1, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఆత్మ

 ఈ ఆత్మ ఎ టువంటిదంటే.. అది ఎవరికీ కనపడదు, వినపడదు, ఇంద్రియ గోచరము కాదు, పోనీ మనస్సుతో ఆలోచిద్దామా అంటే ఆలోచనలకు అందనిది. ఈ ఆత్మకు ఎటువంటి వికారములు మార్పులు లేనిది. 

కాబట్టి అర్జునా! ఆత్మ ఇలా ఉంటుంది అని ఎవరూ తెలుసుకోలేదు, చెప్పలేదు, చెప్పగా వినలేదు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా నీవు ఈ ప్రకారంగా ఆత్మస్వరూపులైన నీ శత్రువుల గురించి శోకించడం మంచిదేనా! కాబట్టి నీ శోకము మాని యుద్ధముచేయడానికి సంసిద్దుడవు కా! అని అన్నాడు శ్రీ కృష్ణుడు.


అవ్యక్తము అంటే వ్యక్తము కానిది, కనిపించనిది, కళ్లకు కనిపించదు, చెవులకు వినిపించదు, ఇంకా ఆత్మను గురించి మనసుతో ఆలోచించి తెలుసుకోలేము. ఆలోచించడం అనేపనిని మనం మనసు బుద్ధి తోనే చేస్తాము. ఏదైనా ఒక విషయం గురించి తెలిస్తే దాని గురించి ఆలోచిస్తాము. అసలు ఆత్మ కనపడదు వినపడదు, తాక బడదు. అటువంటి దానిని గురించి ఏమి ఆలోచిస్తాం. 


కాబట్టి ఆలోచనలకు కూడా అందనిది ఆత్మ. ఇవి ఆత్మ లక్షణములు. శాశ్వతము, కనపడని ఆత్మగురించి, అశాశ్వతమైన కనపడే ఈ శరీరం గురించి శోకించడం వ్యర్థము. నువ్వు ఏమి చెప్పావు. నువ్వు నా శిష్యుడివి అని అన్నావు. అందుకే ఇంతదూరం చెబుతున్నాను. నా మాటవిని, ఈ అనవసరమైన శోకం మాని లేచి యుద్ధం చెయ్యి అని బోధించాడు శ్రీకృష్ణుడు.


ఇంకా వివరంగా చెప్పాలంటే ఆత్మ దృశ్యవస్తువు కాదు. కళ్లతో చూడలేము. దాని గురించి చెవులతో వినలేము. ఎవరూ దాని గురించి చెప్పలేరు. జ్ఞానేంద్రియములకు అతీతమైనది. అతి సూక్ష్మంగా ఉంటుంది. దీనిని చూడాలంటే ఒకటే మార్గము. ముందు మనసును, ఇంద్రియములను స్వాధీనపరచుకోవాలి. దానికి మార్గము నిష్కామ కర్మ, వైరాగ్యము, అచంచలమైన, ఏకాగ్రమైన భక్తి, భగవంతుని ధ్యానించడం. వీటి ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. శుద్ధిఅయిన మనస్సు ఆత్మలో లీనం అవుతుంది. అప్పుడు ఆత్మ ఒకటే మిగులుతుంది. మనసు విడిగా ఉన్నంత కాలం, మనసు, అహంకారంతో కలిసి, ప్రాపంచిక విషయములలో తిరుగుతున్నంత కాలం, ఎవరికీ ఆత్మగురించి తెలిసే అవకాశం లేదు. ఇది చాలా కష్టం కాబట్టి ఎవరూ తెలుసుకోవడం లేదు. కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.


🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

కామెంట్‌లు లేవు: