22, జులై 2022, శుక్రవారం

రామాయణానుభవం_ 101

 🌹రామాయణానుభవం_ 101


సుగ్రీవుడు *దక్షిణదిశ* భౌగోళిక అంశాలు తెలియ జేస్తున్నాడు....


దక్షిణ దిశాన సముద్రం దాటాక

"పుష్పితక" పర్వతము సువర్ణ, రజిత శిఖరాలతో సూర్యేందుకు నెలవై ఉంటుంది. అయితే దానిని క్రూర, నాస్తిక కృతఘ్నులు చూడరు.


ఆ పర్వతము తర్వాత "వైద్యుతము" అనే పర్వతము మెరుపువంటి రంగుతో ప్రకాశిస్తూ మధువుకు, మధుర ఫలాలకు నిలయమై ఉంటుంది.


ఆ పర్వతము దాటిన తరువాత “కుంజర" పర్వతము "అగస్త్య" భవనముతో అలరారుతూ ఉంటుంది. దాని తరువాత "భోగవతీ నగరము” ఉంటుంది. అది "వాసుకి" సమేత అసంఖ్యాక సర్పరాజులకు నిలయము. మహావిషసర్ప సంరక్షితమై ఉంటుంది.


దాని తరువాత "వృషభాచలము" ఉంటుంది. దానిపై ఎఱ్ఱ చందనము విశేషంగా ఉం, భయంకర రోహితాకార గంధర్వ సురక్షితమై ఉంటుంది. 


పంచగంధర్వులు పాలకులుగా ఉంటారు. వారే శైలూష, గ్రామణి, శిశువు, శుభ్రుడు, బభ్రుడు అనేవారు. తమ పుణ్యకర్మలచే సూర్య, చంద్రాగ్ని శరీరకులైన దేవతలు అక్కడ స్వర్గవాసము చేస్తుంటారు.


వృషభగిరియే పృథివి యొక్క దక్షిణాంతిమ భాగము ఇంతవరకే మీరు వెళ్లగల్గుతారు. దాని తరువాత గాడాంధకార పరీవృతమైన పితృలోక, యమలోక ప్రాంతము ఉంటుంది.


ఈ దక్షిణ దిశను నెల రోజులలోపు పర్యటించి సీతను గాఢంగా అన్వేషించి రావాలి. సీత జాడ తెలిపిన వారు నాకు ప్రాణప్రియులై, నాతో సమానంగా భోగభాగ్యములు అనుభవిస్తారు. వారు ఎన్ని తప్పులు చేసినా నాకు ఆమోదయోగ్యులే.


మీరందరు ఉన్నత కుల సంజాతులు, బలపరాక్రమ సంపన్నులు” అని సుగ్రీవుడు వారికి దక్షిణ దిశా నిర్దేశం చేశాడు........


**

 *పశ్చిమదిశ*

 సుగ్రీవ మహారాజు తన మామగారైన “సుషేణుడు" అను వానర మహావీరుని నాయకునిగా జేసి, అతనికి తోడుగా మారీచుని, అతని సోదరులను, అర్చిష్మంతుని, అతని అనుయాయులను, రెండు లక్షల మంది వానర వీరులను పశ్చిమ దిశకు పంపాడు. 

ఆయన తన మామగారితో:

"మీ నాయకత్వంలో సౌరాష్ట్ర (గుజరాత్) బాహ్లిక, శూరదేశాలను (బహుశః పంజాబు, సింధు దేశాలను) జన, పదాలను, పట్టణాలను, మహారణ్యాలను పర్వతాలను వెతకాలి. అవి దాటిన తరువాత మెట్ట ప్రదేశాలతో కూడిన (రాజస్థాన్ లోని “థార్") ఎడారిప్రాంతము వస్తుంది. అక్కడ అంతా బాగా అన్వేషించి క్రింది (అరేబియా) సముద్రంలో ప్రవేశించాలి. దానిలో "తిమి", తిమింగిలాది పెద్ద పెద్ద చేపలు, మొసళ్లు అధికంగా ఉంటాయి.


(సింధూ) నదీ సాగర సంగమ ప్రదేశంలో "హేమగిరి" అనే మహా పర్వతము శత శిఖర పరివేష్టితమై ఉంటుంది. దానిలోయలలో "రెక్కలుగల ఎగిరే సింహాలు" ఉంటాయి. అవి మదగజాలను, మహామీనాలను పట్టుకొని తమ గుహలలోకి తీసికవెళ్లి తింటాయి. దాని శిఖరాలలో ఒకటి బంగారు రంగుతో ప్రకాశిస్తుంటుంది. మీరు కామరూపధారులై అక్కడ అంతా జాగ్రత్తగా అన్వేషించాలి.


ఆ (అరేబియా) మహా సముద్రములో శతయోజన విస్తీర్ణమైన "పారియాత్ర" మహా పర్వతము శిఖర సమేతమై ఉంటుంది. ఆ పర్వతంపై కామరూప శక్తి గలిగిన అగ్ని వర్ణులైన ఇరువై నాలుగు కోట్ల మహాబలసంపన్నులైన గంధర్వులు ఉంటారు. ఆ పర్వతము ఫల, మూలాలను వారు రక్షిస్తుంటారు. అయినప్పటికి వానర రూపులైన మీకు వారి వలన భయము ఉండదు.


ఆ పర్వతము తర్వాత వైడూర్య వర్ణమయమైన "వజ్ర పర్వతము" శత యోజన సమున్నతమై ఉంటుంది. ఆ పర్వత గుహలన్నిటిలో సీతను జాగ్రత్తగా అన్వేషించాలి.


దాని తరువాత "చక్రవంత" పర్వతము విశ్వకర్మ స్థాపిత సహస్రార చక్రముతో ప్రకాశిస్తుంది. పంచజనుడనేరాక్షసుని సంహరించి, శ్రీమహావిష్ణువు ఈ చక్రాన్ని కైవసం చేసికొన్నాడు. ఈ పర్వత ప్రాంతాలన్నిటిలో సీతాదేవిని అన్వేషించాలి....

కామెంట్‌లు లేవు: