురగు *మూర్తి* యను నామెయందు ధర్మునివలన *నరుడు, నారాయణుడు* అను పేర్లతో శ్రీహరి అవతరించెను. ఆ ఋషిప్రవరులు శాంతచిత్తులుగా ఖ్యాతి వహించిరి. పిమ్మట ఆ మూర్తిద్వయరూపమున శ్రీహరి సకలకర్మల నివృత్తి హేతుభూతాత్మకమైన ఆత్మజ్ఞానయోగమును నారదాదులకు ఉపదేశించుటయేగాక స్వయముగా అనుష్ఠించి లోకమునకు ఆరాధ్యుడయ్యెను. నేడును లోకకల్యాణమునకై బదరికాశ్రమమున నరనారాయణుల రూపములో ఆ స్వామి విరాజిల్లుచున్నాడు. నారదాది మహామునులు ఆ నరనారాయణుల పాదపద్మములను భక్తిశ్రద్ధలతో సేవించు చుందురు.


*4.7 (ఏడవ శ్లోకము)*


*ఇంద్రో విశంక్య మమ ధామ జిఘృక్షతీతి కామం న్యయుంక్త సగణం స బదర్యుపాఖ్యమ్|*


*గత్వాప్సరోగణవసంతసుమందవాతైః స్త్రీప్రేక్షణేషుభిరవిధ్యదతన్మహిజ్ఞః॥12307॥*


నరనారాయణులయొక్క తీవ్రమైన తపస్సునుజూచి, 'వీరు తమ తపశ్చర్యలద్వారా, నా స్వర్గమును ఆక్రమింతురేమో!' అని ఇంద్రుడు శంకించెను. పిమ్మట ఆ దేవేంద్రుడు వారి తపస్సులను భంగపరచు బాధ్యతను మన్ముథునకు అప్పగించెను. శ్రీమన్నారాయణుని మహిమను ఎరుంగక ఆ మన్మథుడు తన సేనయైన అప్సరసలను, వసంతుని, మందమారుతములను ఆ బదరికాశ్రమము కడకు తీసికొనవెళ్ళెను. అంతట దివ్యాంగనలు తమ క్రీగంటి చూపులనెడి బాణములతో ఆ తపోమూర్తులను ఆకర్షించుటకు ప్రయత్నించిరి (ఆ ఋషులను వ్యామోహపరచుటద్వారా వారి తపస్సులను భంగపరచుటకు యత్నించిరి.


*4.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విజ్ఞాయ శక్రకృతమక్రమమాదిదేవః ప్రాహ ప్రహస్య గతవిస్మయ ఏజమానాన్|*


*మా భైష్ట భో మదన మారుత దేవవధ్వో గృహ్ణీత నో బలిమశూన్యమిమం కురుధ్వమ్॥12308॥*


అప్పుడు దేవాదిదేవుడైన శ్రీహరి 'ఇదియంతయును ఇంద్రుని యొక్క నిర్వాకమే' అని గ్రహించెను. ప్రభావశాలియైన శ్రీహరి తమను శపించునేమో? అను భయముతో మన్మథాదులు కంపింపసాగిరి. అంతట ఆ పరమాత్ముడు ఏమాత్రమూ ఆశ్చర్యపడక దరహాసమొనర్చుచు వారితో ఇట్లనెను - "మదనా! మారుతా! అప్సరసలారా! భయపడకుడు. మీరు ఈ ఆశ్రమమునకు వచ్చిన అతిథులు. కావున మా ఆతిథ్యమును స్వీకరింపుడు'


*4.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్థం బ్రువత్యభయదే నరదేవ దేవాః సవ్రీడనమ్రశిరసః సఘృణం తమూచుః|*


*నైతద్విభో త్వయి పరేఽవికృతే విచిత్రం స్వారామధీరనికరానతపాదపద్మే॥12309॥*


నిమి (జనక) మహారాజా! అభయప్రదుడైన శ్రీహరి ఇట్లు పలుకగా మన్మథుడు మొదలగు దేవతలు తమ అపరాధమునకు సిగ్గుపడుచు వినమ్రతతో తలలు వంచుకొనిరి. ఎంతటి అపరాధమొనర్చినవారియెడలను తన పుత్రులుపైవలె కృపజూపునట్టి ఆ శ్రీహరితో వారు ఇట్లు విన్నవించుకొనిరి- "ప్రభూ! నీవు పరబ్రహ్మస్వరూపుడవు. కామక్రోధాది వికారరహితుడవు. ఆత్మజ్ఞానులు, జితేంద్రియులు ఐన ఋషిసత్తములు సైతము వినమ్రతతో నిరంతరము నీ పాదపద్మములను సేవించుచుందురు. అంతటి పరమాత్ముడవైన నీవు కృతాపరాధులమైన మమ్ము కనికరించుటలో ఆశ్చర్యములేదు.


*4.10 (పదియవ శ్లోకము)*


*త్వాం సేవతాం సురకృతా బహవోఽన్తరాయాః స్వౌకో విలంఘ్య పరమం వ్రజతాం పదం తే|*


*నాన్యస్య బర్హిషి బలీన్ దదతః స్వభాగాన్ ధత్తే పదం త్వమవితా యది విఘ్నమూర్ధ్ని॥12310॥*


దేవతలను ఆరాధించుచు యజ్ఞాదులయందు వారికి (దేవతలకు) హవిస్సులను (హవిర్భాగములను) అర్పించువారి సాధనలకు దేవతలు ఎన్నడును విఘ్నములను కలిగింపరు. కానీ, భక్తిప్రపత్తులతో నిన్ను సేవించువారు (నిష్ఠతో నిన్నుగూర్చి తపస్సు చేయువారు) దేవలోకమైన స్వర్గమును అతిక్రమించి నీ పరమపదమును చేరుదురను అసూయతో దేవతలు వారికార్యములకు (తపస్సులకు) విఘ్నములను కలిగించుచుందురు. కాని నీవు భక్తులను రక్షించువాడవు. వారి కార్యములకు ఎన్నడును విఘ్నములను రానీయవు. నీ రక్షణలో నున్నవారికి ఏమాత్రమూ అంతరాయములను కలుగనీయవు. అందువలన వారు నీ పరమపదమును చేరుదురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: