ఈతరంలోని ఒక జంట!( 3 years ago అట)
" ఈ ముసలాయనకు ఎన్ని సార్లు చెప్పినా బుద్ధిలేదు. కారు మళ్లీ ఇక్కడే పెట్టేసారు. ఇప్పుడు మనం వీధిలో పార్క్ చెయ్యాలి చచ్చినట్టు... " , గాయత్రి మాటలు అంతటి నిశ్శబ్దపు రాత్రిలోకటువుగా ధ్వనిస్తున్నాయి.
" ఊ!"... " సెన్స్ లెస్ ఫెలో".... గొణుగుతున్నట్టు సందీప్!
మరో పదినిమిషాల్లో వీధిగేట్లు పెద్దశబ్దంతో విసురుగా వేసి, తాళం తెరుచుకుని ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్లిద్దరూ.. హాల్లో కూర్చుని ఉన్న సునందనూ, చక్రవర్తిని చూసి గతుక్కుమన్నారు.
" రాత్రి ఒంటిగంటయింది. ఇంకా నిద్రపోలేదా అత్తయ్యగారూ! ".. అంటున్న ఆమెతో , "గాయత్రి! నువ్వు, సందీప్ ఫ్రెషప్ అయి కిందకు రండి. ఒక అరగంట చాలు. మాట్లాడాలి...", శాంతంగా చెప్తున్న తల్లికేసి చూసి విసురుగా.." ఇప్పుడేం కబుర్లు? సెన్స్ లేదా? రేప్పొద్దున్న చూద్దాం"... అంటూ మేడమెట్లెక్కుతున్న సందీప్ తో కాస్త గట్టిగానే.." అమ్మ చెప్తోందిగా! మాటలాపి వచ్చి కూర్చో! " ... అన్నారు చక్రవర్తి, తన హియరింగ్ ఎయిడ్ సవరించుకుంటూ .
ఇద్దరూ విసుగుమొహాలతో వచ్చి వారికెదురుగా సోఫాలో కూచున్నారు. సునంద రెండుకవర్లు బల్లమీంచి తీసి, లేచి గాయత్రిచేతిలో పెట్టింది. ఏంటన్నట్టు భ్రుకుటి ముడిచి చూస్తున్న గాయత్రితో.. " ఒకటి 50,000₹ చెక్, మరోటి 20,000₹ చెక్ గాయత్రి. మొదటిది మీ అమ్మావాళ్లు నీ పెళ్లికి మా బట్టలూ, లాంఛనాలకు మమ్మల్నే కొని తెచ్చుకోమని పంపిన డబ్బు. దాన్ని నువ్వు వాడుకున్నా, వాళ్లకు పంపినా నీ యిష్టం. రెండోది వచ్చేనెల మీ పెళ్లి మొదటి యానివర్సరీకి మీ యిద్దరూ బట్టలు కొనుక్కోండి..."... తల్లిమాటలు ముగియకుండానే...
" హౌ జెనరస్ మమ్మీ! ఇరవైవేలకు నా ట్రౌజర్స్ కూడా రావు. ఇంకా మేము గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. బిఫోర్ వన్ వీక్ ఫ్రెండ్స్ కి పార్టీ హోస్ట్ చేస్తున్నా. నాకు కనీసం ఫైవ్ లేక్స్ కావాలి.".... మంకుగా అడుగుతున్న సందీప్ కు వత్తాసుగా .. " అత్తయ్యగారూ! అంటే మా అమ్మావాళ్లు ముష్టి ఏభైవేలిచ్చి చేతులు దులుపుకున్నారని ఎత్తిచెప్తున్నారా? ఇంత డబ్బుంది మీకు. ఇద్దరూ ఇప్పటికీ ఉద్యోగాలు వెలగపెడుతున్నారు. ఇంకా ఇంత ఆశేంటండి బాబూ! మా అక్క అత్తారు దాని గృహప్రవేశానికి గులాబీపూల తివాచీమీద నడిపించారు. అదేమంటే అదే మా బావగారికి. వాళ్లమ్మని నోరెత్తనివ్వడాయన. సందీప్! నేను మీ ఇంటికొచ్చినప్పటి నుండి మీ అమ్మ నన్ను ఎన్ని విధాల అవమానిస్తోందో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వే చూస్తున్నావు. ఈమె పెద్ద స్కాలర్ లాగా నా ఇంగ్లీష్ సరిచేస్తుంది. నన్ను చూస్తేనే ఆవిడకు మొహంలోకి అసహనం పొడుచుకుని వచ్చేస్తుంది, మీ ఫాదరయితే నాతో మాట్లాడనే మాట్లాడరు. మా అక్క మామగారయితే దాన్ని ప్రతీ పండక్కూ కార్లో షాపింగ్ కు తీసుకెళ్లి ఎన్ని నగలు కొంటారో. ఛీ! ఒక్క కొడుకువన్న మాటే కానీ నీకు ఈయింట్లో ఒక గౌరవమా! విలువా! నేనే నీ వలలో పడి ఈ దరిద్రపుపెళ్లి చేసుకున్నా. ఓ ముద్దులేదు. ముచ్చటలేదు. ఓ పెట్టుపోతలు లేవు! పైగా ఇదిగో ఇలా సాధిస్తున్నారు నన్ను..." కలగలపు మాటలతో లేని కన్నీరు తెచ్చుకుని కళ్లు నలిపేసుకుంటోంది గాయత్రి.
" షిట్ మమ్మీ! నువ్వింత మీన్ ఏంటి!? అక్కకొకలాగా, గాయత్రికొకలాగ?.. ", పబ్ లో తాగి వచ్చినట్టున్నారు ఇద్దరూ, మాటలూ, మనుషులూ నిలకడగా లేరు.
సునంద తనమొహంలో ఎలాంటి భావం వ్యక్తపరచకుండా, భర్తకేసి సాలోచనగా చూసింది.
చక్రవర్తి ముక్తసరిగా..." సందీప్! గాయత్రీ! మీరు వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోండి. ఇక్కడ మీరు ఇబ్బందులు పడలేరు. మేము మీకు నచ్చేట్టు ఉండలేము. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పరవాలేదు. ఎఫర్డ్ చెయ్యగలరు.." ఖచ్చితస్వరంతో చెప్పారు.
నెత్తిమీద పిడుగుపడ్డట్టు అయింది ఇద్దరికీ!
" అర్ధాంతరంగా ఎక్కడకు పోతామండి? ఈ యిల్లు మాది కూడా. మీకు మమ్మల్ని పొమ్మనే హక్కులేదు! పిచ్చిపిచ్చిగా వాగారంటే ఇప్పుడే పోలీస్ కంప్లయింట్ ఇచ్చి , హరాస్ మెంట్ కేసు పెడితే , బొక్కలో పడేస్తారు"..... పెద్దంతరం చిన్నంతరం లేకుండా, గట్టిగా నోటికొచ్చినట్టు అరుస్తూ మొహం వికృతంగా పెట్టుకున్న గాయత్రిని వారించి సునంద.
.." నిదానం గాయత్రి! నేను మీ అమ్మను కాదు. నీ మాటలూ, కోపం పడడానికి. నీకు సందీప్ ఏం చెప్పాడో తెలీదు కానీ, ఈయిల్లు మా పూర్తి స్వార్జితంతో కట్టుకున్నదే. ఐదేళ్లనుండి ఉద్యోగం చేస్తూ కూడా సందీప్ నాకు కనీసం ఒక పట్టుచీర కూడా కొనలేదంటే నువ్వు నమ్ముతావా? వాడు చిన్నప్పటినుండీ స్వార్ధపరుడు. వాళ్లక్కను దాని పెళ్లయ్యేవరకూ హింసిస్తూనే ఉండేవాడు. దానికి ఏంకొన్నా గొడవే. వీడి బాధ పడలేక అది మెడిసిన్ మూడో యేటనే తన సీనియర్ ని తిరుపతిలో ప్రేమ వివాహం చేసుకుని మానుండి విడిపోయింది. ఈ ఇంట్లోంచి పూతికపుల్ల తీసుకెళ్లలేదు. సందీప్ కూ తెలుసు ఆ విషయం. లక్షల్లో జీతం వస్తున్నా, మేము ఈ విల్లా కొంటుంటే డబ్బు సరిపోకపోతే మా అల్లుడు సాయం చేసాడు కానీ, వీడు పైసా తియ్యలేదు. మేం అడగలేదు."
" నువ్వడిగావా నన్ను? అడిగితే పడేసుండేవాడిని..." విసురుగా అరిచాడు సందీప్!
" అవన్నీ అప్రస్థుతం సందీప్. నువ్వూ, గాయత్రి ఇక్కడ మాతో ఆనందంగా లేరు. జీవితమంతా గొడవలు పడేకన్నా , ఇలా విడిపోయి బతికడం మేలు. మేము కావాలనుకుంటే మీరు వస్తూ పోవచ్చు."
"ఓ! రేప్పొద్దున్న మాకు పిల్లలు పుడితే, ఆ బాధ్యతెక్కడ నెత్తిమీద పడుతుందో అని ముందే ప్లాన్ చేసి నాటకం మొదలుపెట్టారా?..." ముదనాపసానిలా చేతులు తిప్పుతూ అరుస్తున్న గాయత్రిని చూస్తే కంపరం కలిగింది సునందకు. ఆ అందమైన రూపం వెనకాలున్న వికృతమైన అంతరంగం ఆమెను ఎప్పుడూ కలతపెడుతూనే ఉంది.
" అదే అనుకో గాయత్రి. నీ మాటల్లోనే చెప్తా విను. మేము ముసలాళ్లం. మీ మావగారి ఆస్థమా నీకు నిద్రలేకుండా చేస్తోంది. ఆయన ఖాండ్రించి, శ్లేష్మం బయటకు తీస్తుంటే నీకు తిన్నదంతా బయటకొస్తోంది, వంటామె రాస్కెల్..నీకు నచ్చినట్టు వండదు. పనామె.. బిచ్..నీ గది సర్దదు. అత్తగారికి డబ్బుపిచ్చి. ఇంటిపట్టున పడుండకుండా, ఉద్యోగాలని ఊరమ్మట తిరుగుతుంది. ఇంగ్లీషులో మాట్లాడుతుంది. కంప్యూటర్ దగ్గరే పడుంటుంది. చెవిటి మావగారు గట్టిగా టీవీ పెడతాడు. గతిలేని వాళ్లలా మీవాళ్ల దగ్గర ఏభైవేలు తీసుకున్నారు. నీ ఆడపడుచొక నంగనాచి. మనసులో విషం పెట్టుకుని తియ్యగా మాట్లాడుతుంది..... ఇలా నీ బుర్రంతా పాడుచేసుకుంటూ, మేము వినాలని ఫోన్ లో గట్టిగా మాట్లాడుతూ మీ అమ్మగారికీ, అక్కకూ ఫోన్లు చేసుకుంటూ..., ఇదిగో ఇప్పుడు ఏకంగా పోలీస్ రిపోర్టే ఇచ్చేస్తానని....! ఎందుకమ్మా ఇవన్నీ! మాకు ఈవయసులో ఈ వత్తిడిలన్నీ అవసరమా? మా వయసుల బట్టీ మా ఆరోగ్యాలూ, తిళ్లూ , అలవాట్లూ ఉంటాయి. అవి మీ వయసుకు పడవు. మీ మావగారు పెద్ద సెంట్రల్ ఎక్సైజ్ కమీషనర్ చేసారు. పదిమందీ గౌరవంతో సెల్యూట్లు కొట్టిన ఉద్యోగజీవితం ఆయనది. ఈరోజు ఎవరో ఓ బయటమ్మాయి వచ్చి" ముసలాడు" అంటూ పేర్లుపెడుతూ, ఆయన దగ్గినా, తుమ్మినా అసహ్యించుకుంటూ..... మాకవసరమా ఇవన్నీ. సందీపకు మామూలుగానే ప్రేమాభిమానాలు తక్కువ. తన జరుగుబాటు తప్పా వాడికి మా సమస్యలు పట్టవు. . ఇప్పుడు వాడిని మాతో మాట్లాడకుండా కూడా నియంత్రించి, వాడిలో ఉన్న కాస్తమనిషిని కూడా పధకం ప్రకారం చంపుతున్నావు. మాకు ఎవరూ వద్దు. కాస్త ప్రశాంతతతో మా జీవనసంధ్య గడిచిపోతే చాలుమాకు. బయట మీకొచ్చినట్టు బతకండి. మేము తలదూర్చం. ఎవరూ ఎవరికి జవాబుదారులు కావక్కరలేదు!.. దీర్ఘంగా నిశ్వసించి ముగించింది సునంద.
ఆమె సంభాషణ సాగుతుండగానే, ఒక తమాషా నయనావధానం సందీప్ గాయత్రిల మధ్య నడిచింది. ఒక మౌనభాష, కళ్ల మధ్య పయనించిన సందేశాలు.. ఈతరం పిల్లల అఖండమేధస్సును, అవకాశవాదాన్నీ సూచిస్తూ....!
సందీప్ దిగ్గున లేచొచ్చి తల్లి చెంత నేలమీద కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టుకుని ఏడవసాగాడు. తన తల నిమురుతున్న తల్లిని చూస్తూ...." అమ్మా! నువ్వూ, నాన్నాగారూ పరాయివాళ్లా నాకు. మీరిద్దరూ నా ప్రాణం. మిమ్మల్ని విడిచి నేనెక్కడికీ పోలేను. మీరు నాకెంత చేసారు? లక్షల్లో డొనేషన్లు కట్టి చదివించారు. మీ ప్రేమను అక్కతో పంచుకోలేనంత ప్రాణం అమ్మా నువ్వంటే నాకు. రేపే వెళ్లి అక్క కాళ్లమీద పడతాను! నన్ను దూరంగా పొమ్మనకు. నా ఫీలింగ్స్ నేను అందరిలా ఎక్స్ప్రెస్ చెయ్యలేను. నాకు ఎలా బతకాలోకూడా తెలీదు. గాయత్రి నీ మనసింత బాధపెట్టిందని తెలీదు. నేను తననైనా దూరం చేసుకుంటా కానీ, మిమ్మల్ని విడిచి కాదు..! నాన్నా! నువ్వేనా చెప్పు.."... అతని శరీరంలో అధికమోతాదులో చేరివున్న ఆల్కహాల్ అతనికి ఉద్వేగంగా మాట్లాడడానికి సాయం చేస్తోంది.
హఠాత్తుగా గాయత్రి హీస్టీరియా వచ్చినదానిలా ఏడ్చుకుంటూ, చక్రవర్తిగారి కాళ్లమీద పడిపోయింది " క్షమించండి మామయ్యా! " అంటూ! . అసలే సౌమ్యుడూ, నెమ్మదస్తుడూ అయిన ఆయన ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయి.... " లేమ్మా! లే లే! " అంటూ భార్యకేసి చూస్తున్నారు.
సునందకు నవ్వూ, ఏడుపూ కలగాపులగమై పలమారింది. కాసేపటి మౌనం తరువాత జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఆమె నోరిప్పింది.
" అమ్మా నేనూ గాయత్రీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ , తననే పెళ్లిచేసుకుంటానని సందీప్ చెప్పినప్పుడేదో అనుకున్నా. కానీ మీరిద్దరూ అంతకన్నా ఎక్కువ! మేము నిర్ణయించుకున్నాం గాయత్రి. ఈ వయసులో ఈ గొడవలు, మాటలూ పడే ఓపిక మాకు లేదు. మా ఆఖరి క్వార్టర్ ఆఫ్ లైఫ్ మేము ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా బతకాలని నిర్ణయించుకున్నాం. మా కూతురు కూడా మాకు ఏ బాధ్యతలూ ఇవ్వకుండా ఏర్పాటుచేసుకుంది. మీరిద్దరూ ఉద్యోగస్థులు! సంపాదించుకుంటున్నారు. సులువుగా బతగ్గలరు! సందీప్ కు సేవింగ్స్ ఉన్నాయి. సో! మీరు మీ ఆనివర్సిరీ తరవాత వేరే యింటికి మూవ్ అయిపోతే మాకూ రిలీఫ్!"
" ఇదంతా మా అమ్మ మప్పిన మాటల వలన వచ్చిన గొడవండి అత్తయ్యగారూ! మా అమ్మతో, అక్కతో కంప్లీట్ కట్ చేసేస్తా! మళ్లీ ఫోన్లు చేస్తే చెప్పు పెట్టి కొట్టండి నన్ను..." కళ్లలో నీళ్లు లేకుంటానే వెక్కుతూ అంది గాయత్రి.
మళ్లీ నవ్వొచ్చింది సునందకు. " గాయత్రి! నువ్వు పదే పదే మేము లాంఛనాలు తీసుకున్నామని దెప్పుతుంటే... నేను మీ అమ్మగారికి ఫోన్ చేసా. వాళ్లిచ్చిన ఏభైవేలూ పంపేస్తున్నానని. ఆవిడేం చెప్పారో తెలుసా? నీ పెళ్లిలో నగలనీ, బట్టలనీ, సంగీత్ లనీ నువ్వే పేచీపెట్టి లక్షలు ఖర్చుపెట్టించావని, నిజానికి ఏభైవేలకు సందీప్ కు సూట్ కూడా రాదని,మేము చాలా ఉత్తములని చెప్పారామె. మోరోవర్ మీ అక్క అత్తారిగురించి ఆవిడ వేరేగా చెప్పారే! ఇప్పటికీ పుట్టింటినుండి దోచుకుతెమ్మనమని ఆ పిల్లను నానా యాతనా పెడతారట కదా! ఆవిడ మీ యిద్దరి మనస్థత్వాల గురించి చెప్తూ ఎంత బాధపడ్డారో! ఎందుకమ్మా పాపం ఆవిడను చెడుచేస్తావ్. అందుకే వెళ్లిపోండి. బయటప్రపంచం మీకు తెలియాలి! నిజమైన జీవితం ఏంటో తెలుస్తుంది.."
గాయత్రి దిగ్గున లేచింది. కాలితో బలంగా గాజుటీపాయిని తన్నింది. కోపంతో మహంకాళిలా ఉంది. సందీప్ ను వాళ్లమ్మ ఒళ్లోంచి ఒక్క లాగు లాగింది. " థూ! నీ వెధవమాటలు నమ్మి ఈ ముష్టిపెళ్లి చేసుకున్నా. రేపే పోదాం బయటకు. ఈ ముసలాళ్లకు ఈవయసులో ప్రైవసీ కాలాలట. సిగ్గులేకపోతే సరి. నా వెనకాల ఫోన్లుకొట్టి గూఢచార్యం చేస్తోంది. ".... అరుస్తూ పెద్ద అంగలేసుకుంటూ మెట్లెక్కుతున్న పెళ్లాన్ని చూసి సందీప్ కే భయం వేసేసింది... ఈ అమ్మాయితో బయటికెళ్లి బతికి బట్టగలనా!? అని!
చక్రవర్తిగారు చెవిమిషన్ తీసేసారు కనుక బతికిపోయారు. లేకపోతే పైనుండి వినిపిస్తున్న ఆ అరుపులకు , ఆ భాషకూ సిగ్గుతో స్థాణువైపోయేవారు.
సునంద ఒక లెక్చరర్ గా, సంఘసేవికగా గాయత్రిలాంటి ఎందరో ముదుర్లనూ, సందీప్ లాంటి అవకాశవాదుల్నీ చూసింది. వీళ్లు మొక్కలూ కాదూ, మానులూ కాదు వంచడానికి.
కలుపులు! చీడలా కుటుంబవ్యవస్థను అస్థవ్యస్థం చేస్తున్నారు. మంచిబాంధవ్యాలను చెందనాడుకుంటున్నారు. వీళ్లను దూరం పెట్టడమే క్షేమం. కాలమే పాఠాలు నేర్పుతుంది. నేర్చుకుంటే బాగుపడతారు. కాదంటే వీళ్ల ఖర్మ.
భారంగా లేచింది సునంద, కొత్తఉదయానికి తలుపులు తెరుస్తూ!
ఓలేటి శశికళ
29-11-2019
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి