13, డిసెంబర్ 2021, సోమవారం

కరోనోపాఖ్యానం



కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం

మొన్నొక రోజున కరోనా వైరస్ కలలో కొచ్చింది.

ఖర్మ ! ఏం చేస్తాం?

'ఏంటి ఇలా వచ్చావ్?' అనడిగా నీరసంగా.

'చూశావా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కోటిమందిని లేపేశా' అంది గర్వంగా.

'అదేంటి? WHO లెక్కల ప్రకారం ఇప్పటిదాకా పోయినవాళ్లు 3.2 మిలియన్ మాత్రమే. అంటే 32 లక్షలు. నువ్వెంటి 100 లక్షలంటావు? అనడిగా.

పెద్దగా నవ్విందది.

'అవి కాకిలెక్కలు. నాది పిచ్చుకలెక్క. నాదే అసలైన లెక్క' అంది విలాసంగా కాలూపుతూ.

'ఏంటీ? నువ్వు చంపావా?' అడిగాను.

'ఏం? కాదా?' అంది.

'కాదు. అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ ' అన్నా నవ్వుతూ.

'అదేంటి? నాకూ, తెలుగుపద్యాలు రావులే. కొంచం ఇవరించి చెప్పబ్బాయా' అంది తెనాలి యాసలో. అప్పుడు దానికొక పద్యం చదివి వినిపించా.


కర్ణుని చావుకు ఆరు కారణాలని సామెతున్నది కదా ! మహావీరుడైన కర్ణుని తాను చంపగలిగానని అర్జునుడు పొంగిపోతుంటే కృష్ణుడు దానికి సమాధానంగా చెప్పిన పద్యమని ఆంధ్ర మహాభారతంలో ఒక పద్యం ఉన్నది.


కం॥ నరవర నీచే నాచే

వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్

ధరచే భార్గవు చేతను

అరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్ !


'ఓ మనుష్యులలో శ్రేష్టుడా ! అర్జునా ! నీచేత, నాచేత, కుంతిచేత, ఇంద్రునిచేత, భూదేవిచేత, పరశురామునిచేత - ఈ అరుగురిచేత కర్ణుడు హతుడైనాడు. నీ ఒక్కడి గొప్పదనం కాదు' అని కృష్ణుడు చెబుతాడు.


నీచే - నువ్వు అతనితో యుద్ధం చేసి చంపావు. కనుక నువ్వు ప్రత్యక్ష కారణానివి. అంటే డైరెక్ట్ కాస్ అన్నమాట.


నాచే - నేను నీ సారధిగా ఉంటూ రధాన్ని నడిపించాను గనుక నా పాత్ర కూడా ఉంది. అంటే ఇండైరెక్ట్ కాస్ అన్నమాట.


వరమడిగిన కుంతిచేత - పాండవులలో ఎవరినీ చంపకు అని వరం అడిగిన కుంతికూడా కర్ణుని చావుకు పరోక్ష కారకురాలైంది. 


వాసవుచేతన్ - మారువేషంలో వచ్చి కవచకుండలాలు ఎత్తుకుపోయిన ఇంద్రుడు కూడా పరోక్ష కారణం.


ధరచే - కర్ణుని రథచక్రాలు భూమిలో దిగబడి ఉన్నపుడు వాటిని వదలకుండా పట్టుకున్న భూదేవి కూడా పరోక్ష కారణమే.


భార్గవు చేతను - అవసర సమయంలో అస్త్రమంత్రాలు నీకు గుర్తుకురాకుండుగాక ! అని శాపమిచ్చిన గురువు పరశురాముడు కూడా పరోక్ష కారకుడే.


"ఈ విధంగా ఒక ప్రత్యక్ష కారకుడు, అయిదుగురు పరోక్ష కారకులు వెరసి ఆరుగురి చేతులలో కర్ణుడు చనిపోయాడు గాని నీ ఒక్కడి వీరత్వం కాదురా అర్జునా" అని కృష్ణుడు చెబుతాడు.


అలాగే, కరోనా చావులకు కరోనా వైరస్ ఒక్కటే కారణం కాదు. ఆరు కారణాలున్నాయి. ఎలాగో చెప్పమంటారా? వినండి.


1. కరోనా వైరస్


ఇది ప్రత్యక్ష కారణం. అంటే direct cause అన్నమాట. కనుక ఇది అర్జునుడు. చస్తున్న ప్రతివాడూ కర్ణుడే. 


2. తిండి


ఇది భూదేవి. ఎందుకంటే, మనకొచ్చే తిండంతా భూమినుంచే వస్తుంది కాబట్టి. కరోనా చావులకు తిండి ఎలా కారణమౌతోంది? ఎలాగంటే, అతిగా మెక్కడం, అసలు తినకుండా ఉపవాసాలుండటం, వేళాపాళా లేకుండా తినడం, మనకే తిండి సరిపోతుందో చూసుకోకుండా ఏదిపడితే అది తినడం, సరిగ్గా నమలకుండా మింగడం, బలం బలం అంటూ నాన్ వెజ్ విపరీతంగా తిని నానారోగాలూ తెచ్చుకోవడం, త్రాగుడు, కూల్ డ్రింకులు, రోడ్లమీది జంక్ ఫుడ్ అతిగా తినడం, ఇత్యాది ఆహారపరమైన తప్పులవల్ల తప్పకుండా ఒళ్ళుగుల్ల అవుతుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. అప్పుడు కరోనా ఏం ఖర్మ? ఏదైనా తేలికగా ఎటాక్ చేస్తుంది. కనుక ఇది భూదేవి శాపం.


3. నిద్ర


ఇది పరశురాముడు. ఎందుకంటే, నిద్రనుంచి లేచిన పరశురాముడే కర్ణుడికి శాపమిచ్చాడు. కాబట్టి నిద్రాపరంగా మానవులు చేసున్న తప్పులన్నీ పరశురామ శాపాలే. ఏంటా నిద్రాపరమైన తప్పులు?


అర్ధరాత్రి దాటి తెల్లవారుఝాము అవుతున్నా కూడా టీవీలు చూస్తూ, పార్టీలు చేసుకుంటూ, నిద్ర పోకుండా మేలుకుని ఉండటం, మర్నాడు పొద్దున్న బారెడు పొద్దెక్కినా లేవకపోవడం, సుష్టుగా తిని మధ్యాన్నం మళ్ళీ ఒక మూడుగంటలు గురక పెట్టడం. ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేసే నైట్ షిఫ్టులు ఇవన్నీ నిద్రాపరమైన తప్పులు. వీటివల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది.


పరశురాముని శాపం వల్ల అవసర సమయంలో అస్త్రమంత్రాలను కర్ణుడు మర్చిపోయాడు. అలాగే, ఉత్తప్పుడు ఎవరు ఎన్ని రకాలైన మంచిమాటలు చెప్పినా, టీవీలలో యూట్యూబులలో ఎన్నెన్ని చూసినా, వినినా, చివరాఖరికి ఆచరించే సమయానికి అవన్నీ మరచిపోయి మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగడం, మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉండటం వల్ల మనిషి రోగాలపాలౌతున్నాడు.


ఇది పరశురామ శాపం.


4. తప్పుడు లైఫ్ స్టైల్


ఇది ఇంద్రుడు. ఈయన మాయవేషంలో వచ్చి మాయమాటలు చెప్పి కర్ణుడి కవచకుండలాలు కాజేశాడు. ఇదే విధంగా, విదేశీ జీవన విధానం కూడా దొంగచాటుగా, యాడ్స్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా, మనుషుల ఇళ్ళకొచ్చి, మాయచేసి, మితిమీరిన సుఖాలకు అలవాటు చేసి, మన జీవనవిధానాన్ని మనకు దూరం చేసి, సహజంగా పుట్టుకతోనే మనకొచ్చిన రోగనిరోధకశక్తిని (కవచకుండలాలను) ఎత్తుకుపోతోంది. కవచకుండలాలు లేని కర్ణుడు, శత్రువు ప్రయోగించిన అస్త్రాలకు తేలికగా పడిపోతున్నాడు. అదే విధంగా, ఇమ్యూనిటీ తగ్గిన మనిషి రోగాలకు తేలికగా లోనైపోతున్నాడు.


కనుక ఇది ఇంద్రశాపం.


5. అనవసర మందుల వాడకం


ఇది కుంతీదేవి. ఎలాగంటే, యుద్ధంలో కర్ణుని గెలుపు తధ్యమని తెలుసుకున్న కుంతీదేవి, కర్ణుడిని బ్రతిమిలాడి, అతని జన్మరహస్యం చెప్పి, 'పాండవులు నీ తమ్ముళ్లే, కనుక వారిని చంపకు' అని బ్రతిమిలాడి మాటతీసుకుంటుంది. 


అదే విధంగా, నేటి కాలపు డాక్టర్లు, వారి వైద్యవిధానం, మనుషులను మాయచేసి, సెంటిమెంట్ తో కొట్టి, 'అందరూ వాడుతున్నారు గనుక నేనూ ఈ మందులు వాడాలి' అన్న భ్రమను మనుషులకు కల్పించి, మందుల కంపెనీల ఖాతాదారులుగా వారిని మార్చేసి, అనవసరమైన మందులన్నీ వాడించి వాళ్ళ ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. కనుక మందుల కంపెనీలు, డాక్టర్లు, మెడికల్ రెప్ లు, ల్యాబ్ వాళ్ళు, వీళ్ళందరూ కుంతీదేవి స్వరూపాలు. మెత్తగా మాయమాటలు చెప్పి సెంటిమెంట్ తో చంపుతున్నారు.


కనుక ఇది కుంతీదేవి శాపం.


6. చివరిది మనసు.


ఇది కృష్ణశాపం. ఎలాగంటే, మనసే మనిషిని నడిపించేది. మనసే దేవుడు. అది దారితప్పితే మనిషి జీవితం మొత్తం దారితప్పుతుంది. అర్జునుడు వైరస్ అనుకుంటే, మనసు కృష్ణుడనుకుంటే, వైరస్ కి అనుగుణంగా జీవనరథాన్ని మనసు నడుపుతున్నది. కనుక కర్ణుడిలాంటి మనిషి చనిపోతున్నాడు.


ఆరోగ్యం బాగుపడే దిశగా నేటి మనిషి మనసు వెళ్లడం లేదు. ఒళ్ళు గుల్లచేసుకునే దిశగా పోతోంది. ఎవరెన్ని చెప్పినా ఎవరూ వినే స్థితిలో లేరు. రోడ్లమీద తిరక్కండిరా అని నెత్తీనోరూ మొత్తుకుని ప్రభుత్వం చెబుతున్నా జనం వినకపోతుంటే చివరికి కర్ఫ్యూలు, షూట్ ఎట్ సైట్ ఆర్దర్లు ఇవ్వాల్సి వస్తోందంటే మనుషులు ఎంత మొండిగా ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. మనిషంటే మనసే గనుక మనసులు మొండిగా తయారౌతున్నాయి. చావువైపే వెళుతున్నాయిగాని బ్రతుకువైపు మళ్లటం లేదు. ఎంతమంది మంచి చెప్పినా ఎవరూ వినడం లేదు.


కనుక ఈ మొండివైఖరే కృష్ణ శాపం. అయితే దీనిలో చాలా ఛాయలున్నాయి. అవేంటో వినండి మరి.


1. 'నాకేం కాదులే' అని నిర్లక్ష్యంగా మాస్కుల్లేకుండా ఎక్కడబడితే అక్కడ తిరగడం.

2. 'నేను రెండు డోసులూ వాక్సిన్ తీసుకున్నాను. ఇక నాకేమౌతుంది?' అని ధీమాగా అందరిమధ్యనా తిరగడం.

3. 'నా దగ్గర డబ్బుంది. ఒకవేళ కరోనా వస్తే ' ఏ - క్లాస్ ' ట్రీట్మెంట్ చేయించుకోగలను' అన్న ధనమదంతో లెక్కలేకుండా తిరగడం.

4. 'దేవుడున్నాడు, నేను మహాభక్తుడిని, నాకేం కాదు' అనుకుంటూ గుళ్ళూ గోపురాలూ తిరిగి, తీర్ధాలూ, ప్రసాదాలూ తిని కరోనా తెచ్చుకోవడం.

5. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత కూడా 'నాకేం కాదు' అన్న ధీమాతో వారం రోజులు ముదరబెట్టుకుని బ్రీతింగ్ సమస్యలు వచ్చినపుడు లబోదిబో అంటూ ఆస్పత్రుల వెంట పెరిగెట్టడం.

6. తనకు పాజిటివ్ వచ్చిందని తెలిసినా, బయట తిరుగుతూ కావాలని మరికొందరికి అంటించడం.

కృష్ణశాపంలో ఇవన్నీ రకరకాలైన షేడ్స్.

అదన్నమాట సంగతి.

ఈ కధంతా కలలోనే కరోనాకు వివరించి చెప్పాను.

కరోనా చాలా సంతోషపడింది.

'అబ్బ ! ఎంత బాగా చెప్పావు. నువ్వు చెప్పినది నిజమే సుమీ !' అని ఎంతో హాచ్చర్యపోయి చివరకు 'ఇంత మంచి వివరణ ఇచ్చావుగాబట్టి నీకొక మాంచి వరమిస్తాను' అంది.

ఎవరైతే మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, గుంపులుగా చేరకుండా శుభ్రన్గా ఉంటారో వాళ్ళ జోలికి నేను రానుగాక రాను' అంటూ మాయమైపోయింది. కరోనా

      🤔🤔🤔🤔🤔🤭🤭

   *ఇది నేను రాసినది కాదు చాలా బాగుందని పోస్టు చేశాను*


*(ఎవరు వ్రాశారో కానీ చాలా చక్కగా విశ్లేషించి వ్రాశారు వారికి ధన్యవాదాలు)*

కామెంట్‌లు లేవు: