22, జులై 2022, శుక్రవారం

అంతర్మథనం

 'నేను' చిరంజీవి (అంతర్మథనం)

........................................

అహమాత్మా గుడా కేశా..అంటారు శ్రీ కృష్ణ పరమాత్మ అర్జనునితో. నేనే ఆత్మ రూపంలో చరాచర సృష్టిలో ఉన్నానని అర్థం. అంటే..జీవకోటి సర్వస్వం ఆత్మ స్వరూపులే. నీవు ఎవరిని మోసం చేసినా ఆత్మ ఘాతకుడు కిందే లెక్క. ఆత్మ..ఆత్మతో తాదాత్మ్యం అయితే భౌతికం. ఆత్మ పరమాత్మతో లయమైతే అది ఆధ్యాత్మికం. అదే జీవుడి నిజ స్థితి. అదే ముక్తి మార్గం. మాధవుడే ముక్తి దాయకుడు. ముందు..మ..అనే పదం లేకుండే అది..ధవా..అవుతుంది. ధవం అంటే.. మల్లె. ఇది కొద్దిసేవు సువాసనలు ఇచ్చి వాడిపోతుంది. దానికి..మ..అనే పదం ముందు చేరిస్తే మాధవ అవుతుంది

మ..అంటే ముక్తి నిచ్చేవాడు. మరి..మాధవుడు కావాలా? ధవం కావాలా? తేల్చుకోవాలి.


శరీరానికి ఒక నామధేయం ఉంటుంది. ఇక్కడే మాయ కమ్మేస్తుంది. నేను అనే శరీరం కేవలం అస్థిత్వం మాత్రమే. ఒక ఉపాధి మాత్రమే. అసలైన..నేను..నడిపించేది. అదే అసలైన నేను. ఆ నేను..చితాద్మ. ఎప్పటికీ నశించదు. దేహం కుప్పకూలినా మరో దేహాన్ని ఆత్మ స్వీకరిస్తుంది. అంటే చనిపోయేది శరీరమే కానీ, ఆత్మ కాదు. కాబట్టి నేను.. చిరంజీవినే. నేనే కాదు..నేనెవరో తెలుసుకున్న వారంతా చిరంజీవులే.


మాయామయం..

...................

నేను శరీరం అనుకోవడం వల్లే ఆశ, పాశం, మదం, మొహం, అహంకారం వంటి ఊడలు విస్తరిస్తాయి. సరే..శరీరం నువ్వే అయితే..ఒక్కో పార్టు తీసి ఇచ్చేస్తావా? ఇవ్వవు. ఎందుకు? అది నీది కాదు కాబట్టి. నీదే అయితే ఇట్టే తీసి..అట్టే ఇచ్చేయ గలగాలి కదా. ఇవ్వలేవు. ఎందుకంటే అది అసలైన నేను కాదు కాబట్టి. అవునా?


సాధకులారా.. నేను సత్యం. నేనే సత్యం. ఇందుకు..ముందు నువ్వు సాధకుడు కావాలి. తపస్సు లేనిదే ఏ సాధనా మొదలు కాదు. విషయ భోగాల కోసం వెంపర్లాడే బాహ్య ఇంద్రియాలను చాకచక్యంగా అంతర్ముఖం చేసి చూడు. ఆలోచనలు లుప్తమై.. చిదానందం కలుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తూ పోతుండు. నీ నిజ స్థితి అనుభవైకవేద్యం అవుతుంది. అదే ఆత్మానుభూతి. అదే నీ నిజ స్థితి. అదే నేను. నిజమైన నేనును తెలుసుకున్న నువ్వు, నేనూ కూడా చిరంజీవులమే. దీంతో.. అప్పటి వరకూ మనం ఘనంగా చెప్పుకునే 'మాయా నేను' మటు మాయం. సాధకుడా..మేలుకో.. త్వరపడు..సమయం అట్టే లేదు. స్వస్తి.// ఆదూరి వేంకటేశ్వర రావు.🙏

.....................

జిజ్ఞాసువులకు మాత్రమే పరిమితమైన ఈ అంతర్మథనం తెలుగుకే పరిమితం. ఆంగ్లంలో ఎవరైనా అనువదిస్తే..నాకు ఎలాంటి బాధ్యత లేదు. హరి ఓం.🙏

కామెంట్‌లు లేవు: