21, మే 2022, శనివారం

సాంబారు తయారుచెయ్యడం ఎలా?

 సాంబారు తయారుచెయ్యడం ఎలా?


పరమాచార్య స్వామివారి చుట్టూ భక్తుల గుంపు. పురుషులంతా ఒకవైపు, స్త్రీలంతా ఒకవైపు. ఆరోజు స్వామివారు చాలా సాధారణ విషయాల గురించి మాట్లాడుతూ, భక్తులకు నవ్వులు పంచుతున్నారు.


హఠాత్తుగా పురుషుల వైపు తిరిగి, “మీలో వంట చెయ్యడం ఎవరికి వచ్చు?” అని అడిగారు.


జీవితంలో ఒక్కసారి కూడా వంటగది వైపు తొంగిచూడని కొందరు మగవారితో కలుపుకుని అందరూ “హా, నాకు తెలుసు” అన్నారు.


“సాంబారుని మీరు ఎలా తయారుచేస్తారు?” అన్నది తరువాతి ప్రశ్న.


వరుసలో మొదట నిలుచున్న వ్యక్తి చెప్పడం ప్రారంభించాడు, “చింతపండును నీళ్ళల్లో నానబెట్టి, కొద్దిగా ఉప్పు, ఎండు మిరప పొడి వేసి; ఆ మిశ్రమాన్ని బాగా మరిగించి వడ్డించాలి” 


వెనుకన నిల్చున్న మరొక వ్యక్తి చెప్పాడు, “నూనెలో కొద్దిగా ఆవాలు, ఎండు మిరపకాయలు వేయించుకోవాలి. తరువాత చింతపండు-ఉప్పు-కారం-కరం పొడి మిశ్రమాన్ని ఉడికించి, ఉడకబెట్టిన పప్పును వేసి, మొత్తంగా ఒకసారి ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి . . .”


మరొక వ్యక్తి, “చింతపండు, ఎండు మిరప రెండూ నీళ్ళతో బాగా రుబ్బుకుని, తరువాత ఉప్పు, ఉడకబెట్టిన పప్పు, చిటికెడు ఇంగువ వేసుకుని, బాగా మరిగించాలి” అని చెప్పాడు.


అలా కొందరు మగవాళ్ళు ఎన్నో రకాలా పద్ధతులని చెప్పారు. తరువాత పరమాచార్య స్వామివారి వంతు వచ్చింది.


“మీరందరూ పెద్ద జ్ఞానులు! అహంకారాన్ని మరచిపోయిన వారు. కాని నేను ఇంకా దానికోసం ప్రయత్నిస్తున్నాను” అని అన్నారు.


మహాస్వామివారు ఏమి చెప్పారు?


“సాధారణంగా మనం తికమకపడేది తాన్ (నేను) అన్న ఆలోచన వల్ల. మీకందరకూ ఆ తాన్(కూరగాయలు) అన్న ఆలోచనే లేదు. చింతపండు-ఉప్పు-మిరప-ఇంగువ మాత్రమే మీ మస్తిష్కంలో ఉన్నాయి. తాన్ అన్న ఆలోచనే మీకు రాలేదు. ఇది జ్ఞానుల స్థితి కదా?”


తమిళంలో తాన్ అంటే కూరగాయలు మరియు అహం అన్న అర్థం కూడా!!

వాళ్ళందరూ కైలాస పర్వతం ముందర చిన్న రాళ్ళల్లా నిలబడిపోయారు.


--- రాధా రామమూర్తి, మహా పెరియవాళ్ – దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: