కాలే కాఫీ - చల్లని మజ్జిగ
పరమాచార్య స్వామివారు కాఫీ తాగడాన్ని ఒప్పుకునేవారు కాదు. చాలామంది భక్తులకి కూడా ఆ అలవాటుని మాన్పించారు. అటువంటి సంఘటనే ఇది ఒకటి.
కాంచీపురంలో మహాస్వామి వారి దర్శనానికి చెన్నై నుండి దంపతులు వచ్చారు. భర్త బాగా ఎక్కువగా కాఫీ తాగుతారా అని ఆవిడని అడిగారు స్వామివారు. ఆఫీసుకు వెళ్లేముందు మూడుసార్లు, వచ్చిన తరువాత మూడుసార్లు తాగుతారని అక్కడ ఎన్నిసార్లు తాగుతారో తనకు తెలియదని చెప్పిందావిడ. వెంటనే కాఫీ తాగడం ఆపెయ్యాలని అందుకు బదులుగా మజ్జిగ త్రాగాలని స్వామివారు ఆదేశించారు.
చెన్నై తిరిగొచ్చిన తరువాత కేవలం రెండు రోజులపాటు మహాస్వామివారి ఆదేశాన్ని పాటించగలిగాడు. మూడవరోజు నుండి కాఫీ ఇవ్వాల్సిందిగా భార్యను ఒత్తిడి చేశాడు. ఇక చేసేదేమీ లేక ఆవిడ కాఫీ ఇచ్చింది. పరమాచార్య స్వామీ వారి ఆజ్ఞని దిక్కరిస్తున్నాననే బాధతో ఆ కాఫీని స్వామివారి పటం ముందు పెట్టి అలవాటుని మానుకోలేకపోతున్నానని స్వామికి క్షమాపణ చెప్పి సేవించేవాడు. ఇలా కొద్ది రోజులపాటు జరిగింది.
కొంతకాలం తరువాత ఆ దంపతులు మహాస్వామివారి దర్శనానికి కాంచీపురం వెళ్ళారు. వారిని చూడగానే స్వామివారు ఇక ఎప్పుడూ ఆ వేడి కాఫీ తనకు సమర్పించవద్దని, రోజూ ఆ వేడి కాఫీ వల్ల తమ నాలుక కాలిపోయిందని తెలిపారు. ఆ మాటలకు అతను నిశ్చేష్టుడయ్యాడు. తన ఇంట్లో ఉన్న స్వామివారి చిత్రపటం సామాన్యమైనది కాదని, రోజూ తను స్వామివారి ముందు పెడుతున్న కాఫీ కప్పు స్వామివారు నైవేద్యంగా భావించి స్వికరించారని తెలుసుకొని అతను ఆశ్చర్యపోయాడు. అంటే చిత్రపటంలో ఉన్న స్వామీ, ఇక్కడ కూర్చున్న స్వామీ ఒక్కరే అని అర్థం చేసుకుని తను చేసిన తప్పుకు క్షమాపణలు అడిగాడు.
కళ్ళ నీరు కారుస్తూ, స్వామివారికి సాష్టాంగం చేసి తన మూర్ఖత్వాన్ని మన్నించవలసిందిగా ఇక జీవితంలో ఎప్పుడూ కాఫీ ముట్టనని స్వామివారు ఆదేశించినట్టుగా మజ్జిగ తాగుతానని ప్రమాణం చేశాడు. స్వామివారు ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి కాఫీ తాగే అలవాటు వదిలివేసినంత కాలం నీకు మంచిదని చెప్పి పంపించారు.
--- దినమలర్, 23 ఫెబ్రవరి 2016
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి