9, మే 2023, మంగళవారం

 బజాజ్ స్కూటర్ మీద నాన్నఇంటికి తిరిగొస్తాడు… టేబుల్ మీదో అల్మారాలోనో హెచ్ఎంటీ వాచ్ ఉంటుంది…ట్రంకాల్ వస్తుందంటూ పోస్టాఫీసులోనో… మరోచోటో ఫోన్ కోసం ఎదురుచూసే రోజులు… అప్పుడప్పుడూ కనిపించే అంబాసిడర్ కార్లు… ఫియట్ కార్లో తిరిగితే సౌండ్ పార్టీ అనుకుంటా అని చూసే చూపులు… విమానం అనగానే ఇండియన్ ఏర్ లైన్స్ అంటూ చూపించే సినిమాలు…! ఇవన్నీ పాతికేళ్ల జ్ఞాపకాలు ! అప్పటి ఇండియా ఇదంతా ! ఇలాంటి పరిస్థితి నుంచి చేతిలో సెల్ ఫోన్… అందులోంచే మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునేంత టెక్నాలజీ… ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఏమైనా కొనుక్కునే కెపాసిటీ అన్నీ వచ్చాయ్.ఇదంతా ఓ రూపశిల్పి రూపుదిద్దిన అద్భుతం. ప్రధానిగా పీవీ వేసిన ఆ ఒక్క అడుగూ దేశాన్నే కాదు మన జీవితాల్ని, జ్ఞాపకాల్ని కూడా మార్చేసింది. గ్లోబలైజేషన్ ఊపందుకుంటున్న దశలో పడిన ఆ అడుగులు ఇపుడు దేశ రూపురేఖల్నే మార్చేశాయ్.

మేకిన్ ఇండియాకి ఐకానిక్ సింబల్… లోహ సింహం ఉంటుంది చూశారు సమరనాదం చేస్తున్నట్టు… నిజానికి అది పాతికేళ్ల కిందట దీర్ఘదర్శి పీవీ రూపుకట్టిన ఆలోచన. దానికి ఓ అప్పియెరెన్స్ ఇస్తే ఇప్పుడది సింహం అయ్యింది. తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని… అవకాశాల కోసం ప్రపంచమే తలుపు తట్టేలా తీర్దిదిద్దిన వ్యూహం పట్టాలెక్కి సరిగ్గా పాతికేళ్లు. ఏ ఆర్థిక వేత్తలో… ప్రపంచబ్యాంకో… లేదంటే విశ్వవిఖ్యాత నిపుణులో తీర్చిదిద్దలేదు ఈ ఆలోచనల్ని ! ప్రపంచాన్ని పరిశీలించి… భారత బలాబలాల్ని మథించి రూపొందించిన వ్యూహం. తిరుగులేని స్ట్రాటజీ దేశాన్ని పదేళ్లలో అపూర్వంగా మార్చేస్తే… అందుకు కారకుడు, సాధకుడు అయిన పీవీ మాత్రం అప్పటికే తెరమరుగైపోయారు. ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణ బాటలకి ఇరవైదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇదే అయనకి మా ఘన నివాళి.....

కామెంట్‌లు లేవు: