1, డిసెంబర్ 2022, గురువారం

 స్వామి తన కోసం ఏది కొరరు...

ప్రదోషం మామ భార్య కూడ పరమాచార్య వారి భక్తురాలు. ఒకరోజు స్వామి ఆమెకు స్వప్నం లో కనిపించి "సమోసా చేసిపెట్టు "అనీ కోరారు. ప్రక్క రోజు ఆమె శుచిగా స్నానం చేసి శ్రద్దగా సమోసాలు చేసి స్వామి వద్దకు తీసికొని వెళ్ళింది.స్వామి మూత తీయమని వాటికేసి చూసి నవ్వుతూ "సమోసాలు అద్భుతం గా ఉన్నాయి. వీటిని ప్రక్కనే ఉన్న వేద పాఠశాల కు తీసుకొని వెళ్లి అక్కడ విద్యార్థులకు స్వయంగా నువ్వే వడ్డీంచు." అన్నారు.

ఆమె అలాగే చేసి విద్యార్థులు తింటుంటే స్వామి వారు తిన్నట్లే ఆనందించింది.తరువాత విచారిస్తే కొందరు విద్యార్థులు సమోసాలు పెడితే బాగుండు అని కోరుకున్నారని తెలిసింది. సర్వాంతర్యామికి తెలియనిది ఉండదుగా. అందుకే తనకు పెట్టమని అడిగి వారికీ పెట్టించారు.

ఒకసారి ఒక స్త్రీ స్వామి వారిని జపమాల, రుద్రాక్షలు  అనుగ్రహించమని కోరితే వారు మఠం వారికీ చెప్పి ఇప్పించారు. ఆమె స్వామి వారికోసం ఏదైనా సమర్పించాలి అని భావించి అప్పడాలు, వడియాలు మడితో శుచిగా చేసి వారి ముందుంచి "స్వీకరించమని "ప్రార్ధించింది.

స్వామి "వీటిని నేను స్వీకరించాలని గదా నీ కోరిక. అలాగే."అని శిష్యులవైపు చూసి "వీటిని వేద పాఠశాలలో పిల్లలకు భోజనం చేసేటప్పుడు వడ్డీంచండి. వారు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు."అని చెప్పారు.

ఆమెకేసి చూస్తూ "వాళ్ళు తింటే నేను తిన్నట్లే."అని నవ్వారు.

కామెంట్‌లు లేవు: