30, ఆగస్టు 2023, బుధవారం

రామాయణమ్ 309

 రామాయణమ్ 309

....

శీఘ్రముగా రధము మీద తన వైపు వస్తున్న ఇంద్రజిత్తును చూసి సింహనాదము చేసి కాయమును పెంచి సన్నద్ధుడై నిలిచాడు మహాబలి మారుతి.

.

వరుసగా పిడుగుల పడినట్లుగా ధనుష్ఠంకారము చేస్తూ వాడివాడి నారాచములను ప్రయోగించగా వాటి వేగాన్ని గేలి చేస్తున్నట్లుగా వాయుసుతుడు రయ్యిమంటూ ఆకాశములోకి దూసుకొని పోయెను.

.

బాణమునకు బాణమునకు మధ్య తానొక తారాజువ్వ అయిపోయి సంచరిస్తూ ఇంద్రజిత్తు చేసిన శస్త్రప్రయోగమును వ్యర్ధముగావించెను.

.

అంత దివ్యాస్త్రములు ప్రయోగించిన ఇంద్రజిత్తు అవి కూడా మారుతిని రవ్వంత కదిలించలేక పోయినందుకు మనస్సులో కళవళ పడెను.

.

అస్త్రములు వ్యర్ధమైపోయాయి

శస్త్రములువికలమయిపోయాయి .ఇంద్రజిత్తు చేస్తున్న యుద్ధము అంతా నిష్ప్రయోజనమయిపోయింది.

.

అసలు ఇంద్రజిత్తు చేసే ప్రతిప్రయోగాన్ని ఆదిలోనే సునిశితంగా గమనించి తదనుగుణంగా తన వేగాన్ని వృద్ధిపొందిస్తూ చిత్రవిచిత్రగతులలో బాణానికిబాణానికి మధ్య సంచరిస్తూ ఆ రావణకుమారుని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు హనుమస్వామి.

.

ఇక లాభంలేదు ఇతడు సామాన్యుడు కాడు బ్రహ్మాస్త్రప్రయోగము చేయవలసినదే అని మనస్సులో సంకల్పించి ఆ అస్త్రమును అభిమంత్రించి మారుతిపై ప్రయోగించాడు ఇంద్రజిత్తు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: