22, జులై 2022, శుక్రవారం

గురు భక్తుని

 *ఒక గురు భక్తుని ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు.*

*ఏవండీ మీరు చాలా రోజుల నుంచి ఒక గురువుగారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, దానివల్ల మీకు ఏమీ ప్రయోజనం కలిగింది. ?* 

*ఏమి ఆస్తులు సంపాదించారు ?*


 *అని అడిగాడు. అదివిన్న అవతలి వ్యక్తి ఇలా చెప్పాడు.*


 *అయ్యా చాలా మంచి ప్రశ్న వేశారు. చెప్తాను వినండి. మీరు గురు తత్త్వం ఇప్పటి వరకూ తెలుసుకోలేక పోయారు. అందుకే మీ మనసులో ఇలాంటి ప్రశ్న పుట్టింది. ఏమి సంపాదించారు అన్నారు కదా చెప్తా వినండి. నా గురుదేవులే నా కోటానుకోట్ల ఆస్తి. వారి పాదాల దగ్గర స్థానమే మాకు గొప్ప పదవి. వారి సేవే మాకు గొప్ప వరం.*


*నేను వారి సన్నిధికి చేరక ముందు  వేరు, ఇప్పుడు నేను వేరు. ఒకప్పుడు నా మనసు అంతా గందరగోళం గా ఉండేది. ఎప్పుడూ ఎదో ఆలోచన. భవిష్యత్తు గురుంచి భయం. రేపు అనేది ఎలా ఉంటుందో అనే ఆలోచన. ఏదో ఒకటి చేసి తప్పుదారిలో వెళ్ళి సుఖపడాలి అనే ఆలోచన తో నా జీవితం కొనసాగేది. కానీ ఇప్పుడు నా ఆలోచేనే మారిపోయింది. ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత కష్టం మీద పడుతున్నా నా మనస్సు ఎప్పుడూ ఆనందం తో నిండి ఉంటుంది. నా పెదాలపై ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. ధర్మంగా ఉండి ఉన్నదానిలో సంతృప్తిగా ఉంటున్నాను. దురాశ లేదు. ఉన్నదానిలో ఒకరికి అయినా సాయం చేయాలనే బుద్ధి పుట్టింది. మా గురుదేవుల ప్రవచనాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తి ఎలా జీవించాలో తెలుసుకున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడ ఉన్నా మా గురుదేవులు రక్షగా నా పక్కనే ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అదికావాలి ఇది కావాలి అనే కోరికలు పూర్తిగా తగ్గాయి.ఇప్పుడు మా ఇంట్లో ఒక ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. మా పిల్లల చదువులు, వారి అలవాట్లు మంచిగా సాగుతున్నాయి. మా కుటుంబం మొత్తం ఒక మంచిదారిలో నడుస్తున్నాము.*


*మా గురువు గారి మార్గదర్శనం లో, మేము నలుగురికి ఆదర్శం గా నిలిచాము. ఒకరు పొగిడినా  లేదా ఒకరు విమర్శించి తిట్టుకున్నా రెండిటిని మేము ఒకే దృష్టితో చూడగలుగుతున్నాం. ఇప్పుడు మా మనసులో కూడా చెడు అనే ఆలోచన రావడం లేదు . చూసే దృష్టిలో కూడా మార్పు వచ్చింది. ఇంతకన్నా ఒక వ్యక్తికి, లేదా కుటుంబానికి కావలిసిందేముంది. ఈరోజు మేము జీవించి ఉన్నాము అంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. ఈ జీవితం ఆయనది. మా జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ ఆయనదే. కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదించి రక్ష ఇచ్చేది కూడా ఆయనే. నా మనసులో వున్న ప్రతిదీ ఆయనకు అవగతమే. ఎందుకంటే మా మనసులో ఎప్పుడూ ఆయన కొలువుదీరి ఉన్నారు. ఆయన సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం.  గురువు గొప్పదనం కేవలం గురువును అనుసరించడం వల్ల మాత్రమే తెలుస్తుంది.*


*ఆయన దృష్టితోనే అన్ని సంపదలు ప్రసాదించగలరు. కానీ కర్మలు తొలగించి ఎవ్వరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో వారికి తెలుసు.*


*వారు పూజలు చేసి మాతో చేయిస్తారు. దివ్యనామం పలుకుతూ, మాతో పలికిస్తారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి , మాతో కూడా అన్నదానం చేయిస్తారు. జీవులను కాపాడమని జీవ హింస చేయద్దని పదేపదే చెపుతూ, వుంటారు. ధర్మ సూక్ష్మాలు చెప్తూ,  ధర్మ మార్గంలో నడిపిస్తారు. అన్ని విద్యలూ ఆయనలోనే ఉండి అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వానిలా, చిన్న వారిని కూడా అడిగి తెలుసుకుంటారు. ఆయన జ్ఞాన శిఖరం. ఆయనను ఆశ్రయించిన వారికి జ్ఞానభిక్షను అనుగ్రహిస్తారు.* 


*అందుకే మా గురుదేవులే మాకు గొప్ప సంపద. ఇంతకన్నా ఒక వ్యక్తికి ఏం కావాలి.*

*Appana Veerababu.*

*Rajahmundry.*

కామెంట్‌లు లేవు: