🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 132* (చివరి భాగం)
వానప్రస్థ ఆశ్రమజీవితానికి ముహూర్తం నిశ్చయించుకున్నాడు చాణుక్యుడు.
అర్యుని ప్రియశిష్యుడూ, సహధ్యాయి ఇందుశర్మ దంపతులు కూడా చాణక్య దంపతులను అనుసరించడానికి నిశ్చయించుకున్నారు.
చంద్రగుప్త, రాక్షసామాత్యులు ఎన్ని విధాల ప్రార్థించినా, కనీసం బిందుసారుని పట్టాభిషేకం జరిగేవరకూ ఆగమని వారు అభ్యర్థించినా ఆర్యుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చాణక్యుని ప్రియశిష్యులైన వినయుడు, సిద్ధార్థకుడు, నిపుణకుడు, సమిద్దార్ధకుడు, శార్జరవుడు, గుణశర్మ, సంఘభూతి, నారాయణ శిరోమణి, ఆగమసిద్ధి, శివనాధ వాచస్పతి తదితరులు ఆర్యునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి గురుపూజ జరుపుకున్నారు. ఆర్యుడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు అంటే దానిని మార్చుకోడని వాళ్ళకి తెలుసు.
ఆనాడు చాణక్యడు శివ-విష్ణు స్వరూపమైన 'పరబ్రహ్మము' వలె ప్రకాశిస్తున్నాడు. ఆతని సువిశాల పాలభాగం వేదములకు పుట్టనిల్లైన శారదాదేవి స్థానంవలె తేజరిల్లుతోంది. అతని నేత్రాలు జ్ఞానప్రకాశ ప్రతిరూపులైన సూర్యచంద్రులవలె ప్రజ్వరిల్లుతున్నవి. శివలింగమువలే కనబడుతున్న బోడిగుండు భూగోళము వలెనూ, దానిని అంటిపెట్టుకొని గాలికి ఊగుతున్న 'నల్లటిశిక' భూమండల భారాన్ని శిరస్సుపై భరిస్తున్న వేయి తలల ఆదిశేషుని వలెను కనబడుతున్నాయి. ఆర్యుని ఫాలభాగముపై తీర్చిదిద్దిన భస్మత్రిపుండ్రము త్రిగుణాతీతమైన, త్రికాలాతీతమైన, త్రిమూర్తత్మకమైన అతని విశిష్ట వ్యక్తిత్వమును చాటుతున్నవి.
చంద్రగుప్తుడు, అమాత్య రాక్షసుడు, భద్రభట, బాగురాయణాదులు, ఆర్యుని కుమార్తె అన్నపూర్ణ, అల్లుడు అగ్నిశర్మ, మనుమడు రాధాగుప్తుడు, ఇంకా సామంత ప్రభువులు, పురజనులు, పురోహితులు, ఇలా ఎందరో....
ఆశ్రుపూరిత నయనాలతో, భక్తి శ్రద్ధలతో ఆర్యునికి వీడ్కోలు పలకడానికి బారులు తీరి నిలిచారు. అందరి హృదయాలలో 'ఆర్యుని' సాన్నిహిత్యం, దర్శనం తమకింక లభించదన్న వ్యథ....
అవును మరి...
ఎక్కడో....
దక్షిణాంధ్ర దేశమందలి బ్రాహ్మణ అగ్రహారంలో శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో ....
పరమ పవిత్రుడైన కుటల మహర్షి గోత్రోర్భవుడై జన్మించి...
చతుర్వేద పారంగతుడై తక్షశిలా విశ్వవిద్యాలయ ఆచార్య పదవిని అధిష్టించి, సర్వశాస్త్రనిష్ణాతుడై, ప్రవక్తయై, ధర్మనిరతుడై తేజరిల్లి...
'అర్థశాస్త్రము'ను యావత్తు ప్రపంచం ప్రజల సముజ్వల భవిష్యత్తుకై రచించి....
వరద వెల్లువలవలె దుమికి వచ్చిన యవన విజృంభణమునకు అడ్డుకట్టవేసిన స్థితప్రజ్ఞుడిగా భాసిల్లి....
ధర్మస్థాపనోద్దేశముతో సువిశాల మౌర్యసామ్రాజ్య స్థాపనకు బాటలు వేసి ....
'ధర్మోరక్షతి రక్షితః' అన్న వేదవాక్కుకు సరికొత్త అంతరార్ధాన్ని ప్రబోధించి...
నిస్వార్ధ, నిర్వికార, నిగర్వవర్తనుడై తేజరిల్లున ఆర్యచాణక్యుడు ....
స్థితప్రజ్ఞుడుగా, మహామేధావిగా, బహుముఖ ప్రజ్ఞాపారంగతుడుగా అడుగడుగునా తన విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటుకున్న కారణజన్ముడు ఆర్యచాణక్యుడు...
ఈ ప్రపంచ నాటక రంగస్థలముపై తన పాత్ర అవసరము తీరినది గ్రహించిన మరుక్షణమే... స్వధర్మాచరణకై తపోదీక్షకై వనవాసమునకు వెడలనున్నాడు...
అతనికి అస్తిత్వమే తప్ప ఆస్థిలేదు...
అతనికి అభిమానజనహృదయ నివాసమే తప్ప శాశ్వత నివాసం లేదు...
అతనికి దీనజన బాంధవ్యమే తప్ప బంధుజన పరిగణం లేదు...
అతనికి ధర్మ పరిరక్షణాధికారమే తప్ప అధికారం లేదు...
అతనికి ఐహిక ఆముష్మీకముల కొరకే సంసారము తప్ప సంసారంతో వేరు పనిలేదు...
అందుకే...
వ్యామోహరహితుడై...
నిర్వికార నిరంజనుడై...
ఆశ్రమధర్మాలలోని ఆఖరి అంకాలను నిర్వర్తించడానికి...
పరమపవిత్రమైన, మునుపేందరో మహర్షులు వసించిన నైమిశారణ్య తపోభూమికి కదిలినాడు...
ఆర్యుడు సతీసమేతంగా...
చంద్రగుప్త, రాక్షసామాత్యాది ప్రియతములూ, సిద్ధార్థక, శార్జరవ, వినయ, నిపుణకాది ప్రియశిష్యులు కన్నీళ్ళతో భక్త్యంజలులు ఘటిస్తూ వీడ్కోలు పలుకుతుండగా....
ఇందుశర్మ దంపతులు అనుసరిస్తుండగా....
మహాప్రస్థానాన్ని అన్వేషిస్తూ కదిలిన ఆర్యుడు అపర బ్రహ్మవలే మహాతేజస్సుతో భాసించాడు.
ఈ ధరిత్రి ఉన్నంతకాలం....
ధరిత్రిపై మానవజాతి ఉన్నంతకాలం...
మహోన్నతమైన మానవజాతి చరిత్రలో ఆర్యుని జీవిత సారాంశం ప్రత్యేక అధ్యాయనమై భాసిల్లుతుంది.
"అర్థశాస్త్రము" చాణక్యుని కీర్తి ప్రతిష్టలకు కలికితురాయియై విరాజిల్లుతుంది.
"వాత్సాయన కామసూత్రాలు" ధర్మహితకరమైన దాంపత్య జీవితానికి, సత్సంతానసిద్ధికి మార్గదర్శకాలై శోభిల్లుతాయి.
"రాజనీతిసూత్రాణి" బాలలను అత్యుత్తమ భావిపౌరులుగా తీర్చిదిద్దుతుంది.
ఆర్యచాణక్య చరితం అజరామరం...
భారత జాతిలో ఆర్యుడు ఆణిముత్యం ...
,*🌹శుభం 🌹*
*🙏సమాప్తం🙏🏻*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి