*మనసెరిగిన మాధవుడు.*
👏👏👏
*గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. *
*ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?*
*నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది.*
*మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.*
*ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. *
*అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.*
*ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయుణ్ణి!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. *
*తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.*
*కుమారుడు బిగ్గరగా అరుస్తూ, "నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు.*
*వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ, ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. *
*తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.*
*భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా! అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!*
*ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి