1, డిసెంబర్ 2022, గురువారం

అన్నదానం

 అన్నదానం - అతిథిసేవ


చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారు కలవైలో మకాం చేస్తున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో చలా మంది స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. ఒకరి తరువాత ఒకరు ఆ వచ్చిన వారు స్వామివారికి సాష్టాంగపడి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మధ్యవయస్కులైన ఒక జంట స్వామివారికి నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డారు. స్వామివారు వారిని తేరిపార చూసి, “అరెరె ఎవరు? పాలూరు గోపాలన్! సంవత్సరం క్రితం వచ్చావు ఏవో సమస్యలు ఉన్నాయని. ఇప్పుడు హాయిగా ఉన్నవా?” అని గట్టిగా నవ్వారు. 


ముకుళిత హస్తాలతో పాలూర్ గోపాలన్ “మేము చాలా బాఉన్నాము పెరియవా! మీరు చెప్పినట్టుగానే, మధ్యాహ్నం పూట రోజూ ఒక అతిథికి అన్నం పెట్టడం మొదలుపెట్టినప్పటి నుండి అంతా మంచే జరుగుతోంది. నా పొలంలో పంటలు బాగా పండుతున్నాయి. మునుపటిలాగా ఆవులు చనిపోవడం లేదు. అనవసరంగా ఖర్చు అవుతున్న ధనం ఇప్పుడు చేతిలో నిలబడుతున్నది. అంతా మీ అనుగ్రహం వల్ల మీరు ఆజ్ఞాపించినట్టుగా చేస్తున్న అతిథిసేవ వల్లనే. అంతే మరేంలేదు. ఒక్కరోజు కూడా తప్పకుండా చేస్తున్నాను” అని అంటుండగా కళ్ళ నీరు పెట్టుకున్నాడు. పక్కనే నిలబడ్డ ఆయన భార్య కూడా ఆనందంతో కళ్ళనీరు కార్చింది. 


అంతా విని స్వామి వారు “భేష్ భేష్! అతిథిసేవ వల్లే ఇంత మంచి జరుగుతోందని నువ్వు అర్థం చేసుకున్నావు కదా మంచిదే. అదిసరే ఈరోజు ఇద్దరూ ఇక్కడికి వచ్చారు కదా. మరి అక్కడ పాలూరులో అతిథిసేవ ఎవరు చేస్తారు?” అని ఆందోళనగా అడిగారు. 


గోపాలన్ భార్య వెంటనే “మేము అందుకోసం వేరే ఏర్పాట్లు చేసాము పెరియవా. ఎట్టి పరిస్థితిలోను అతిథి సేవ చెయ్యకుండా ఉండము” అని చెప్పింది.


ఆ విషయం విని మహాస్వామి వారు చాలా సంతోషించారు. “అవును చెయ్యవలసిన పద్ధతి ఇదే. ఆకలిగొన్న వారిని ఆదరించాలన్న సంకల్పం స్థిరంగా ఉండాలి. అతిథిసేవ ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే అది నీ వంశాన్ని కాపాడుతుంది. ఒకరోజు సాక్షాత్ పరమేశ్వరుడే అతిథి రూపంలో నీ ఇంటికి వచ్చి కూర్చుని తిని వెళ్తాడు. తెలుసా?” అని అన్నారు.


స్వామివారు కుతూహులంతో మాట్లాడుతున్నారు. స్వామివారు మాట్లాడుతున్న ఈ అనుగ్రహ వాక్కులను వినడానికి వరుసగా నిలబడ్డవారంతా స్వామి చుట్టూ చేరారు. స్వామివారు అందరినీ నేలపైన కూర్చోమన్నారు అందరూ కూర్చున్నారు.


ఒక భక్తుడు స్వామివారిని “అతిథి సేవ చెయ్యడంలో అంత గొప్పదనం ఉందా స్వామి?” అని అడిగాడు. వెంటనే స్వామివారు బదులిస్తూ, “అవును అవును అది అత్యంత పుణ్యప్రదం. ఈ పుణ్యకార్యం వల్ల మోక్షం కూడా లభిస్తుంది. ఈ సత్కార్యం ఎంతో మందిని ఉద్ధరింపజేసింది. మీరు కేవలం అటువంటి అనుభవాన్ని పొందిన పాలూర్ గోపాలన్ వంటి వారిని అడిగినప్పుడు మాత్రమే దాని ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది” అని అన్నారు.


ఒక భక్తుడు లేచి నిలబడి స్వామివారికి సాష్టాంగం చేసి, వినయంగా ఇలా అడిగాడు. “నా పేరు రామసేతు. నేను తిరువణ్ణమలై నుండి వచ్చాను. మేమందరమూ స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. మాకు అర్థమయ్యేట్టుగా ఈ అతిథి సేవ గురించి సవివరంగా తెలపలసిందిగా అర్థిస్తున్నాము. స్వామి వారు మా మీద కరుణ చూపాలి”


స్వామివారు అతణ్ణి కూర్చోమన్నారు. అతను కూర్చున్నాడు. అక్కడున్న అందరూ నిశ్సబ్ధంగా స్వామి వారిని చూస్తున్నారు. కొద్దిసేపటి తరువాత ఆ పరబ్రహ్మం మాట్లాడింది. 


”నాకు గుర్తున్నంత వరకు అది 1938 లేదా 1939 సంవత్సరం. శంకర మఠం వ్యవహారాలన్నీ కుంబకోణం నుండి జరిగేవి. అప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మీకు చెబుతాను. మీరు భక్తిగా వింటే ఈ సంఘటనలో ఉన్న ఆంతర్యం మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్తాను వినండి”.


స్వామివారు కొద్దిసేపు ఉండి మరలా చెప్పనారంభించారు. “కుంభకోణం మహామాహం కొలనుకి పడమరవైపు ఒక పెద్ద ఇల్లు ఉంది. ఒక కిరాణా కొట్టు వ్యాపారి కుమరేసన్ చెట్టియార్ నివసించేవాడు ఆ ఇంట్లో. నాకు బాగా గుర్తు ఆయన్ ధర్మపత్ని పేరు శివకామి ఆచి. వారు కరైకుడి సమీపంలోని పల్లత్తూర్ నుండి వచ్చారు. ఆ దంపతులకు సంతానం లేదు. వారి స్వగ్రామం నుండి ఒక మంచి పిల్లవాణ్ణి తెచ్చి కొట్టు చూసుకోవడానికి వారి వద్దనే ఉంచుకున్నారు.


అప్పుడు కుమరేసన్ చెట్టియార్ వయస్సు యాభై లేదా యాభైఐదు. ఆవిడ వయస్సు యాభైలోపే. ఆ పుణ్య దంపతుల నోటి నుండి ఎప్పుడు ‘శివ శివా. . . శివ శివా’ అనే నామమే వస్తుంటుంది. ఆ నాస్మరణ తప్ప వేరే మాటలేదు. చెట్టియార్ గారి ఇంట్లో ఒక ఎద్దులబండి ఉండేది. ఆచిని బండిలో కూర్చోపెట్టుకుని చెట్టియార్ బండిని తోలుకుంటూ స్నానానికి కావేరి నదికి వెళ్ళెవారు. స్నానాదులు ముగించుకొని మా మఠానికి వచ్చి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. వారిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. వారి గురించి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వినండి”.


పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి మరలా మట్లాడదం మొదలుపెట్టారు. “అన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న పని ఏమిటో తెలుసా? అతిథిని సేవించి పూజించడం. ఆశ్చర్యపడకండి. వారు పరతిరోజు మద్యాహ్నం శివభక్తులందరిని వారి ఇంటిలో అన్నం పెట్టి ఆదరించేవారు. ఎంతమంది అథిథులుగా వచ్చినా దిగులు పడకుందా వండి వడ్డించేవారు. ఆ వచ్చినవారిని ఇంటి వసారాలో కూర్చోబెట్టి నీళ్ళతో వారి కాళ్ళు కడిగి, బట్టతో తుడిచి, గంధము కుంకుమ పూసి, లోపలికి తిసుకునివెళ్ళి కూర్చుండచేసేవారు.


వారింట్లో వంటవారు ఉండేవారు కాదు. ఆ అమ్మే ఎంతమందు వచ్చినా భోజనం వండేది. మరొక్క విషయం ఏంటంటే ఆ వచ్చిన వారికి ఏమి ఇష్టమో అడిగి తెలుసుకుని వాటీని తీసుకుని వచ్చి వారికి నచ్చిన పదార్థాలతో భోజనం సిద్ధం చేసేవారు. అంతటి సహృదయులు. నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారా? అందులో మర్మమేమి లేదు. శ్రిమఠానికి సంబధించిన సుందరం అయ్యర్ అనేవారు ఆ కుమరేసన్ చెట్టియార్ లెక్కలు చూసేవారు. అతనే ఈ విషయాలన్నీ ఖాళీగా ఉన్నప్పుడు నాతో చెప్పేవాడు. అర్థమైందా?


స్వామివారు కొద్దిసేపు ఆపి, అందరిని పరికించి చూసారు. కూర్చున్న చోటినుండి ఒక్కరు ఒక్క అంగుళం కూడా కదలలేదు. అందరూ స్వామివారినే ఉత్సుకతతో చూస్తున్నారు. మరలా స్వామి వారు ఇలా చెప్పారు. “ఒకరోజు చాలా పెద్దగా వర్షం పడుతోంది. అప్పుడు మధ్యాహ్న సమయం. కుమరేసన్ చెట్టియార్ ఇంటి ద్వారం వద్దకు వచ్చి అటు ఇటు చూసాడు.కాని అతిథి ఎక్కడా కనపడలేదు. ఒక గొడుగు తిసుకుని అలా మహామహం కొలను దాకా వెళ్ళాడు అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూడసాగాడు. 


అక్కడ ఒక శివభక్తుడు స్నానం ముగించుకుని ఒళ్ళంతా విభూతి పూసుకుని కూర్చున్నాడు. చెట్టియార్ అతణ్ణి ప్రార్థించి అథితిగా తన ఇంటికి రమ్మని అర్థించాడు. అతను బాగా విధ్వాంసుడిలా కనిపిస్తున్నాడు. తేవారం పాడుకుంటూ చెట్టియార్ ను అనుసరిస్తూ వెళ్ళాడు. అతనికి కాళ్ళు కడిగి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చుండచేసాడు. దంపతులిద్దరూ నేలపై పడి సాష్టాంగం చేసారు. ఆచి ఆ శివభక్తుని దగ్గరకు వెళ్ళి, ‘స్వామి వారికి ఏమి ఇష్టమో చెప్తే, అంగడికి వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి వంటచేసి పెడతాను’ అని అన్నది. 


ఆ శివభక్తుడు చాలా ఆకలి మీద ఉన్నాడేమో, లెచి వెళ్ళి పెరటి వైపు చూసాడు. అక్కడ లేత బచ్చలికూర కనపడింది. అతను వెనక్కువచ్చి ఆ అమ్మతో బచ్చలి కూటు మరియు దాని కాడలతో సాంబారు చాలన్నాడు. చెట్టియార్ ఒక వెదురు బుట్ట తీసుకుని బచ్చలి ఆకు కొయ్యడానికి వెళ్ళాడు. అప్పటికి వర్శం నిలిచిపోయింది. ఆలస్యమవుతుండడంతో ఆకలిగొన్న ఆ శివభక్తుడు సహాయం చేయదలచి తను కూడా ఒక బుట్ట తీసుకుని కూర కోయడానికి వెళ్ళాడు.


శివకామి ఆచి పెరటి తలుపు వద్ద నించుని కూర సేకరిస్తున్న ఇద్దరిని చూస్తోంది. కొద్దిసేపటి తరువాత ఇద్దరూ తమ పళ్ళలను అక్కడ పెట్టారు. అప్పుడు ఆ తల్లి ఏమి చేసిందో తెలుసా? రెండు బుట్టలలోను ఉన్న ఆకుకూరని విడిగా కడిగి, రెండు పొయ్యలను వెలిగించి, రెండు కుండలలో వండడం మొదలు పెట్టింది. దీన్ని గమనించిన ఆ శివభక్తుడు ఆశ్చర్యపోయాడు. అతను అయోమయంతో ‘ఏమిటిది? రెండింటిలోను ఉన్నది ఒకే ఆకుకూర కదా? మరి ఒకే కుండలో వండకుండా రెండింటిలో వండడం ఎందుకు?’ అని మనసులో అనుకున్నాడు. 


కొద్దిసేపటి తరువాత ఆచి ఆ రెండూ మంటపై నుండి దించి, ఆ భక్తుడు తెంపిన కూరతో వండినదాన్ని మాత్రమే పూజగదిలోకి తీసుకుని వెళ్ళి, ఈశ్వరునకు నివేదన చేసింది. ఇది చూసిన ఆ భక్తుడు చాలా సంతోషపడ్డాడు. ఏమనుకున్నాడో తెలుసా? ‘నేను పెద్ద శివభక్తుణ్ణి, సన్యాసిని. నేను తెంచిన ఆకుకూరతో వండినదాన్ని మాత్రమే ఈశ్వరుడు తింటాడని ఈ తల్లి అర్థం చేసుకుంది. సరే భోజనం చెసిన తరువాత దీని గురించి అడుగుదాం!’ అని అనుకున్నాడు. 


స్వామి వారు కొద్దిసేపు ఆగి, తమ ఎదురుగా కూర్చున్న భక్తులవైపు చూసారు. అందరూ నోరెళ్ళబెట్టి వింటున్నారు. స్వామివారు మళ్ళా ”ఆ శివభక్తుడు భోజనం ముగించి, అతని సందేహాన్ని ఆచితో అడిగాడు. అందుకు ఆచి ఏమి చెప్పిందో తెలుసా? ఆమె అన్నది ‘అయ్యా, మీరిద్దరూ పెరటిలో ఆకుకూర కోస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, నా భర్త ప్రతి ఆకుని ‘శివా. . శివా. . . ’ అని శివనామం చెప్తూ కోస్తున్నాడు. కబట్టి అది అక్కడే అప్పుడే శివార్పణం అయుపోయింది. దాన్ని మళ్ళా నివేదించవలసిన అవసరం లేదు. మీరు మాత్రం ఏ నామమూ పలకకుండా కోసారు. అందుకే వేరే పొయ్యిలో వేరేగా వండి స్వామికి నివేదించాను.’ ఆ భక్తునికి ఒళ్ళు గగుర్పొడిచింది ఈ విషయం విని. ఆ దంపతులిద్దరూ ఆయనకు నమస్కరించారు. ఆ ఆచి భక్తిని, జ్ఞానాన్ని మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అన్నాన్ని అలా అర్పించినవారు ఆ దంపతులిద్దరూ. 


ఇంతటి నిస్వార్థ అతిథి భోజనం పెట్టినదానికి ఫలప్రాప్తి ఏమిటో తెలుసా? కొన్ని సంవత్సరాల తరువాత వారు షష్టిపూర్తి చేసుకుని, ఒక మహాశివరాత్రి నాడు కుంబేశ్వరుని దేవాలయంలో నాలుగు యామ పూజలను చూసారు. ఇంటికి వచ్చిన తరువాత పూజ గదిలో కూర్చున్న ఆ తల్లికి శోష వచ్చినట్టు అయ్యి, బయటకు వచ్చి కొన ఊపిరి తీసుకుంది. దీన్ని చూసి కంగారుగా చట్టియార్ పరుగుపరుగున వచ్చి, నేలపైన పడిపోయాడు. అంతే! మహాశివరాత్రి రోజు ఇద్దరూ ఒకేసారి శివసాయుజ్యం చేరుకున్నారు. నిరంతర అతిథిసేవ, అన్నదానం వారికి ఆ సద్గతి కలిగేట్టు చేసింది. ఇప్పటికి ప్రతి మహాశివరాత్రికి నేను ఆ దంపతులను స్మరిస్తాను. అన్న దానాన్ని అంత గొప్పగా చేసిన మహాత్ములు వారు”.


స్వామి వారు చెప్పడం ముగించారు. అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీరు కారుతోంది. మహాస్వామి వారు లేచి నిలబడి, “మద్యాహ్నం రెండు గంటలు అయినట్టు ఉంది. అందరికి ఆకలిగా ఉంటుంది. వెళ్ళండి. లోపలికి వెళ్ళి భోజనం చెయ్యండి” అని అందరిని పంపించారు. 


--- శ్రీ యస్. రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: