*అన్నయ్య ఆరాధన..తమ్ముడి అభిషేకం!!*
"మేము 26వ తేదీ రాత్రికి గుడి దగ్గరకు వస్తాము ప్రసాదూ..మాకు రెండు రూములు తీసిపెట్టు.." అని శ్రీ దత్తాత్రేయ స్వామివారికి స్వయానా తోడబుట్టిన తమ్ముడు పద్మయ్య నాయుడు ఫోన్ చేశారు..
"ఎన్ని గంటలకు వస్తారు?.." అని అడిగాను.."రాత్రికి వస్తాము.." అన్నారు..
"పద్మయ్యా..ఒక పని చేయండి..ఆరోజు సాయంత్రం 5 గంటల కల్లా మందిరానికి వచ్చేయండి.. రాత్రికి స్వామివారి బృందావనానికి గంధాభిషేకం వుంటుంది.. అందులో మీరు, మీ కుటుంబ సభ్యులు పాల్గొంటే బాగుంటుంది.."
"అంతకంటే భాగ్యమా.. తప్పకుండా వస్తామయ్యా.." అన్నారు..
ఈ సంభాషణ ఈ సంవత్సరం జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధనకు వారం రోజుల ముందు..
ప్రతి సంవత్సరం శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధన వైశాఖ శుద్ధ సప్తమి నాడు నిర్వహిస్తామని అందరికీ తెలిసిన విషయమే.. ముందురోజు అంటే.. షష్ఠి రోజు సాయంత్రం .. దత్తదీక్ష స్వీకరించిన స్వాములు.. మొగలిచెర్ల గ్రామం లో గల శ్రీ రామాలయం వద్ద కలిశాలు ఎత్తుకొని.. ఊరేగింపు గా.. శ్రీ స్వామివారి నామాన్ని పలుకుతూ.. సంబరంతో ఆడంబరంగా స్వామివారి మందిరానికి చేరుకుంటారు..ఆరోజు రాత్రి 12 గంటల తరువాత.. ఆనవాయితీ ప్రకారం మా దంపతులము అర్చక స్వాముల సహకారంతో శ్రీ స్వామివారి బృందావనానికి.. అలాగే శ్రీ స్వామివారి పాలరాతి విగ్రహానికి గంధాభిషేకము నిర్వహిస్తాము.. ఆపై అర్చక స్వాములు హారతి ఇస్తారు.. ఆ తరువాత దత్తదీక్ష లో వున్న స్వాములు ఒక్కొక్కరు.. స్వామివారి బృందావనానికి ప్రదక్షిణ చేసుకొని.. తాము తెచ్చిన కలశం లోని నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తి కి అభిషేకము చేసి వెళతారు..
ఈ సంవత్సరం గంధాభిషేకానికి మా దంపతులతో పాటు స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు కూడా పాల్గొన్నారు..
"ప్రసాదూ.. మా అన్నగారు కపాలమోక్షాన్ని పొందే పదిహేను రోజుల ముందు నన్ను ఇక్కడికి పిలిపించుకున్నారు.. ఆ బావి దగ్గర కూర్చొని.. "నాకు తలంటి పోయరా.." అని అడిగాడు..నా చేతులతో ఆయన తలకు కుంకుడు కాయ రసం తో అంటి.. బావి లోంచి నీళ్లు తోడి.. ఆయనకు స్నానం చేయించాను.. అది తాను కోరి మరీ చేయించుకున్నారు.. ఆరోజే నాకు తాను త్వరలో సిద్ధిపొందుతున్నానని.. అది కూడా కపాలమోక్షం ద్వారా సిద్ది పొందుతానని.. తన దేహాన్ని ఈ నేల మాళిగ లో ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి.. ఏ విధంగా సమాధి చేయాల్సినదీ వివరంగా చెప్పాడు.. అదే విధంగా ఆయన సిద్ధిపొందిన తరువాత మీ నాన్నగారి సహకారం తో మా అన్నయ్య చెప్పిన విధంగా క్రతువు పూర్తి చేసాను.. మళ్ళీ ఇన్నాళ్లకు నీ ప్రోద్బలంతో ఈరోజు ఆయన సమాధికి గంధం తో అభిషేకం చేసాను.." అంటూ..ఉద్వేగం తో నా చేతులు పట్టుకొని చెప్పారు..
"మీకు ఓపిక ఉన్నంత కాలం ఇలా ప్రతి సంవత్సరం రండి పద్మయ్యా.." అని చెప్పాను.. నన్ను దగ్గరకు తీసుకొని.. "ఈరోజు నాకు సంతోషం గా ఉందయ్యా.. నువ్వు చెప్పినట్టే.. ఆయుష్షు ఉన్నంత కాలం.. ఓపిక చేసుకొని వచ్చి పోతాను.. నా తరువాత నా బిడ్డలకు కూడా ఈ అవకాశం ఇవ్వు.." అని చెప్పి.. మళ్ళీ శ్రీ స్వామివారి బృందావనానికి నమస్కారం చేసుకొని వెళ్లిపోయారు..
శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర నిర్వహణ భాధ్యతలను మా దంపతులము దాదాపు 19సంవత్సరాలనుండి చేస్తున్నాము.. ఎన్నో అనుభవాలు.. అనుభూతులు పొందాము.. ప్రతి అనుభవమూ ఒక కొత్త అనుభూతి ఇస్తుంది.. అందులో శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు గారిది కూడా ఒకటి..
సర్వం..
శ్రీ దత్తకృప!!
(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..523 114.. సెల్ : 99089 73699 & 94402 66380.)
*హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ల వైపు నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చే భక్తులకు సమీప రైల్వే స్టేషన్ : సింగరాయకొండ.. అక్కడి నుండి ఆటో.. లేదా.. బస్సు ద్వారా కందుకూరు బస్టాండ్ కు రావాలి.. కందుకూరు నుండి మొగలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి RTC బస్సు సౌకర్యం వున్నది..*
MogiliCharla Sri Datthathreya Temple
Andhra Pradesh 523114
094402 66380
https://maps.app.goo.gl/sXEo7UwaT5aGHXek7
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి