26, జూన్ 2023, సోమవారం

లయ-లయం

 లయ-లయం 

మనం తరచుగా ఈ రెండు పదాలను వింటూవుంటాము. "లయ" అంటే ఒక క్రమ పద్దతిలో నడిచే కదలిక కానీయండి శబ్దం కానీయండి దానిని మనం లయ అంటాము. ఉదాహరణకు మన శ్వాస , నడక, హృదయ స్పందన, కదిలే చక్రము ఏదైనా కానీయండి. ఇంకా ఇప్పటి ఆధునిక సైన్సు ప్రకారం చుస్తే విదుత్ పౌనపుణ్యం, లేక కంప్యూటర్ వేగాన్ని సూచించే పౌనపుణ్యం (హెర్డ్జి) ఇలా చుప్పుకుంటూ పొతే మనకు  అన్నీ కూడా లయబద్దంగానే గోచరిస్తాయి.  

బౌతికంగా ఇవి అయితే ఇక సంగీతము, నృత్యము ఈ శాస్త్రాలు పూర్తిగా లయమీదనే ఆధారపడి  వున్నాయి. ఈ విషయం ప్రతి వారికి తెలిసినదే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం ఒక క్రమపద్ధతిలో వున్నది అదే లయ ప్రకారంగా వున్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లయ లేనిది ఈ జగత్తు లేనే లేదు. మన భూమిని కాకుండా ఖగోళాన్ని ఒక్కసారి గమనిస్తే మనకు అంతా లయప్రకారమే గోచరిస్తుంది. సూర్య, చంద్ర, నక్షత్ర గతులు కూడా పూర్తిగా లయ ప్రకారమే ఉన్నాయి.  మనకు తెలుసు భూమి తనచుట్టూ తానూ తిరగటానికి ఒక్కరోజు పడుతుంది అది ఒక లయ ఏ సమయంలోకూడా తన వేగాన్ని మార్చుకోదు అంటే ఒక సారి సగం రోజు ఇంకొకసారి రెండురోజులు అలా ఒకవేళ అదే జరిగితే భూప్రపంచం మొత్తం  నాశనం అవుతుంది.  అదే విధంగా చంద్రుడు భూమి చుట్టూ ఒక నెలరోజుల సమయంలో తిరుగుతాడు.  చంద్రగతి కూడా అనాదిగా అదే విధంగా వున్నది.  ఇలాగే సూర్య భగవానుడు కూడా ప్రతి గ్రహం, నక్షత్రం పాలపుంతలో ఒక క్రమ వేగంతో సంచరిస్తూవుంటాయి.  పూర్తి దృశ్యమాన జగత్తు  లయమీదనే ఆధారపడి వున్నది. ఇంకొక విషయంకూడా మనం గమనించాలి ఒక గ్రాహం ఇంకొకగ్రహంకు తాకకుండా పరి బ్రమించటం కూడా లయ మీదనే ఆధారపడి వున్నది. లయ తప్పితే గ్రహగతులు తప్పుతాయి అని వేరే చెప్పక్కరలేదు. 

ఒక వీధిలో వెళ్లే వాహనాలు వేటి లయ (speed) వాటికి ఉంటుంది ఎప్పుడైతే లయ మారుతుందో లేక లయ ఆగుతుందో అప్పుడు ప్రమాదాలు జరగటం మనం చూస్తూవున్నాము. ఒక మనిషి వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు అనుకోండి అంటే అతను ప్రతి అడుగు కూడా లయ బద్దంగా వేస్తూ వున్నాడని అర్ధం. ఒకవేళ అతను అలా కాకుండా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వేయాలన్న వేయలేడు తన వేగాన్ని మారుస్తే పర్యావసానంగా లయ మారుతుంది.  కానీ లయ మాత్రం ఉంటుంది. వేగంగా ప్రయాణిస్తే వేగవంతమైన లయ ఉంటుంది నిదానంగా ప్రయాణిస్తే తక్కువ వేగవవంతమైన లయ ఉంటుంది.  కానీ లయ మాత్రం ఎప్పుడు ఉంటుంది. మనిషి జీవితం మొత్తం ఒక లయ బద్దంగానే కొనసాగుతుంది. పుట్టినప్పటి నుండి చరమ దశ వరకు 

లయ బద్దంగా ఉండటమే ఒక నటన అదే ఈశ్వరుడు సృష్టించిన నాట్యం. అందుకే ఈశ్వరునికి నటరాజు అనే పేరు కూడా వున్నది.  ఆ పరమేశ్వరుడు రచించిన నాటకంలో ప్రతిదీ ఒక పాత్ర పోషిస్తూవుంటుంది. మనుషుల పాత్ర మనుషులది పశు పశ్యదుల పాత్ర వాటిది.  కొన్ని నిర్జీవులు కొన్ని సజీవులు జీవం ఉండటం ఉండక పోవటం కూడా ఆ పరమేశ్వరుని లీలలో భాగమే.  ఈ విషయం ప్రతి సాధకుడు తెలుసుకోవాలి. 

లయం అంటే ఏమిటో కాదు లయ ఆగటమే లయం. సాధారణంగా మనం నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము అంటే అది లయ, కొంత సమయం తరువాత ఆ పని  అయిపోతుంది. అంటే లయ  ఆగిపోతుంది. అదే లయం ఎందుకంటె అప్పుడు ఆ పని లేదు.  నీవు హైదరాబాదు నుండి కాశీకి ప్రయాణం చేయాలని రైలు ఎక్కావు రైలు కదిలింది అంటే లయ మొదలైంది. కొంతకాలం తరువాత నీ రైలు కాశీని చేరుకుంది అంటే అప్పటి దాకా రైలుకు వున్న లయ ఆగిపోయింది అంటే లయ లయంగా నిశ్చలంగా మారింది అని అర్ధం. 

ప్రతి మనిషి శ్వాస కూడా ఒక లయ, ఏదో ఒకరోజు ఆ లయ ఆగిపోతుంది అంటే లయం  అవుతుంది. దాని అర్ధమే జీవన చివరి  ఘట్టం. లయను, లయాన్ని రెంటిని శాసించేవాడే పరమేశ్వరుడు.  ఈ విషయం మనం తెలుసుకోవాలి.  ఎప్పుడైతే లయకారుని స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడే మనకు మనస్సులో ఒక భావన కలుగుతుంది అదేమిటంటే మనలను కాపాడేవాడు, రక్షించేవాడు కరుణించేవాడు మోక్షసిద్దిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు తప్ప వేరొకరు  కాదని. నిత్యం శివాలయంలో మనకు లయ, లయం రెండు దృగ్గోచరితం అవుతుంటాయి. మన మహర్షులు మనకు ప్రతి క్షణం మనం ఎలా మసలుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం జన్మరాహిత్యాన్ని పొందగలం అనే విషయం అను క్షణం గుర్తుచేస్తున్నారు.  

శివాలయలో పరమశివుని లింగం మీద ఒక్కొక్క చుక్కగా జలం పడటం మనం చూస్తూవుంటాము.  ఆ జల పాత్రలో నీరు ఒక రోజో లేక కొన్ని గంటలో పడి కాళీ అయి  పోతుంది. అదే విధంగా మానవ జీవితంలోని కాలం కూడా ఒక్కొక్క క్షణం కరిగిపోయి చివరికి కాళీ అయి పోతుంది.  అంటే అక్కడ అతని కాలం ఆగిపోతుంది.  కాబట్టి కాలం చాలా విలువైనది అని  గమనించాలి. మరి కాలాన్ని ఎలా వినియోగించాలి అంటే ఎలాగ అయితే పాత్రలోని నీరు చుక్క చుక్కగా పరమేశ్వరుని అభిషేకం చేయటానికి ఉపయోగపడుతున్నదో అదే విధంగా మన మనస్సు ప్రతి క్షణం ఆ దేవదేవుని అంటే ఆ పరమశివుని పాదాలమీదనే ఉండి నిత్యం ఆయనతోటె సంబంధం కలిగి ఆయననే పట్టుకుంటే అప్పుడే మనకు ఆయన కరుణా కటాక్షం కలుగుతాయి. 

శివుడు బాహ్యంలో కాదు మాన హృదయాంతరాళాల్లో నిక్షిప్తమై వున్నాడు ఈ సత్యాన్ని తెలుసుకొని మన హృదయేశ్వరున్ని నిత్యం అను క్షణం తలుస్తూ, కొలుస్తూ ఉంటే తప్పకుండ కైవల్యం లభిస్తుంది. అది ఎలా అంటే 

నేను తీసుకునే శ్వాస అజపా జాపంగా భావించి నిత్యం అజపాజపం చేయాలి. అంటే రోజుమొత్తం నేను జపంలోనే ఉన్నాననే భావనలో ఉండటం.  నేను స్నానం చేస్తున్నాను అంటే శివునికి అభిషేకం చేస్తున్నాననే భావనలో  ఉండాలి. నేను మల మూత్ర విసర్జన చేస్తున్నాను అంటే శివుని వద్ద మాలిన్యాన్ని తొలగిస్తున్నాను అని  నేను  మాట్లాడుతున్నాను అంటే శివుడు మాట్లాడుతున్నాడు అనే భావన ఇలా నా పూర్తి దైనందిక జీవనం శివునిదే కానీ నాది కాదనే భావనలో సాధకుడు ఉంటే నిత్య కైవల్యమే.  ఆ స్థితి మనం చెప్పుకునే అంత  సులభం కాదు కఠోర దీక్షతో, అకుంఠిత పరిశ్రమతో మాత్రమే సాధ్యం.  కానీ అసాధ్యము మాత్రం కాదు. "కృషితో నాస్తి దుర్భిక్షం"

కామెంట్‌లు లేవు: