పద్య కవిత //
ధ్రువకోకిల //
తఱుమ లేనివి కోర్కెలన్నవి తాపముల్ కలిగించురా!
పరుల సొమ్ముల కాశచెందుట పాప కార్యము సోదరా!/
మరలిరానిది కాల మన్నది మంచి దారికి మళ్ళుమా!/
కరుణతో చరియించి లోకుల గౌరవమ్మును బొందుమా!//
మత్తకోకిల //
తోలుతిత్తియె దేహమన్నది తోసుకెళ్లును మిత్తియున్ /
గాలి పోవును భస్మ రాశిగ గాల మందున నిల్చునా?/
పాలుమాలిక లేక శ్రీహరి పాద సేవలు చేయుమా!/
కూల దోయును పాప శైలము కోరినిన్ దరి జేర్చుచున్ //
మత్తకోకిల //
సంచితంబగు కర్మ వాసన జన్మలన్ కుది పేయగా
పాంచ భౌతిక దేహమే జని పండి రాలుట
ఖాయమౌ!
వంచనన్ విడ నాడి దుర్గుణ భావనల్ నిరసించుచున్
బెంచుకోవలె సద్గుణంబును ప్రేమతో చరియించుచున్ //
మత్తకోకిల //
ధర్మ మార్గము వీడి పోకుమ!దారి తప్పకు మానవా!/
కర్మ పాశము చుట్టు ముట్టిన కాలమే పగ బూనుగా /
మర్మమన్నదెఱుంగ జాలక మాయలో పడ బోకురా!/
నిర్మలాత్ముడు విష్ణువేయని నిశ్చయమ్ముగ
నమ్మురా !//
మత్త కోకిల //
జీవితంబున "గీత "సారము చింతలన్ పరిమార్చు నీ
భావి యంతయు శాంతి నిండగ పావనంబయి సాగు నా
త్రోవలో భగవానుడే సరి తోడుగా జని బ్రోచు నా
దేవదేవుని చేయి వీడక దీధితిన్ వెలుగొందుమా //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి