దధీచి త్యాగం
ఏ కాలంలోనైనా సరే, స్వార్ధ బుద్ధితో కోరుకునే వరాలు లోకానికే కాదు ఆఖరికి అలా కోరుకున్న వారికి కూడా మంచి చేయవని, నిస్వార్థంతో చేసిన స్వల్ప దానమైనా పది కాలాలపాటు చెప్పుకునే విధంగా వారి పేరు స్థిరపడిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణ మహాబల సంపన్నుడైన వృత్రాసురుడు, దధీచి మహాముని జీవితాలు.
వృత్రాసురుడు మహా భయంకరాకారంగల, మహా శక్తి సంపన్నుడైన రాక్షసుడు. దేవతల పైన ద్వేషంతో తపస్సు చేసి కనీవినీ ఎరుగని విధంగా ఓ వారం పొందాడు, అదేంటంటే ఏదైనా లోహంతో తయారైన ఆయుధం వల్ల కూడా తనకు మరణం రాకూడదని, ఏ విధమైన లోహంతోనూ తయారు చేయని ఆయుధం తప్ప మరి ఏది తనను చంపడం కాదు కదా, కనీసం కొద్దిపాటి గాయం కూడా చేయని విధంగా వరం పొందాడు. ఆ వరానికి సహజ సిద్ధమైన రాక్షస బలం తోడు కావడంతో వాడిని ఎదిరించగలిగే వారెవరు లేకుండా పోయారు. వాడు మొదట ఇంద్రుడి మీద దండెత్తి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అది చాలదన్నట్లు దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు ఏమీ చేయలేక దేవతలను వెంటబెట్టుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. అత్యంత బలమైన, పొడవైన ఎముకలతో, అత్యంత పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు విష్ణుమూర్తి.
ఏనుగు, సింహం,పులి వంటి జంతువుల ఎముకలు బలిష్టంగా ఉంటాయి. కాబట్టి ఆయుధ తయారీకి పనికొస్తాయి అనుకుంటున్న దేవతలతో విష్ణువు ఇలా అన్నాడు. "మీ ఆలోచన సరైనది కాదు. బలంతో పాటు తపశ్శక్తి కూడా కలబోసుకున్న ఎముకలై ఉండాలి. భృగు మహర్షి కుమారుడు మహాతపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముక అందుకు బాగా ఉపయోగపడుతుందని దేవశిల్పి, దేవ గురువులను తీసుకుని వెంటనే దధీచి మునిని ఆశ్రయించమని" మార్గాంతరం చెప్పాడు విష్ణుమూర్తి.
దేవేంద్రుడు దేవ గురువైన బృహస్పతిని, దేవశిల్పి విశ్వకర్మను వెంటబెట్టుకొని దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వారిని చూసి సంతోషంతో అతిథి మర్యాదలు చేయబోతున్న దధీచితో తాము వచ్చిన సంగతిని ఎలా అడగాలో అర్థంకాక సతమతం అవుతుండగా దధీచి మహర్షి వారిని గుచ్చి గుచ్చి అడగడంతో ఎట్టకేలకు చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు. ఎంతో సంతోషంతో వారికి తన అనుమతిని తెలిపాడు.అంతేగాక యోగశక్తితో తన ప్రాణాలను ఊర్ధ్వోత్కటనం చేసుకున్నాడు. లోకోపకారం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి అవయవదానానికి ఆద్యుడయ్యాడు. అలా దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైనదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుడితో పోరాడి అవలీలగా విజయం సాధించాడు దేవేంద్రుడు. మంచితనానికి, త్యాగానికి మారుపేరుగా దధీచి మహర్షి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది.
ఓం నమో నారాయణాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి