9, మే 2023, మంగళవారం

అభిన్నులు

 అపర కామాక్షి...

పరమాచార్య వారు మకాం చేసి ఉన్న ఊర్లో ఒకామె వారి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉండేది.

కుటుంబ పరిస్థితులు అనుకూలించక ఆమె స్వామి వారి దర్శనానికి తరచూ రాలేక పోయేది.

ఇంటి పనులు ముగించుకొని ఒకరోజు ఆమె స్వామి దర్శనానికి వచ్చింది. స్వామి పూజ ముగించుకొని వేదికపైనే కూర్చొని భక్తులతో మాట్లాడుతున్నారు. ఆమె స్వామి వారి ముందుకు వెళ్లి హారతి ఇవ్వటానికి ప్రయత్నించింది. స్వామి వారు ముఖం ప్రక్కకు తిప్పేసారు. ఇలా చాలాసార్లు జరిగే సరికి"అంబికా నన్నెందుకు పరీక్షస్తున్నావు " అంటూ  హారతి వేదికపై నున్న త్రిపుర సుందరి దేవికి ఇచ్చి ఆమె కన్నీళ్లతో వెను తిరిగింది. ఆమె కొద్ది దూరం వెళ్ళగానే ఎవరో వెనక నుంచి పరిగెత్తుకొని వచ్చి "అమ్మా  మిమ్మల్ని పెరియవ పిలుస్తున్నారు."అని పిలిచాడు.

ఆమె అతన్ని అనుసరించి వెళ్ళింది. స్వామి గదిలో కూర్చోని ఉన్నారు.

"అమ్మా. హారతి శ్రీ కామాక్షి (మహా త్రిపుర సుందరి )కి ఇచ్చినా నాకు ఇచ్చినా ఒకటే. నీ సంతోషం కోసం కావాలంటే ఇప్పుడు నా కివ్వు."అనటం తో ఆమె సంతోషానికి అవధులు లేవు. ఆమె స్వామి కి హారతి ఇచ్చింది.

****స్వామి సన్యాస దీక్ష తీసికొన్న తొలినాళ్లలో వారికి మంత్ర శాస్త్రము లో శిక్షణ ఇప్పించటానికి నిపుణులను పిలిపించి నప్పుడు వారు అన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాను."అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత అయిన శ్రీ కామాక్షికి స్వామి కి పోలికలు కనిపిస్తున్నాయి.వారికి ఎలాంటి మంత్ర దీక్షలు అవసరం లేదు. వారు శ్రీ కామాక్షి కి అభిన్నులు "

కామెంట్‌లు లేవు: