*అనుభవాల పాఠం…*
*వృద్ధాప్యం*
➖➖➖✍️
*మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు.*
*శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం.*
*ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బాల్యాన్ని ఉదయంతోను, మధ్యాహ్నం యవ్వనంతోను, సాయంకాలాన్ని వృద్ధాప్యంతోను, రాత్రిని మరణంతోను వర్ణించారు.*
*బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరంగా వృద్ధాప్యం నడుస్తుంది.*
*ఈ వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.*
*ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది. 60 సంవత్సరాల వయస్సువరకు మనిషి జన్మ ఓ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు.*
*హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాప్యం.*
*అన్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసిక, సాంఘిక సమస్యలు ప్రతిమనిషిలోనూ తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా వున్నా ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగా కాపాడుకొంటూ వచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చేస్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొందరికి 65 సం.లో ప్రారంభమవుతాయి. కొందరు వేగంగా వెళ్లిపోతారు. ఇంకొందరు కాస్త నెమ్మదిగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే! కర్మ సిద్ధాంతాలతో మిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం.*
*అన్నేళ్ళ ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించేశక్తి సన్నగిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము. ఒక్కోసారి ఆత్మీయుల పేర్లనుకూడా మరచిపోతాం. మందుబిళ్ళలు వేసుకొన్నా అవి మనకు పూర్వ శక్తిని తీసుకురాలేవు. కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది. నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు ఇంకా ఇంకా ఎన్నెన్నో.. బాధలు అపరిమితం. ఒక్కోసారి అసహనం, కోపం కూడా వృద్ధాప్యాన్ని వెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికంగా మానసికంగా అన్నీ సమస్యలే. భార్యలు కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.*
*కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్‌కు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలనుకొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమంది వృద్ధాప్యంలో మంచానబడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్ప ఏం చేయలేం.*
*చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతా భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ కలవాలనుకోరు. ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణవౌతాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. ఆ వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.*
*కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ జన జీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటివారికి సమాజంలోని కొందరైనా చేయూతనివ్వాలి.*
*వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటుచేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి.*
*వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లు, వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నెలకొల్పాలి. ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి.*
*మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆ దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీతోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.*
*వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి.*
*జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితాన్ని కడవరకూ కోరుకోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి. కనీసం ఇపుడైనా వయస్సులో అహంకారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది.*
*దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే! అనుభవాల పాఠం వృద్ధాప్యం.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺
*అన్నము అంటే ఏమిటి?*
➖➖➖✍️
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునునితో అంటాడు...
శ్లో: "అన్నాద్భవన్తి భూతాని
పర్జన్యా దన్నసంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞః కర్మసముద్భవః "
తాత్పర్యం :- ప్రాణులు అన్నము వలన కలుగు చున్నవి. అన్నము మేఘము ( వర్షము ) వలన కలుగు చున్నది. మేఘము ( వర్షము ) యజ్ఞము వలన కలుగు చున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగు చున్నది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం! అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు. అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...
మనలో చాలామందికి ”అన్నము” అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.
అవి: 1. అన్నమయ, 2. ప్రాణమయ, 3. మనోమయ, 4. విజ్ఞానమయ, 5. ఆనందమయ కోశములు.
అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది. కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం.
అంతేకాదు… తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూత జాతములు జనించుచున్నవి. అన్నము వలననే జీవించుచున్నవి. తుదకు అన్నము నందే(భూమి) నశించుచున్నవి లేక లయించుచున్నవి అని చెప్పబడి ఉంది.
మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది. కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు, అని అర్ధం చేసుకోవాలి.
అన్నదానం అంటే ఏమిటి?
అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారు తున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే. అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్నీ అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని, అన్ని దానములకెల్ల అన్నదానం మిన్న అని, శాస్త్రాలు చెప్తున్నా యి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్న దానానికి మాత్రం ఈ నియమం లేదు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది.
ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు.
అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడిగితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా.
ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు.
కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు.
అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు.
గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటికి అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరి కడుపున పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట.
ఆయన సమకూర్చిన అన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే.
అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట.
అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట.
అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే నీ ఆయువు క్షీణించి పోతుందట.
ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయుః క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా.
ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు.
అందుకే అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.
అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి.
ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు.
ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం.
అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు.
మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు.
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది.
యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు.
చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. ‘శంబరుడు’ అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు.
తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు.
అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది.
బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.
ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు.
ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు.
బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, “ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది!” అన్నాడు.
మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు.
బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🍀సద్గురు వాణి..!
*ఇతరులలోని మంచిని మాత్రమే చూడండి!*
➖➖➖✍️
*రామాయణంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అంతకు మునుపే, రాముని జీవితంలో దురదృష్ట కరమైన సంఘటనలు చాలా జరిగాయి. అతని రాజ్యం చేజారిపోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది, ఇంకా చాలా కఠినమైన జీవితం గడపలసి వచ్చింది. అతని భార్యను రావణాసురడు అపహరించాడు. ఆమె మీద తనకు ఉన్న ప్రేమ , అనురాగాల వల్ల దక్షిణభారతం చివరి వరకూ వచ్చి, ఒక సైన్యంను ఏర్పరచుకుని, సముద్రం దాటి, లంకకు చేరి, యుద్ధం ప్రకటించి, రావణాసురుని ఓడించి, అతనిని వధించాడు.*
*రావణాసురుడికి పదితలలు ఉండేవని మనకు తెలుసు. రాముడు రావణాసురుడిని చంపటానికి వాటినన్నింటినీ నరకవలసిందే.*
*యుద్ధం గెలిచిన తరువాత రాముడు “నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది , ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను. నేను ఒక పరమ శివ భక్తుడిని, ఒక అసాధారణమైన పండితుని, ఒక గొప్ప రాజుని, ఒక ఉదారస్వభావిని వధించాను” అన్నాడు.*
*మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, “మీరు ఏమంటున్నారు? అతను మీ భార్యను అపహరించాడు”అన్నాడు.*
*అప్పుడు రాముడు, “అతనికి ఉన్న పదితలలలో చాలా గొప్ప విజ్ఞానం, భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒకతల ఉంది. దానిని వధించినందుకు నేను చింతిస్తున్నాను” అన్నాడు.*
*ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, వారు ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తారు.*
*అందరికీ పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి. ఒక రోజు మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది. మరొక రోజు అసూయతో, ద్వేషంతో, ప్రేమతో, మోహంతో, అందంతో లేదా వికారంగా ఉంటుంది. లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ ఉండవచ్చు. మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయాపరుడు అని నిర్ధారణకు వస్తారు. కానీ నిజంగా, అనేక సమయాలలో, అనేక రకాల తలలు ప్రతివారిలో పని చేస్తూ ఉంటాయి. ప్రతివారికీ ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదారస్వభావంతో లేదా కరుణతో నిండిన తల ఉంటాయి. ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, ఆ మనిషినే వారు పూర్తిగా ఖండిస్తారు.*
*రాముడు చెప్పేది ఏమిటంటే రావణాసురుడు ఎంత ఘోరమైన పనులు చేసినా, అతని యందు బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన ఒక అంశం ఉంది . ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరించండి- ‘మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు చూసినట్లైతే ఆ తప్పును ఖండించండి, కానీ ఆ మనిషిని కాదు. మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, మీరు అనవసరమైనటువంటి వాటినుంచి విముక్తులవుతారు. మీరు ఇతరులకు ఇలా చేస్తే, మీకూ అదే జరుగుతుంది.’*
*“ప్రేమ అనేది ఒకరంటే ఒకరికి తెలియని స్త్రీ, పురుషుల మధ్య జరుగుతుంది” అని ఎవరో అన్నారు. అది కేవలం అల్పమైన, ప్రతి క్షణం నిర్దారణలు చేసే, జ్ఞానం లేని వారి జీవితంలోనే యదార్ధం. లేకపోతే మీకు ఎవరి గురించి ఎంత ఎక్కువగా తెలిస్తే మీకు వారి పట్ల, అంత ఎక్కువ ప్రేమ, కరుణ కలుగుతాయి. మీకు వారి కష్టనష్టాలు అన్నీ తెలిసినట్లయితే, వారూ మీలాంటి మానవత్వం ఉన్న మనిషే అని తెలుసుకుంటారు.*
*రాముడు తన భార్యను అపహరించి, ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు. ఇంత జరిగినా, రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు. అతను ఒక్క గొప్ప జ్ఞానం కలవాడు. అందుకే రాముడిని అందరూ ఆరాధిస్తారు, పూజిస్తారు. అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ, అతని ఓటమి ఎన్నడూ అతని గుణాలను, జ్ఞానాన్ని మార్చలేకపోయింది. జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు.*
*దయచేసి మీ చుట్టూ ఉన్నవారందరితో ఈ పని చేయండి. భరించలేనివారు అనుకునే వారిలోనూ మీరు ఒక రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి.*
*మీరు రాముని ఈ గుణాన్ని సంవత్సరమంతా గుర్తుంచుకోవాలని నా కోరిక. మీరు ఈ చిన్ని జ్ఞానాన్ని గ్రహించినట్లైతే, మనిషిని ఖండించే బదులు ఆ గుణాన్ని గుర్తించగలిగితే గురు పౌర్ణిమ వచ్చి దక్షిణాయానికి వెళ్ళకముందే మీరు మంచి పంట పండించుకోగలరు. ఒక గులాబి మొక్కలో గులాబి పూలకన్నా ముళ్ళు ఎక్కువుగా ఉంటాయి, అయినా మనం దానిని రోజా మొక్కే అంటాము, ఎందుకంటే మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి. ఒక మామిడి చెట్టులో పండ్లకన్నా ఆకులే ఎక్కువ ఉంటాయి, అయినా మనం దానిని మామిడి చెట్టే అంటాము, ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని గుర్తించాం కాబట్టి.*
*ప్రతి మనిషిలోను కనీసం ఒకటైనా తియ్యని అంశం ఉంది . మనం దానిని ఎందుకు చూడకూడదు? దయచేసి ఈ పని చేయండి – మీరు భయంకరమైన వారిగా భావించే వారిలోనూ ఒక రవ్వంతైనా తియ్యదనాన్ని గుర్తించండి. మీరు ఇతరులలో అది ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడు మీలో కూడా అది గుర్తించబడుతుంది. అదేవిధంగా, మీరు ఇతరులలో భయంకరమైనవి చూస్తున్నట్లైతే, మీ విషయంలోనూ అదే జరుగుతుంది. దీని అర్ధం మీరు అన్నింటికీ అంధులు కావాల్సిన అవసరం లేదు. మీరు మామిడి చెట్టుకు ఉన్న ఆకులను చూస్తారు, గులాబి మొక్కకు ఉన్న ముళ్ళను చూస్తారు కానీ ఆ మామిడి పళ్ళను, గులాబి పూలను మాత్రమే గుర్తిస్తారు. మీరు చేయవలసినది అంతే. పదండి, ఈ ఆశయాన్ని సాధిద్దాం.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
*చిన్నపిల్లల దేవుడు*
➖➖➖✍️
```
అప్పటి రోజుల్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా మన సంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడేది. సామాజిక జీవితాలను నాశనం చేసే ఇప్పటి పిల్లల ఆటలు వచ్చిచేరిన సమయం కాదది.
మరి అలాంటి సమయంలో ఎన్నో దేవాలయాలతో, ఎన్నో ఆలయ ఉత్సవాలతో, నిరంతరం దేవతల ఊరేగింపులతో ఉండే కుంభకోణం పిల్లలకు ఆటవిడుపు ఏమిటి? వారికి ఆటలు ఏవి?
నిజమైన స్వామి ఊరేరిగింపుల్లో ఉండే సందడి ఆటల్లో కూడా ఉండేది.
ఒక బుట్ట నిండుగా బంకమట్టి తెచ్చి, నలుగురూ చేతులు వేసి కలిపి, స్వామిని సిద్ధం చేసేవారు. వెన్న కుండ, గరుడ వాహనం, అశ్వ వాహనం ఇలా మొత్తం సరంజామా సిద్ధం చేసేవారు.
ఇక పూలకు కొదువ లేదు. కావేరీ తీరంలో ఎన్నో పూల చెట్లు వున్నాయి.
ఇక మంత్రాలా, అందుకోసం వేదపాఠశాల నుండి శిక్షణ పొందాలా? శివాయ నమః, విష్ణువే నమః, సుబ్రహ్మణ్యాయ నమః, వినాయకాయ నమః.
ఇలా ఒక స్వామివారిని ఊరేరిగింపుగా తీసుకునివచ్చారు, కుంభకోణంలోని శ్రీమఠం వీధిలోనికి. స్వామి వచ్చి శ్రీమఠం ముందు నిలబడ్డారు. ఎవ్వరూ ఊహించని సంఘటన. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. అది చిన్నపిల్లల ఆట అని తేలికగా తీసుకోలేదు స్వామివారు.
ఆ చిన్నపిల్లల దేవునికి దండ నమస్కారం చేశారు; రెండు చేతులు జోడించి నమస్కరించారు. కొబ్బరికాయ, అరటిపళ్లతో నైవేద్యం చెయ్యమని మఠం వారికి చెప్పారు. పిల్లలకు అరటిపళ్లు, పటికబెల్లం పంచమని ఆదేశించారు. తరువాత చెయ్యెత్తి వారిని ఆశీర్వదించి, స్వామి ఉత్సవం ముందుకు వెళ్లడానికి అనుమతిచ్చారు.
ఆ పిల్లలకు ఎంతటి సంతోషమో!!!
ఆ చిన్నపిల్లల భక్తిని గౌరవించి, అది వారిలో ఇంకా పెరగడానికి స్వామివారు చేసిన పని ఎంతో అపూర్వమైనది.
పరమాచార్య స్వామివారు రోజూ ఏకాగ్రతతో ఎంతోసేపు, విస్తారంగా పూజ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసినదే. అలాగే, స్వామివారు ఇతరులు చేసే పూజను కూడా గౌరవిస్తారు.
శ్రీమఠానికి వచ్చే భక్తులలో, రోజూ పంచాయతన పూజ చేసేవారు ఎందరో వున్నారు. స్వామివారు వెళ్ళి ఆ పూజలను చూసి, భగవంతుణ్ణి ప్రార్థిస్తారు.
స్వామివారు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా వినాయకుని మందిరం కనబడితే - అది చిన్నదైనా, పాడుబడినదైనా లేదా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించకపోయినా, ఆ గణపతులకి తప్పక కొబ్బరికాయ సమర్పించాల్సిందే.```
--- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀28.
రామాయణం...
ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...
వాల్మీకి రామాయణం:
28 వ భాగం:
➖➖➖✍️
కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయి ఇలా అంది … “ఏమయ్యా! ఇక్ష్వాకు వంశములో జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయికి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.
నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.
దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికీ అది జెరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే " అని అన్నది.
అప్పుడు దశరథుడు " ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను" అన్నాడు.
అలా కైకేయితో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో..."రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను" అని మళ్ళి కైకేయి పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అన్నది..
త్వం కత్థసే మహా రాజ సత్య వాదీ ద్ఋఢ వ్రతః |
మమ చ ఇమం వరం కస్మాత్ విధారయితుం ఇచ్చసి ||
"సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా " అని అడిగింది.
అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలినా కైకేయి ఒప్పుకోవడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన...
" ఓ రాత్రి!, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగే ఉండని, తెలవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగే ఉండిపో. వద్దులే నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటె నేను ఇక్కడే ఉండాల్సివస్తుంది, నేను అంతసేపు ఈ కైకేయిని చూస్తూ ఉండలేను, కాబట్టి నువు తొందరగా తెలవారిపో " అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు.
మెల్లగా తెల్లవారుతోంది. అప్పుడు కైకేయి "ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను " అని అంది.
అప్పుడు దశరథుడు.....
యః తే మంత్ర క్ఋతః పాణిర్ అగ్నౌ పాపే మయా ధ్ఋతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం సహ త్వయా ||
"నువ్వు నన్ను ఇంత బాధపెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో, అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు" అన్నాడు.
అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులూ, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు.
యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక, కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఏమిటని సుమంత్రుడు కైకేయిని అడుగగా... "ఏమిలేదయ్య సుమంత్రా! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా" అంది కైకేయి.
అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు “దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేద”ని అడుగగా సుమంత్రుడు మళ్ళి లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చెయ్యబోగా,
"రాముడిని తీసుకు రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా" అని దశరథుడు అన్నాడు.
వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడానికి బయలుదేరాడు.
ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి “దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు” అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలేదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు, వాళ్ళతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది.
దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతావారందరూ బయటనే ఉండిపోయారు, రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు.
జీవచ్చవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు...."అమ్మా! నేను నాన్నగారిని ఎప్పుడూ ఇలా చూడలేదు, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు. నావల్ల ఏమన్నా పొరపాటు జరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధ పడినా, ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా, కౌసల్యని కాని, సుమిత్రకి కాని ఏదన్నా సుస్తీ చేసిందా, నాకు సత్యం చెప్పు తల్లీ" అన్నాడు.
అప్పుడు కైకేయి "ఏంచేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామా, నీకు చెప్తాను" అన్నది.
ఈ మాట రాముడితో కైకేయి చెప్తుంటే విన్న దశరథుడు "ఛీ" అని తలవంచుకున్నాడు.
అప్పుడు రాముడు...
తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం |
కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే ||
"అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను" అన్నాడు.
అప్పుడు కైకేయి "ఏమిలేదు రామా, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని, పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని, జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగాపెట్టుకొని అలా ఉన్నాడు" అంది.
అప్పుడు రాముడు "నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా, తప్పకుండా చేసేస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా,
అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ |
హ్ఋష్టః భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః ||
భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దుకేస్తాను" అన్నాడు.
అప్పుడు కైకేయి "రామా! మీ నాన్న ఒక శపధం చేశాడు, అదేంటంటే ‘నువ్వు ఈ అయోధ్యా నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను’ అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్లిపోవాలి" అంది.
అప్పుడు రాముడు....
న అహం అర్థ పరః దేవి లోకం ఆవస్తుం ఉత్సహే |
విద్ధి మాం ఋషిభిస్ తుల్యం కేవలం ధర్మం ఆస్థితం ||
"అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను ఋషిలాంటివాడిని, నాకుపితృవాక్యపరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా, ఇంత చిన్నవిషయానికి రెండు వరాలు అడిగావా అమ్మా, మీరు బెంగపెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను" అన్నాడు.
ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు.
తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి, కైకేయికి పాదాభివందనం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు, ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు, తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.
కౌసల్య దేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు.✍️
రేపు...29వ భాగం...
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి