అంతా మిథ్యేనా.. (అంతర్మథనం)
................
కళ్ళ ముందు అన్నీ కనిపిస్తుంటే ఏమీ లేదని, అభాస అని అనేవాళ్ళని మనం ఏమనాలి? ఏదైనా అనండి, అనుకోండి. ఎందుకంటే వాళ్లకు మీ మాటల పట్టింపు ఉండదు కాబట్టి. ఈ మాటల్లో నిజమెంత అనేది మాత్రం ఆయా వ్యక్తుల ఆలోచనా విధానం, తార్కిక, తత్వ దృష్టిని బట్టి ఉంటుంది. సృష్టిలో అన్నీ ఉన్నాయి. లేనివే వీ కొత్తగా సృష్టించబడటం లేదు. కర్ర, ఇటుక, సున్నం, స్టీల్ ఇవన్నీ తయారు చేసినవా? సృష్టిలో ఉన్నవే కదా. అన్నీ కలిపి మనం ఇల్లు కడుతున్నాం. ఇవాళ నీది, ఆ తరువాత ఉంచుకుంటే నీది, లేకుంటే వేరొకరిది. అంటే ఓనర్లు మారుతున్నారు. మరి అసలు ఓనరు ఒకడు ఉండాలి కదా. వాడెవడు? వాడు సర్వాధికారి అయితే మనం ఎవళ్ళం? ఇదీ తార్కిక, తత్వ దృష్టి. ఇవన్నీ మాకెందుకు..వర్తమానం, భవిష్యత్తు మాకు ముఖ్యం అంటాం మనం. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వర్తమానం మరు నిమిషానికి గతం. భవిష్యత్తు అని మనం చెప్పేది కూడా వర్తమానంలోనే చూస్తాం. మరి ఉన్నది వర్తమానం ఒక్కటే అయితే మిగిలిన రెండూ లేనట్టేనా? మిథ్య అని చెబుతున్న వారి వాదనో, జ్ఞానమో..అది కరెక్టేనా?. మిథ్య అంటే లేదని ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే.. ఇవాళ ఉన్నది ఏదీ రేపటికి ఉంటుందని గ్యారంటీ లేదు కదా. అందం, ఆరోగ్యం, సంపద, పదవి, ఆయుష్షు..ఇవన్నీ ఆ కోవలోవే కదా. ఇది నిజం కదా. ఆ దృష్టి సదా నిలవడం కోసమే.. మిథ్యా ప్రపంచం అని పెద్దలు చెప్పి ఉంటారని అనుకుంటే జీవిత సత్యం కొంతయినా బోధపడుతుంది కదా. ఇక..మిథ్య అనే వాడిని ఎందుకు తప్పుపట్టడం? అశాశ్వతమైన వాటి కోసం జీవితాంతం వెంపర్లాడక, శాశ్వతమైన వస్తువును అన్వేషించడమే..పెద్దల చెప్పే మిథ్యా ప్రపంచానికి లోతైన అర్థంగా స్వీకరిస్తే తప్పూ లేదు, తప్పు పట్టుకోవాల్సిన పనీ లేదు కదా. సత్యాన్వేషి...సజ్జన సాంగత్యం, సద్ గ్రంథ పఠనం, సద్ గురువుల ఆశ్రయం, సత్ కర్మల ఆచరణతో ఈ విషయం నిగ్గు తేల్చుకోవాలి.. కోవచ్చు కూడా.// మీ...ఆదూరి వేంకటేశ్వరరావు. 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి