1, డిసెంబర్ 2022, గురువారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 77 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కాళీయునికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళు తమ బిడ్డలను ఎత్తుకుని తమ ఒంటిమీద ఉన్న ఆభరణములు చిక్కుపడి చెల్లాచెదరయి పోతుండగా, కొప్పు ముడులు విడిపోగా, పెట్టుకున్న పుష్పములు రాలిపోతుంటే ఒంటిమీద బట్ట సరిగా ఉన్నదో లేదో కూడా చూసుకోకుండా పరుగుపరుగున అక్కడకు వచ్చి చంటిపిల్లలను కృష్ణుని పాదముల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు. ఈ కాళీయుడు ఇంతకు పూర్వం ఎటువంటి తపస్సు చేశాడో! ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో! ఎటువంటి గొప్పగొప్ప పనులు చేశాడో! మహాత్ములయిన వారికి కూడా దర్శనం అవని నీ పాదపద్మములు ఈవేళ మా భర్త తలలమీద నాట్యం చేస్తున్నాయి. అతని శిరస్సులన్నీ నీ పాదముల ధూళిచేత అలంకృతమయ్యాయి. మా భర్త పుణ్యాత్ముడు. అంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నీవు అంత గొప్ప అనుగ్రహమును ఇచ్చావు. ఈవేళ లక్ష్మీదేవికంటే మా ఆయనే గొప్పవాడు. లక్ష్మీదేవి పొందని వైభోగమును మా భర్త పొందాడు. గొప్ప తపస్సు చేశాడు. దయచేసి మా మనవిని కూడా నీవు వినవలసింది’.

‘ఈశ్వరా! మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని ఎవరూ ఎదిరించలేరని, చాలా ఐశ్వర్యవంతుడని, మమ్మల్ని ఇతనికిచ్చి పెండ్లిచేశారు. మా అయిదవతనం, మా పసుపుకుంకుమలు ఇతని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. అవి ఉండవని నీవు తేల్చేస్తున్నావు. నీవు అనాధనాథుడవు. మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు? భక్తుల కోర్కెలు తీర్చే స్వామీ ! మాకు పతిభిక్ష పెట్టవలసినది’ అని అడిగారు.

కాళీయుడు కృష్ణుని స్తోత్రం చేశాడు. ‘ఈశ్వరా! తప్పు నాదే. ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. ఈవేళ ఈ ప్రమాదం నాకు ఎక్కడినుంచి వచ్చినదో నేను గ్రహించగలిగాను’ అన్నాడు. కాళీయుడు స్తోత్రం చేయగానే పరమాత్మ –

ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. వారికి దాహం వేస్తే ఈ మడుగులోని నీరు త్రాగుతారు. నీవంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్ళు విషం అవుతాయి. నీవు ఇక్కడ ఉండవద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో. రమణక ద్వీపమునకు వెడితే గరుడుడు నిన్ను చంపేస్తాడని నీ భయం నాకు తెలుసు. నీకా భయం లేకుండా ఇవ్వాళనుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణ పాదములు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణ పాదములు కనపడతాయి. కృష్ణ పాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తరమదు. గరుడుడు మిమ్మల్ని ఏమీ చెయ్యడు. రమణక ద్వీపమునకు వెళ్ళిపో’ అనగానే కాళియుడు కృష్ణునకు నమస్కారం చేసి తేనే మొదలగు మధుర పదార్థములు, మంచిమంచి హారములు, పట్టు బట్టలు తెచ్చి కృష్ణ భగవానునికి బహూకరించి తన స్నేహితులతో బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మరల రమణక ద్వీపమునకు వెళ్ళిపోయాడు.

ఈ కాళియ మర్దనమును ఉభయ సంధ్యలందు వింటున్న వారికి ఇన్నాళ్ళనుండి కాళీయుడిలా లోపల పట్టిన విషము పోతుంది. బాహ్యమునందు వాళ్ళని పాములు కరవవని కృష్ణ భగవానుడి వరం.

ఇందులోని తత్త్వమును గ్రహించాలి. కాళీయుడంటే ఎవరో కాదు మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకు హృదయక్షేత్రమునుండి నూటఒక్క నాడులు బయలుదేరుతాయి. వాటిని జ్ఞాన భూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మీరు సద్బుధ్ధితో వాడుకున్నట్లయితే అందరియందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రముల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. దీనిలోనికి కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. కాళీయుడికి ఒక రహస్యం ఉన్నది. ఇతడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. ‘రమణ’ అనే మాటకు శబ్ద రత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయినదో దానికి రమణకము అని పేరు. ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకము. కాళీయుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ పాములకు గ్రద్దలంటే భయం. ప్రతిరోజూ కూడా కొంతమంది తేనె, చలిమిడి, చిమ్మిలి పట్టుకువెళ్ళి గ్రద్దలకి ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టేలా నియమమును ఏర్పాటు చేసుకున్నారు. గ్రద్దలు వచ్చి పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కావు. ఒకరోజున కాళీయుని వంతు వచ్చింది. వానిని కూడా కొద్ది తేనె చిమ్మిలి చలిమిడి పెట్టమని అడిగారు. ‘ఎవరికి పెట్టాలి?’ అని అడిగాడు కాళీయుడు. గరుడుడు వస్తాడు అతనికి బలి ఆహారమును పెట్టాలి అన్నారు. కాళీయుడు ‘గరుత్మంతు డెవరు? నేను పెట్టను. నేను బలవంతుడిని’ అన్నాడు. అయితే నీఖర్మ అని కాళీయుడిని వదిలేశారు.

గరుత్మంతుడు వచ్చి ‘నాకు ఈవేళ ఆహారం పెట్టని వారెవరు? అని అడిగాడు. మిగిలిన పాములు కాళియుడు పెట్టలేదని చెప్పాయి. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళేలోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. తన నూరు పడగలు ఎత్తి గరుత్మంతుడి ఎడమరెక్క మీద కాటు వేశాడు. గరుత్మంతుడికి కోపం వచ్చింది. కాళీయుడిని వెంటపడి తరిమి తన రెక్కలతో కొట్టాడు. కొడితే కాళియుడి ఒళ్ళంతా బద్దలయిపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనుక గరుత్మంతుడు తరుముకు వస్తున్నాడు. కాళియుడికి గరుత్మంతునికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. అతను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళింది మడుగులోకి దూరిపోయాడు.

అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సౌభరి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎత్తుకుపోయి తినేశాడు. వెంటనే సౌభరి మహర్షి గరుత్మంతుడిని శపించారు. ‘సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు. నీవు ఎప్పుడయినా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు’ అన్నారు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. కాళీయుడు కాళింది సరస్సును చేరాడు.

ఈశ్వరుడు ముందు రమణకమును అనగా మనుష్య శరీరమును ఇస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపము. దీనితో హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు. కాళ్ళతో దేవాలయమునకు వెళ్ళవచ్చు. చెవులతో భాగవతమును వినవచ్చు. నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు. మనిషి సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ, దేవతలకు తాను పెట్టవలసిన భాగమును పెట్టకుండా తత్సంబంధమయిన క్రియలు చేయడం మానివేస్తాడు. ఎన్ని సుఖములను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లపు ముక్కనయినా పూజగదిలో పెట్టి రోజూ ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దానిని కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఇవేమీ చేయడు. చేయనని తిరగబడతాడు. ఇలా తిరగబడడం గరుత్మంతుడి మీద తిరగబడడం వంటిది. దేవతలు ఆగ్రహమును ప్రదర్శిస్తారు. ప్రమాదం వస్తుంది. ఎవరెవరు దేవతారాధనకు ఇష్టపడరో అటువంటి చోటికి వెళతాడు. ఇక్కడ కాళీయుడు కాళింది మడుగుకి వెళ్ళాడు. లోపల మార్పు రాలేదు. ఆ మడుగుని విషముగా తయారుచేస్తున్నాడు. తనలో ఉన్న నూరు జ్ఞాన ప్రసార కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. భయంకరమయిన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు యీ విషమును వెనక్కి తీయడు. ఆ అహంకారము పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఈశ్వరుడు క్షమించడు. గోపాల బాలురు, ఆవులు, దూడలు మడుగులోని నీటిని త్రాగి మరణించాలి. అలా అపచారం జరిగింది. ఈశ్వరునికి ఆగ్రహం వచ్చింది తన భక్తుల జోలికి వెడితే ఈశ్వరుడు ఊరుకోడు. నూరు పడగలు పగిలి పోయేటట్లు తొక్కేశాడు. కాళీయుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలాడు. ఇపుడు లోపల ఉన్న బుద్ధి సద్బుద్ధి అయింది. విషమును బయటకు తీసి మరల వదిలిపెట్టాడు.

కాళీయమర్దనము వింటే నూట ఒక్క నాడులలో ఉన్న విషం వెనక్కు వెళ్ళి సద్బుద్ధితో అందరు హాయిగా కృష్ణ పరమాత్మ పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాళియ మర్దనమునకు బాహ్య ప్రయోజనము ఏమిటి? అంటే పాము కరవదు. అంతర ప్రయోజనము లోపలిపాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళింది మడుగు చేయదు. మరల రమణక ద్వీపం చేస్తుంది. కాళియమర్దనం వినగానే ఈ శరీరమంతా శుద్ధి అయిపోతుంది. కాళీయమర్దనం అనే లీలకు అంత పరమ పవిత్రమయిన స్థితి ఉన్నది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[01/12, 4:15 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 76 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ధేనుకాసుర వధ:

ఒకనాడు కృష్ణభగవానుడు బలరామునితో కలిసి ఆవులను, దూడలని తీసుకుని బృందావనం లోనికి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజూ ఆ ఆవులను, దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది. ఈ ఘట్టం జరిగేరోజున కథను బలరామునితో అనుసంధానం చేసారు. కృష్ణభగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. ‘అన్నయ్యా! ఈవేళ చెట్లన్నీ వంగి వున్నాయి. మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నిటిని కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదఘట్టన చేత పరవశిస్తోంది. మీరు మహాపురుషులు’ అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే, బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముని పాదములను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.

కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవులమందలో కొన్నివేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమి ఉంటుంది? పిల్లలందరూ పరుగుపరుగున వచ్చి ఒకమాట చెప్పారు. ఇక్కడకు దగ్గరలో తాటికోట ఒకటి ఉన్నది. అక్కడి తాటిచెట్లకు ఉన్న పెద్దపెద్ద తాటిపళ్ళు ముగ్గి చెట్టునుండి క్రిందపడ్డాయి. పిల్లలందరికీ ఆ పండ్లు తినాలని కోరిక. అక్కడ ధేనుకాసురుడని పిలువబడే గార్దభాసురుడు ఉండేవాడు. అతడు గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన తెలియదు. అది ఎవ్వరినీ తోటలోనికి రానివ్వదు, తాటిపండ్లు తిననివ్వదు. ఒకవేళ ఎవరయినా తినడానికి లోపలికి వచ్చినట్లయితే ఇది గబగబా వెళ్ళి వెనకకాళ్ళు ఎత్తి అవతల వాడి గుండెల మీద తన్ని మరణించేటట్లు చేస్తుంది. ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈమాట చెప్పి వాళ్ళు – మాకు ఎప్పటినుంచో ఆ తాటిపళ్ళు తినాలని ఉన్నది. బలరామా! మాకు ఆ తాటిపళ్ళు తినే అదృష్టమును కల్పించవా’ అని అడిగారు.

బలరాముడు ‘మీకేమీ భయం లేదు. నా వెంట రండి’ అన్నాడు. బలరాముడు అపారమయిన బలశాలి. గోపబాలురనందరినీ ఆ తాటి వనంలోనికి తీసుకువెళ్ళి ఒక తాటిచెట్టును పట్టుకుని ఊపితే తాటిపళ్ళు గలగల క్రింద రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్ళను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు. దానిని గార్దాభాసురుడు చూసాడు. ‘ఇన్నాళ్ళ నుంచి ఈ తాటిపళ్ళు ఎవరూ తినకుండా కాపాడాను. ఈవేళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు’ అని వాడు వెంటనే గాడిదరూపంలో వచ్చి బలరాముడి గుండెలమీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు. బలరాముడు గార్దభాసురుని రెండుకాళ్ళు ఒడిసిపట్టుకుని వాడిని గిరగిర త్రిప్పి ఒక తాటిచెట్టు మీదికి విసిరాడు. అది వెళ్ళి ఒక తాటిచెట్టుకు తగిలింది. ఆ గాడిదదెబ్బకు ఆ తాటిచెట్టు వెళ్ళి ఇంకొక తాటిచెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటిచెట్టు వెళ్ళి మరొక తాటిచెట్టు మీద పడింది. పెద్దగాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడి తాటిచెట్లన్నీ కూలిపోయాయి. హాయిగా పిల్లలందరూ ఆ తాటిపళ్ళు తినేశారు. గాడిదరూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడు పిల్లలు ఉన్నాయి. ‘మా నాన్నగారిని ఎవరో సంహరించారు’ అని పిల్ల గాడిదలు అన్నీ కృష్ణుడు మీదకి, బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నింటినీ అవలీలగా చంపివేశాడు.

పుట్టుకతో ప్రయత్నం చేయకుండా అలవడే గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడిచెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలను ఇస్తుంది. తను కాయించిన కాయలలో ఒక్క కాయనయినా మామిడిచెట్టు తినదు. నది రాత్రనక, పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. దాహం వేస్తోందని నది తన నీళ్ళు తాను ఒక్క చుక్క త్రాగదు. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారుచేస్తుంది. తన పాలను తీసుకువెళ్ళి ఆవుదగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే తప్ప ఒక్క చుక్క పాలను త్రాగదు. ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకుని దాచుకునే దుర్మార్గుడు మనుష్యుడు ఒక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకని వాటికి దాచుకోవడం చేతకాదు. మనిషికి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతు ఉండదు. తృప్తి అనేది మనస్సులో కలగాలి. చితి ఒక్కసారి కాలుస్తుంది. చింత నిరంతరం కాలుస్తుంది. అది ఎక్కువయిపోకుండా ఉంటాలంటే ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపు తిరగాలి. అలా తిరగకపోతే మనస్సుకి ఆలంబనమును మనస్సు వెతికేసుకుంటుంది. ఎప్పుడూ ఐశ్వర్యం గురించో, పిల్లల గురించో, మరొక దాని గురించో ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. దానివలన ఎప్పుడూ బాధే. ఇటువంటి లోభగుణం చేత నరకము వస్తుంది. భార్యా బిడ్డలని పోషించడానికి ధనార్జన చెయ్యాలి. దానిలో కొంత నిలవ చేయాలి. దానిని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్య, పిల్లలు అందరూ పంచుకుంటారు. పాప ఫలమును మాత్రం ఎవరూ పంచుకోరు. ఎవరిది వారే అనుభవించాలి. పాప ఫలితమును పొందకుండా ఉండాలంటే పుణ్య కార్యములను చేయాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులయిన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారముగా దానం చేయాలి. ఈ లోభగుణమును విరుచుకోవడం స్వతహాగా రాదు. మహా పురుషుల జీవితములను ప్రయత్నపూర్వకంగా చూడాలి. పదిమందికి సేవచేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వానిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనుకంజ వేయకూడదు. అందుకే కృష్ణభగవానుడు బలరాముడిని స్తోత్రం చేసాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితములను తెలుసుకుంటే లోభగుణము విరిగిపోతుంది. పదిమంది కోసం బ్రతకడం అలవాటవుతుంది.

కాళీయ మర్దనము

ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆనాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. వారు కాళిందిలో ఉన్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణాదృష్టితో చూసాడు. ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీళ్ళు ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ‘ఈ నీళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి?’ అని వాళ్ళని అడిగాడు.

దానికి కారణం – ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. దానికి అనేకమంది భార్యలు ఎందరో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయిందని తెలుసుకున్నాడు. కృష్ణుడు ‘మీరు అందరూ మరణించడానికి ఇది కారణం. నేను ఏమి చేస్తానో చూడండి’ అని తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీదవరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలి ఈకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. రెండు పాదములను నేలపై గట్టిగా తాటించి ఒకసారి ఊగాడు. అక్కడ ఒక కడిమిచెట్టు ఉన్నది. కృష్ణుడు ఆ చెట్టును ఎక్కాడు. నాటితో తన జన్మ ధన్యమయి పోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. గోపాలబాలుడుగా ఉన్న కృష్ణపరమాత్మ ఆ మడుగు నీళ్ళల్లోకి సింహము దూకినట్లు దూకాడు. ఆయన నీళ్ళల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఈ మడుగును చూసేసరికే అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోనికి దూకడానికి ధైర్యం ఎవరికీ ఉన్నది?” అని సాక్షాత్తు కాళీయుడు చూసాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్నికృష్ణుడిని చూసాడు. ‘ఎంత ధైర్యం ఈ పిల్లాడికి. నేను ఉన్న మడుగులోకి దూకుతాడా?’ అనుకుని పడగలు విప్పి కాటువేసాడు. కృష్ణపరమాత్మ స్పృహ తప్పాడు. కాళీయుడు తన దీర్ఘమయిన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపాల బాలురు భయంతో పరుగుపరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు.

ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఏమి జరిగిందోనని భయపడుతున్నారు. కృష్ణుడు కనపడడం లేదు. కాళీయ మడుగులోని నీటిలో దూకాడు అన్నారు. అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాముచేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నీవు బ్రతికిస్తావు. నీవు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము. నీవు చనిపోయిన తరువాత అయ్యో ఏమి చేస్తాము అని వెనక్కి వెడతామని అనుకుంటున్నావేమో నువ్వు అలా మరణిస్తుండగా మేము అలా చూస్తూ బ్రతికి ఉండము మేమూ కాళింది మడుగులో దూకేస్తాము. ఆ పాము విషంతో చచ్చిపోతాము’ అని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకేయబోయింది. యశోద వెనుక గోపకాంతలందరూ దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపాలబాలురు కూడా అదేప్రయత్నంలో ఉన్నారు.

పరమాత్మ దీనిని చూసాడు. తనను గురించి ఆర్తి చెందేవారున్నారు. ‘నేను వీళ్ళకి దక్కాలి’ అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరమును వెడల్పుగా, పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో ఉన్నశరీరం పెరిగిపోతే కాళీయుని శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కసారి పైకెగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రముల నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కిందపడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు.

కాళియుని తోకపట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడు. మణులతో కూడిన కాళీయుని పడగలు ఆయన నాట్యం చేసే రంగస్థల మంటపం అయింది. గోపకులు, గోపకాంతలు అందరూ యమున ఒడ్డున సంతోషంతో ‘శభాష్ కృష్ణా’ అని సంతోషంతో అరుస్తున్నారు. ప్రేక్షకులుగా దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలల పగిలిపోయి, లోపల ఉన్న మణులు చెల్లాచదరయి పోయాయి. దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతున్నది. అప్పటివరకు విషముతో నల్లగా వున్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళీయుడు శోషించిపోయి నీటిలో పడిపోయే స్థితి వచ్చింది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[01/12, 4:15 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 78 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ప్రలంబాసుర వధ

ఒకనాడు కృష్ణుడు, బలరాముడు గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు. రెండవ జట్టుకు కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముని ఓ చెట్టు చాటుకు తీసుకువెళ్ళి ‘అన్నయ్యా ! ఈవేళ గోపబాలురలో ప్రలంబుడు అనే రాక్షసుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు. నిన్ను చంపుదామనే వచ్చాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి కోరవద్దు’ అని చెప్పాడు. ఆమాట చెప్పిన తరువాత ఇద్దరూ వెనక్కి వచ్చారు. ప్రలంభాసురుడికి కడుపులో ఒక బెంగ ఉన్నది. కృష్ణుడు మీదికి గతంలో చాలామంది రాక్షసులు వచ్చి మడిసిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రలంబాసురునికి తెలుసు. కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముని జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానే ప్రమాదం కొని తెచ్చుకుంటాడని అతడు భావించాడు. బలరాముడికి ఏదయినా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను నమ్ముకున్న వాడిని, తనకోసమని అవతారమును స్వీకరించిన వాడిని, తాను పడుకుంటే పరుపయిన వాడిని, తాను కాలుపెడితే పాదపీఠమయిన వాడిని, తాను కూర్చుంటే పైన గొడుగయిన వాడిని, తాను నడుస్తుంటే ఛత్రము పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలికగా వదిలిపెడతాడా? తనవారన్న వాళ్ళని ఈశ్వరుడు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటాడు. ప్రలంబుడిని తన జట్టులో పెట్టుకున్నాడు.

ఆట ప్రారంభం అయింది. ఈరోజున కృష్ణుడు బృందం ఓడిపోయింది. బలరాముడి బృందం గెలిచింది. బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మోయాలి. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకు వచ్చాడు. బలరాముడికి అర్థం అయి సరే మొయ్యి అన్నాడు. అక్కడ ఒక నియమం పెట్టబడింది. ఎవరు ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీతవరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలెయ్యాలి. అక్కడవరకు మాత్రం మొయ్యాలి. సరేనని బలరాముడిని ప్రలంబుడు ఎక్కించుకున్నాడు. ‘పర్వతమంత బరువు ఉన్నాడే' అని అనుకుంటున్నాడు. పరుగెడుతున్న ప్రలంబుడు గీతదాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు, ప్రలంబుని ఆగమని అరుస్తున్నా వాడు ఆగడం లేదు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు ఏ భయం లేకుండా బలరాముడు వాడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ప్రలంబాసురుని తల బ్రద్దలై వాడు నేలమీద పడిపోయి మరణించాడు. పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు.

ఈలీలలో మనం తెలుసుకోవలసిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉన్నది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక, భగవంతుని భక్తులను హింసించే ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. భగవంతుడే అటువంటి వాళ్ళ మృత్యువుకు మార్గమును తెరుస్తాడు. ఆ భక్తుడిని ఆయనే, బలరాముడిని కృష్ణుడు రక్షించుకున్నట్లు రక్షించుకుంటాడు. భగవద్భక్తులను హింసించడం, తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం పరమ ప్రమాదకరం. దాని వలన ఈశ్వరానుగ్రహమును పొందరు. బలరాముడిని చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రలంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలము, వాళ్ళను ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదం లోనికి తీసుకువెళ్లవచ్చు భగవంతుడిని ఏమీ చేయలేం కాని భక్తులను ఏమైనా చేయవచ్చని అనుకోవడం అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటిని రెప్ప కాపాడినట్లు కాపాడుతూనే ఉంటాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులయిన వారందరికీ కూడా ఒక గొప్ప అభయమును ఇస్తూ ఈశ్వరుడు ప్రలంబవధ అనబడే ఈ లీలను చేసి, మనకందరికీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇన్ని గొప్ప విషయములను ఆవిష్కరించి ఉన్నాడు.

గోపికా వస్త్రాపహరణం

భగవానుడు కృష్ణుడిగా అవతరించి చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము పరమ ప్రామాణికమయినది. ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల.

బృందావనంలో ఉండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్కృష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్షమాసములో ఒక వ్రతము చేసారు. యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది. పార్వతీ దేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి. మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతో పార్వతీదేవిని ఉపాసన చేసే కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం, ఒక రహస్యం ఉన్నది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ నారాయణి అన్నాచెల్లెళ్ళు. వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ కాత్యాయనీ వ్రతం చేస్తారు. గోపకాంతలు ప్రతిరోజూ ఇసుకతో కాత్యాయనీ దేవి మూర్తిని చేసేవారు.

కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరి

నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః!

అదీ వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ లౌకికమయిన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా! నీ అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలని దానిని భార్యాభర్త్రు సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆ వ్రతమును ముప్పదిరోజుల పాటు మార్గశీర్షంలో చేయాలి. ప్రతిరోజూ గోపకాంతలు నిద్రలేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునానది తటము దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమయినది.అమ్మవారికి ‘కదంబ వనవాసిని’ అని పేరు. అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోనికి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకుని గోపకాంతలు కాత్యాయనీ దేవి ఉపాసన చేసి ఫలితమును అడుగుతున్నారు. ఫలితము ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తి అంత గొప్పది. వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషము ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితమును ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగడానికి ప్రతిబంధకముగా ఉన్న దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును కాత్యాయనీ దేవి తియ్యాలి. ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని, కృష్ణుడు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు అదెలా కుదురుతుందని అనుమానం రావచ్చు. పరమేశ్వరుడికి రూపం లేదు ఆయన జ్యోతి స్వరూపము. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమయిన రూపం ధరించి పరమాత్మ ఈ భూమిమీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపము అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారత్వమును పొంది ఫలితమును ఇవ్వడానికి వస్తున్న కృష్ణుడు గోపాలబాలురందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడినుండి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడుచేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వారు అక్కడినుండి వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలన్న తాపత్రయం లేదు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రములనన్నిటిని పట్టుకుని కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. స్త్రీలు అందరూ నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు

కొంటివి మా హృదయంబులు, గొంటివి మానంబు; లజ్జ గొంటివి; వలువల్

గొంటి; వికనెట్లు సేసెదొ, కొంటెవు గద !నిన్ను నెఱిగికొంటిమి కృష్ణా!

ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తే చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడమును అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా ఇవి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడినుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[01/12, 4:15 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 79 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

మీరు ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే మీ మనస్సులను ఎవరో హరించారని తెలుస్తున్నది. అతనిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరికోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి’ అన్నాడు. వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసింది. ఆయన – నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా, భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటినుండి బయటకు రండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను’ అన్నాడు.ఇక్కడ ‘దాసీ’ అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం – తాను చేసిన ప్రతి పనివలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తిప్రతిష్ఠలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. స్త్రీ తానుచేసిన ప్రతి పనితో తన భర్త ఔన్నత్యమును నిలబెడుతుంది. అది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొకమాట చెపుతాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు.

ఆయన ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు.

“మీరు నన్ను చూసి సిగ్గు పడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు. ఈ కృష్ణుడు లోపల ఉన్నవాడు. అన్ని ప్రాణుల హృదయాంతరముల ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు శవము. నేను వున్నాను కాబట్టి మీరు మంగళప్రదులయి ఉన్నారు. వ్రతమును చేయగలుగుతున్నారు. మీరు నన్ను భర్తగా పొందాలనుకుని వ్రతం చేస్తున్నారు. ఒంటిమీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానములు చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయిన వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటిమీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతము పూర్తయిన పిమ్మట కాత్యాయనీ వ్రతం చేశాము ఫలితం రాలేదని అంటారు. ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రతఫలితమును కోరుకుంటే నన్ను భర్తగా మీరు కావాలని అనుకుంటే నేనొక మాట చెపుతాను మీరు చెయ్యండి. ముప్పైరోజులనుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజూ వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రతభంగమునకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి. ప్రాయశ్చిత్తం అయిపోతుంది మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీ దేవిని ఆరాధించండి. నేను మీ భర్తను అవుతాను’ అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అదీ చిత్రం! వాళ్ళు మేము స్త్రీలం. నువ్వు పురుషుడివి. నీవు చెట్టుమీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాము? అలా కుదరదు’ అన్నారు.

భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్తృత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలి అంటే రెండుగా ఉన్నవి అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్లిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వమును నిలబెట్టుకోవడం కుదరదు. మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకొనవలసింది’ అని అన్నాడు.

ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ‘ఆడవాళ్ళం ఎలా వెడతాము? కొంటెకృష్ణుడు ఎన్నయినా చెపుతాడు. మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనం స్త్రీలం. అలా చేయడం కుదరదు’ అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి ఉందాము అనుకున్నారు. మార్గశీర్ష మాసం. మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గడగడ వణికి పోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందని తర్జనభర్జనలు చేస్తున్నారు. అప్పుడు అందులో ఒక గోపిక – దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త. ఇన్ని లీలలు చేసినవాడు. ఆయన పరమాత్మని మనం అంగీకరించాము. మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలను ఎత్తాము. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి. మీరు చేసిన దోషము విరిచేసి మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా వున్నా దోషమును ఈశ్వరుడు చెప్పినా సరే ఈశ్వరుడి పేరెత్తనంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడినుండి వస్తుంది? అందుకని నమస్కరిద్దాము అన్నది.

మనము ఒక వ్రతం చేస్తాము. వ్రతం చేసేముందు సంకల్పం చెపుతాము. అలా చేసినప్పటికీ వ్రతఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో పోతుంది. ఈశ్వరుడిని స్మరణ చేయదు. క్రతువులో దోషం జరుగుతున్నది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి ఉంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామ స్మరణతో వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకనే ఒకటికి పదిమాట్లు కనీసంలో కనీసం భగవంతుని నామము జపించాలి. పెద్దలు నామమునకు యిచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు ఉన్న దోషమును విరుస్తుంది. అపుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని, అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణపరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్లకి ఇచ్చేశారు.

ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ‘ఓ లక్షణవతులారా! మీరు చేసిన వ్రతము ఏమిటో నాకు అర్థం అయింది. కాత్యాయనీ దేవిని మీరు నోచిన నోము దేనికొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు ఇచ్చేస్తున్నాను’. కాత్యాయనీ దేవి నోమునోస్తే ఫలితమును కృష్ణుడు ఇస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్త్వమును మనం తెలుసుకోవాలి. తత్త్వము తెలుసుకొనక పోతే మీయందు సంకుచితత్వము వచ్చేస్తుంది. ఉన్నది ఒక్కడే స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోంది. ‘ఇకమీదట మీరు చేసిన నోముకు ఫలితమును యిచ్చాను రాత్రులందు మీరు నాతో రమిస్తారు’ అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది.

ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్థరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్థరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అన్నది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. ‘అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు మీకు అజ్ఞానము నివృత్తియై ఈశ్వరుని తెలుసుకుంటారు. ఆ జ్ఞానమును మీకు యిస్తున్నాను’ అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు. పశువుల దగ్గరకు వెళ్ళారు.

‘మంద’ అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు, దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిజీవి పశువే. ఇంట్లో వున్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరి కొన్ని పాశములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. ‘మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణసాయుజ్యమును పొందుతారు. నామము ఏదయినా ఫలితం ఒక్కటే’ అని గోపికా వస్త్రాపహరణ ఘట్టములో, కాత్యాయనీ వ్రత ఘట్టములో ఇన్ని రహస్యములు చొప్పించి కృష్ణపరమాత్మ చేసిన మహోత్కృష్టమయిన లీల ఆ కాత్యాయనీ వ్రతమనే లీల.

ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ ఉంటే మనస్సు రంజిల్లి పోవాలి. అలా రంజిల్లి పోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి అర్థం తెలియనప్పుడు విశ్వాసము చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెపుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దహిస్తుంది. నామము అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుందని నమ్మి సంతోషంతో నామము స్మరిస్తూ పూజచేసినా, అంతే స్థాయిలో పనిచేస్తుంది విశ్వాసము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసము లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు, తెలిసివున్న వాడి కంటే గొప్పవానిగానే పరిగణింపబడతాడు.

అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామము చెప్పగలిగితే జ్ఞానితో సమానము. ఈ విషయమును ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయనీ వ్రత ఘట్టము పరమోత్కృష్టమయిన ఘట్టము.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[01/12, 4:15 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 80 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తుట:


ఒకనాడు నందుడు ఉపనందుడు మొదలైన ఇతర పెద్దలనందరినీ కూర్చోబెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణభగవానుడు ఈవిషయమును తెలుసుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్లు ఇంద్రుడికి అహంకారం వచ్చింది. ‘నా అంతటి వాడిని నేను – పరబ్రహ్మమేమిటి – నాకు అధికారం ఇవ్వడం ఏమిటి – నేనే వర్షము కురిపించడానికి అధికారిని’ అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. పరమాత్మ ఇంద్రునికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు.


పెద్దలందరూ కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ‘నాన్నగారూ ! పెద్దలయిన వారికి అరమరికలు ఉండవు కదా! వాళ్ళు ఏదయినా మంచి విషయమయినపుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా, వారి సలహాను వింటారు కదా! అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెప్పవచ్చని మీరు అనుకుంటే మీరు దేనిగురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా?’ అని అడిగాడు. నందుడు ‘అయ్యో నాన్నా ! నీకు తప్పకుండా చెప్తాను. అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏముంది. రా వచ్చి కూర్చో’ అని ఇలా చెప్పాడు.


‘మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతిచెంది వర్షమును కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన పశువులు తింటాయి. బాగా గడ్డి తిని ఎక్కువ పాలను ఇస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. దీనికంతటికీ మూలం ఇంద్రునికి యజ్ఞం చెయ్యడంలో ఉన్నది. ఆ యజ్ఞం చేత ప్రీతిచెంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. మేము ఇంద్రునికి ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాము’ అన్నాడు.

కృష్ణుడు ఇంద్రునికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాడు. కృష్ణుడు తండ్రిని మాయచేసి మాట్లాడుతు – నాన్నగారూ! నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరయినా సరే, వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసినకర్మ వలన వానికి గౌరవము గాని, సమాజములో ఒక సమున్నతమయిన స్థితి కాని, జన్మ కాని కలుగుతున్నది. అటువంటప్పుడు ఎవరి గొప్పతనమునకు, పతనమునకు గాని వారు చేసిన కర్మే ఆధారము. ఆ కర్మే ఫలితమును ఇస్తున్నది. మనం చేసిన కర్మవలననే మనం ఐశ్వర్యమును పొందగాలిగాము. పశుసంపద మన ఐశ్వర్యం. పశువులను పోషించుకోవడానికి గోవర్ధన గిరి గడ్డిని ఇస్తోంది. ఈ కొండమీద మన పశువులు మేస్తున్నాయి. కంటికి కనపడి ప్రతిరోజూ గడ్డి ఇస్తున్నది గోవర్ధన గిరి. కంటికి కనపడని ఇంద్రునికి యజ్ఞం చేస్తానంటున్నారు. యజ్ఞమును కంటికి కనపడే గోవర్ధన గిరికి చేయాలి. ఇంద్రయాగం వద్దు గోవర్ధనగిరికి యాగం చేద్దాము’ అన్నాడు.


కృష్ణుని మాటలకు నందుడు ఆశ్చర్యపోయి ‘నీవు చెప్తున్నది నిజమే. ఏదయినా యాగం చేస్తే దానికి ఋషి ప్రోక్తమైన ఒక కల్పము ఉంటుంది. నీవు గోవర్ధన గిరి యాగం అంటున్నావు. దానికి పూజ ఎలా చేయాలో నీకు తెలుసా?” అని అడిగాడు. కృష్ణుడు దానికి ‘ఇంద్రయాగమునకు ఏమేమి సరుకులు తెచ్చేవారో ఆ సరుకులనే తీసుకువచ్చి పూర్వం ఏ పదార్థములను వండించారో వాటిని ఈ యాగమునకు కూడా వండించండి. కానీ పూర్వం వీటినన్నిటిని పట్టుకువెళ్ళి ‘ఓం ఇంద్రాయ స్వాహా’ అని అగ్నిహోత్రంలో వేసేవారు. నేను చెప్పిన యాగంలో ఇవన్నీ తీసుకువచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోపెట్టి ముందుగా వారికీ మధురపదార్థములను పెడతే వారు తింటారు. మిగిలిన పదార్ధం బ్రాహ్మణోచ్ఛిష్టము అవుతుంది. అది మనలను రక్షిస్తుంది. ఆ మిగిలిన పదార్ధమును మనందరం అరమరికలు లేకుండా తినేస్తాము. ఆ తరువాత కుక్కలు మొదలయిన వాటిని పిలిచి వాటన్నిటికి కూడా పెడతాము. ఆ తరువాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి, జనపకట్టలు ఇవన్నీ పెడతాము అవి వాటిని తింటాయి. అవి తిన్న తరువాత వండిన పదార్ధమును కొన్ని కడవల తోటి పక్కన పెడతాము. పిల్ల పిచ్చుక, మేక కుక్క గోపకాంతలు, గోపాలురు, నేను మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధన గిరికి ప్రదక్షిణం చేద్దాము’ అన్నాడు. నందాదులు ఇదేదో చాలా బాగుంది అయితే అలా చేద్దాము అన్నారు. అనుకున్నట్లే చేసి గిరికి ప్రదక్షిణం చేయడానికి కిందికి వచ్చి గోవర్ధన గిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనకాతల పెద్దపెద్ద ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. కృష్ణుడు గోపాలబాలురిలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తు గోవర్ధన గిరిమీద ఉన్న గోవర్ధనుడిగా కనపడుతున్నాడు.


ఈ చప్పుళ్ళు ఇంద్రునికి వినపడ్డాయి. బృందావనంలో ఏమి జరుగుతున్నదని సేవకులను ప్రశ్నించాడు. భటులు ‘ మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెపుతాము. ప్రతి ఏడాది గోపాలురు వానలు పడాలని మీకు పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఈ ఏడాదినుంచి వాళ్ళు ఈవ్రతమును మార్చేశారు. మీకు చెయ్యడంలేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. వాళ్ళకి ఆ గోవర్ధన గిరియే పశువులు తినడానికి గడ్డి ఇస్తోందని వారు గోవర్ధన గిరికే యాగం చేస్తున్నారు’ అని చెప్పారు. వారి మాటలు వినేసరికి ఇంద్రునికి ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నాకు యాగం చేయవద్దని చెప్పిన వాడెవడు? గోపాలబాలురు పెరుగు నెయ్యి, త్రాగి వీళ్ళకి కొవ్వు పట్టింది. నేను ఒకనాడు పర్వతములకు ఉండే రెక్కలను నా వజ్రాయుధంతో తెగనరికాను. వజ్రాయుధమును ఆయుధముగా కలిగిన వాడిని. నన్ను పురందరుడని పిలుస్తారు. కృష్ణుడు చెప్పడం వాళ్ళు వినడం ఆయన ఏమయినా ఋషియా లేక దేవుడా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి’ అని మేఘమండలము నంతటినీ పిలిచి వీళ్ళు వర్షం కురియడం వలన వచ్చిన ఐశ్వర్యమదముతో నన్ను మరచిపోయారు. మీరు వెంటనే వెళ్ళి బృందావనం అంతా చీకటయిపోయేటట్లుగా కమ్మేసి పిడుగులు కురిపించండి, మెరుపులు మెరిపించండి. ఆ దెబ్బలకు గోవులు చచ్చిపోవాలి. జనులు చచ్చిపోవాలి. భూమికి, ఆకాశమునకు తేడా తెలియకూడదు. అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండములంత లావు ధారలు పడిపోవాలి. భూమి అంతా జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకు పోవాలి. నేను వజ్రాయుధమును పట్టుకుని ఐరావతమును ఎక్కి వెనకాతల వస్తాను మీరు వెళ్ళండి’ అన్నాడు.


గోపకులు గిరిప్రదక్షిణం పూర్తిచేసుకొని వచ్చారు. ఆవులు దూడలు ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈలోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపోయింది. ఇంతకుముందు ఎన్నడూ వినని రీతిలో పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు. ఆ మెరుపులలో వచ్చే కాంతిని అక్కడి గోవులు, ఎద్దులు దూడలు తట్టుకోలేక పోతున్నాయి. అవి ఎక్కడివక్కడ కూలబడిపోయాయి. గోపకులు కృష్ణా! నీవు రక్షించాలి, మిగిలిన ప్రాణులన్నీ మరణించక ముందే కాపాడు’ అన్నారు. పరమాత్మ ఒక్క క్షణం ఆలోచించలేదు. కృష్ణుడు అక్కడున్న గోవర్ధన పర్వతమును అవలీలగా పైకి ఎత్తి తన చిటికిన వేలు మీద పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టినట్లు ఆ మహా శైలమును పట్టుకున్నాడు. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపకులు, గోపాలబాలురు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకు వచ్చేశారు. కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆ గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దానికింద నిలబడ్డారు. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చిటికిన వేలు కర్ర. ఆయన భుజ మూపురమే దానికి ఉన్న వంపు తిరిగిన మూపు. దానికి అన్నివైపుల నుండి జాలువారుతున్న నీటి ధారలు ముత్యములతో కట్టిన అలంకారములు. దానికింద నిలబడి ‘మమ్మల్ని ఇంద్రుడు ఏమి చేస్తాడ’ని నవ్వుతున్న గోపకాంతల నోళ్లలోంచి వస్తున్న కాంతులు అక్కడ పట్టిన రత్నదీపములు, రత్న నీరాజనములు. ఆయన వారిని ఏడురాత్రులు ఏడు పగళ్ళు ఏడేళ్ళ వయసులో తన చూపులతో పోషించాడు.


కృష్ణుడు గోవర్ధన పర్వతమును పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతము క్రిందకు రావడానికి భయపడ్డారు. కృష్ణుడు -

బాలుం డీతఁడు, కొండ దొడ్డది, మహాభారంబు సైరింపగా

జాలండో? యని దీని క్రింద నిలువన్ శంకింపగాఁ బోల; దీ

శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పై బడ్డ నా

కేలల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్.

‘వీడు చిన్నపిల్లాడు పెద్ద గోవర్ధన గిరిని పట్టుకున్నాడు. ఏమో తొందరపడి క్రిందకు వెళితే పిల్లవాడు కొండను వదిలేస్తే ప్రమాదం వస్తుందేమోనని బయట నిలబడతారేమో! నన్ను నమ్మండి. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధన గిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. నేను మీకు రక్ష చెప్తున్నాను. వచ్చి ఈ కొండ క్రింద చేరండి మిమ్మల్ని నేను రక్షిస్తాను’ అన్నాడు. అందరూ వచ్చి కొండ క్రింద చేరారు. అలా ఏడురోజులు మీనాక్షీతత్త్వంతో పోషించాడు.


ఇంద్రుడు చూశాడు. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. వర్షమును, ఉరుములను, పిడుగులను ఆపించి వేశాడు వర్షం ఆగిపోయింది. ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇంత చిన్న పిల్లాడేమిటి, గోవర్ధన గిరి ఎత్తడమేమిటి? దానిని ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు పట్టుకుని ఉండడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దానిక్రింద చేరడమేమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడిరూపంలో పరబ్రహ్మము ఉన్నాడా? అని అనుమానించాడు. తన పదవి ఎగిరిపోతుందని భయపడ్డాడు. గోవర్ధన గిరి వద్దకు వచ్చి చూసేసరికి ఒక్కసారికి మహానుభావుడయిన పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ‘నన్ను కన్న తండ్రీ! పరబ్రహ్మమా పొరపాటు అయిపోయింది. మహానుభావా! అహంకారమునకు పోయాను. నా అహంకారమును తీసివేయడానికి గోవర్ధనోద్ధరణము చేసావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా! క్షమించు’ అన్నాడు. కృష్ణ పరమాత్మ ‘సరే, నీ తప్పును నీవు అంగీకరించావు కాబట్టి నీవు ఇంద్రపదవిలోనే ఉండు. నీపైన ఉన్నవాడు, నీయందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నీవు వర్షం కురిపించావు. తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు. నేను ఇచ్చాను కాబట్టి నీవు దానిని పొందగలిగావని గుర్తుపెట్టుకో’ అన్నాడు. ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కామధేనువు స్వర్గలోకం నుండి పరుగుపరుగున వచ్చి ఈశ్వరా! నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడయినా దాక్కుంటారు. మా ఆవులు, ఎద్దులు దూడలు నోరులేని జీవములు. వాటిని బయట కట్టేస్తారు. నీవు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, మా కష్టం నీకు తెలుసు. ఈవేళ గోవులను కాపాడావు. కాబట్టి నిన్ను ‘గోవిందా’ అని పిలుస్తూ ‘నీకు నమస్కారం చేస్తున్నాను’ అన్నది.


ఐరావతం పరుగుపరుగున వెళ్ళి ఆకాశగంగలో ఉన్న నీళ్ళను బంగారు కలశములలో తెచ్చి అభిషేకం చేసింది. కామధేనువు ఇచ్చిన అవుపాలతో దేవేంద్రుడు స్వహస్తములతో కలశములతో కృష్ణుడికి అభిషేకం చేశాడు. దేవతలు నాట్యం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. పుష్పవృష్టి కురిసింది. భగవానుడు గోవిందుడు అయ్యాడు. ఎవరయినా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు మాత్రమే బ్రతుకుతారు. అందుకని బ్రతికి ఉన్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవింద నామమును ఆశ్రయించి తీరాలి. ఈ గోవిందనామము ఎంత గొప్పతనమును వహించినది అంటే ఇప్పటికీ వేంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలసిన స్వామి గోవిందనామంతో పరవశించి, పద్మావతీ దేవిని వక్షఃస్థలంలో పెట్టుకొని కారుణ్య మూర్తియై పద్మపీఠం మీద నిలబడి మనకి దర్శన ఇస్తున్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: