22, జులై 2022, శుక్రవారం

కపట సన్యాసి

 కాళిదాసు - కపట సన్యాసి


ఒకసారి మేము చెన్నై(తిరుమంగళం) నుండి అంబత్తూరుకు వెళ్తున్నాము. అప్పటిలాగే పరమాచార్య స్వామివారు మూడు చక్రాల సైకిలుపై ఒక చెయ్యి ఉంచి నడుస్తున్నారు. స్వామివారితో పాటుగా మేము ఒక ఏడెనిమిది మంది కూడా నడుస్తూ వెళ్తున్నాము.


“నీలకంఠా, నువ్వు కపట సన్యాసిని చూశావా?”


“లేదు . . .”


“నాగరాజా, మరి నువ్వు?”


“లేదు . . .”


నావైపు చూసి స్వామివారు, “కపట సన్యాసి గురించి విన్నావా?” అని అడిగారు.


“విన్నాను పెరియవా! రావణ, అర్జున . . ” అని అన్నాను.


“వారు మాత్రమేనా?”


కాస్త సంశయిస్తూ “కాళిదాసు కూడా” అని చెప్పాను.


“కాళిదాసా? అతను ఎప్పుడు కపట సన్యాసి అయ్యాడు?”


“ఆ విషయం స్వామివారికి తెలుసు. ఆ కథను స్వామివారే చెబితే వింటూ నడుస్తాము”


“లేదు, నువ్వే చెప్పు”


“భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు, ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినడంతో సభను వదిలి కాళ్ళు తీసుకువెళ్ళిన చోటుకు వెళ్ళిపోయాడు.


కాళిదాసు లేకపోవడంతో భోజునికి సమయం గడవడంలేదు. ఎలా అతణ్ణి పట్టుకోవడం? ఒక శ్లోకంలోని రెండు పాదాలు వ్రాసి, మిగిలిన పాదాలను పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపు వేయించాడు.

దాసీ ఇంట్లో ఉన్న కాళిదాసు, బహుమానం గురించి ఏమీ తెలియకపోయినా శ్లోకాన్ని పూరించాడు. దాసి భోజుని వద్దకు వెళ్లి ఆ శ్లోకాన్ని చూపించింది. ఆమె ద్వారా విషయం తెలుసుకుని మారువేషంలో కాళిదాసుని వెతకడానికి బయలుదేరాడు భోజుడు. దారిలో ఒకచెట్టు క్రింద కూర్చున్న ఒక సన్యాసిని చూసి కాళిదాసేమో అన్న అనుమానం కలిగింది.


ఇద్దరి సంభాషణ ఇలా కొనసాగింది.


ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజుణ్ణి "నువ్వు ఎవరు?" అని అడిగాడు. 

"నేను భోజుని వద్ద తాంబూలం పెట్టె మోసేవాణ్ని. ఆయన మరణించిన తరువాత అక్కడ ఉండడానికి మనసొప్పక ఇలా వచ్చేసాను". 


"ఆహ్ ! నా భోజుడు చనిపోయాడా?", అని ఆ సన్యాసి బాధపడుతూ చరమ శ్లోకం పాడడంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కిందపడి చనిపోయాడు. ఆ మారువేషంలో ఉన్నది భోజుడే అని ఏ మాత్రం అనుమానం లేని ఆ సన్యాసి అమ్మవారిని ప్రార్థించి శ్యామలా దండకాన్ని పఠించాడు. మరొక్క పాదాన్ని "ఇక్కడ, భోజుడు మేల్కొన్నాడు" అన్న అర్థం వచ్చేలా స్తుతించాడు.


భోజుడు నిజంగా బ్రతికాడు.”


ఈ కథను మొత్తం చెప్పి, "ఈ సందర్భంలోనే కాళిదాసు కపట సన్యాసి వేషం వేసాడు" అని అన్నాను.


"చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంత దూరం నడిచినా అలసట కలగలేదు" అన్నారు స్వామివారు.


అంబత్తూరు చేరుకున్నాము. 


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: