భారతీయ శిల్పాలు కేవలం రాతి విగ్రహాలు కావు
పాచ్యపాశ్చాత్య సాంస్కృతిక మూల్యాలను పరస్పరం అవగాహన చేసుకునే నిమిత్తం, ఏర్పడిన యునెస్కో వారి ప్రాచ్యపాశ్చాత్య బృహత్పథకం క్రింద, హెన్రీ లేనార్ట్స్ అనే బెల్జియన్ శిల్పి భారతదేశంలో పర్యటించటానికి వచ్చారు.
వారి అధ్యయన విషయం భారతీయ నాగరకత - హిందూ, బౌద్ధమతాలకు ఇదివరలోనూ ఇప్పుడూ భారతీయ సంస్కృతి మీద వున్న ప్రభావం అనేది.
మత సముద్ధరణ కేంద్రాలుగా ప్రసిద్ధికెక్కిన సంస్థలను సందర్శిస్తూ 24-1-1965వ తేదీన వారు కంజీవరంలో కామకోటి పీఠాధిపతులను కలుసుకున్నారు. టి.ఎన్. రామచంద్రన్ వారిని వెంటబెట్టుకు వచ్చారు.
లేనార్ట్స్ : ఆధునిక నాగరకత గురించి మీరేమనుకుంటున్నారు? మానవ పురోగమనానికి అది దోహదం చేస్తుందనుకుంటున్నారా?
స్వామివారు : చేయదనే అనుకుంటున్నాను. ఎందువల్ల నంటే దానికి మానవుల మనస్సును కలుషితం చేసే గుణం వుంది. అలా చేయబట్టే ఈనాడు ప్రపంచంలో ఇంత దారుణమైన ఘర్షణ, ఇంత హింస, ఇంత ఆర్తీ చూస్తున్నాము.
లేనార్ట్స్ : అరణ్య జీవిత, నగర జీవితాల్లో ఏది మంచిది?
స్వామివారు : నిస్సందేహంగా అరణ్య జీవితమే మంచిది. అరణ్యాల్లో సామాన్యంగా అమాయికంగా కలతకూ, కార్పణ్యాలకూ దూరంగా జీవించవచ్చు కాని నగరాల్లో అలాకాదు. ఉండటానికి అన్ని సౌకర్యాలూ, ఆధునిక నాగరకత సమకూర్చి పెట్టిన అన్ని సుఖాలూ వుంటాయి. కాని చిత్తశాంతి మాత్రం వుండదు.
లేనార్ట్స్ : నాగరకతకు చైతన్యం వుంది. అది జడం కాదు. అందువల్ల అదెప్పుడూ పురోగమిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయ మేమిటి?
స్వామివారు : విజ్ఞానశాస్త్ర పురోగమనం వల్ల సమాజం అభివృద్ధి చెందిన మాట వాస్తవమే. కాని దానివల్ల కలిగే అనర్థాలు సామాజికాభివృద్ధిని అందరూ అనుభవించటానికి వీల్లేకుండా చేశాయి. అందరూ సుఖంగా జీవించాలంటే ప్రతివాడికీ సరళమైన మనస్సు, అమాయికమైన అంతరంగం వుండాలి. అవి ఏకాంత ప్రశాంతమైన వనజీవనంలోనే సాధ్యపడతాయి. వనజీవనంలోనూ ఆధునికమైన సౌకర్యాలు, సుఖాలూ అనుభవించవచ్చు, విజ్ఞానశాస్త్రం అందించే వసతు లేర్పరుచుకోవచ్చు.
స్వామివారు : మీరు ఉత్తర భారతంలోని దేవాలయాలూ, దక్షిణాది దేవాలయాలూ, ఆ దేవాలయాల్లోని విగ్రహాలూ చూచారు. వాటిని చూచినప్పుడు మీకెలాటి భావం కలిగింది?
లేనార్ట్స్ : భారతదేశంలోని ఆలయశిల్పాలు చూస్తున్నప్పుడు మనస్సులో పవిత్రమైన ప్రశాంతి ఏర్పడుతుంది. పారమార్థికమైన స్పందన కలుగుతుంది. ఆ శిల్పాలు కేవలం రాతి విగ్రహాలు కావు. భారతీయుల ఆధ్యాత్మిక చిత్తవృత్తికి చిహ్నాలు. వారి భక్తి ప్రపత్తులకు ప్రతీకలు.
--- హెన్రీ లేనార్ట్స్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి