26, జూన్ 2023, సోమవారం

బడబాగ్ని కథ.

 నిత్యాన్వేషణ: 

సముద్ర గర్భంలో బడబాగ్ని ఉంటుందనిపురాణాలు చెప్తాయి. దీని వెనుక ఉన్న పురాణ కథలేమిటి?




ఒకానొకప్పుడు భృగు వంశస్థులు చాలా తపస్సు చేయడంతో వారికి ఆయుష్షు పెరుగుతుంది కానీ జ్ఞాన వృద్దులవటాన వైరాగ్యం ఎక్కువైంది. ఇక ఈ జన్మ చాలిస్తే బాగుంటుంది కానీ ఆత్మహత్య మహాపాపం కదా అని ఇంకేదో దారి వెదుకుతూ ఉంటే ఆనాటి రాజు హైహయ వంశీకుడైన కృతవీర్యుడనే రాజు భృగు వంశీకులకిచ్చిన బహుమతులను, ధనాన్ని తిరిగి రాజ్యానికి ఇవ్వమన్నారు వారసులు . శరీరత్యాగం కోసం ఎదురు చూస్తున్న బ్రాహ్మణులు ఇదే అదునని రాజుకివ్వకుండా భూమి లో దాచిపెట్టారు. హేహయులకు కోపం వచ్చి అందరినీ ఊచకోత కోశారు. ఆ హేహయులకు అందకుండా ఋచి అనే మునిపత్ని (చ్యవన మహర్షి కోడలు, అప్రవాన మహర్షి భార్య) తన పుత్రుని ఊరువులో దాచి పెంచుతుంది. ఐనా తల్లి ని వేధించవచ్చిన హేహయులకు తన తేజస్సు తో కళ్ళుపోయేలా చేశాడు ఔర్వుడు.

ఊరువులో నుంచి వచ్చాడు కాబట్టి ఔర్వుడని పేరు. మన్నింపమన్న రాజులందరికీ తిరిగి చూపు వచ్చేలా చేసినా., తన పూర్వులందరినీ ఊచకోత కోశారు అని తెలిసి కోపంగా యజ్ఞం మొదలు పెట్టారు. అది తెలిసిన పితృదేవతలు వచ్చి నీవు చేసే పని తప్పు. వైరాగ్యం తో మాకు మేమే రాజు కు కోపం వచ్చేలా చేసి ఈ లోకం వదిలాము. కాబట్టి ఈ యజ్ఞం ఆపు అన్నారు. ఔర్వుడు నాకు చాలా కోపం వచ్చింది దీన్నేం చేయమంటారని అడిగితే కోపం నిప్పు లాంటిది కాబట్టి సముద్రం లో వదలమన్న పితరుల సలహాతో తన కోపాన్ని (హయ)గుర్రం రూపంలో సముద్రం లోకి పంపాడు ఔర్వుడు. దీనినే బడబాగ్ని అంటారు.

అదీ బడబాగ్ని కథ.

కామెంట్‌లు లేవు: