30, ఆగస్టు 2023, బుధవారం

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-33🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ధ్రువబేరం:*


తిరుమల ప్రధానాలయంలో నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. ఈ మూర్తి స్వయంభూమూర్తి (అనగా స్వయంగా వెలసినది, ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు) అని భక్తుల విశ్వాసం. 


మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. 


మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు.


 నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.



 18 అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు. గురువారం సాయంకాలం, మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక, స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి


ధృవబేరం చక్కని ముఖకవళికలతో వెలసి ఉంటుంది. ముక్కు మరీ ఎత్తూ కాదు, చప్పిడీ కాదు. కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి. నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంది.


 నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంతభాగం కప్పివేస్తుంది. నామం రూపం, సైజూ వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పినవిధంగా కచ్చితంగా పాటిస్తారు. 


స్వామివారి శిరస్సుపై (నుదుటిపైభాగం వరకు) కిరీటం ఉంది. ఆయన జటాజూటము భుజాలపై పడుతూ ఉంటుంది. 


కచ్చితమైన కొలతలు తీసికొనబడనప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36-40 అంగుళాల మధ్య సైజులోనూ

, నడుము భాగం వెడల్పు 24-27 అంగుళాలు సైజులోనూ ఉంటుంది. 


స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది. ఆయన వక్షస్థలం కుడిభాగాన శ్రీలక్ష్మీదేవి రూపం ఉంది. స్వామివారు చతుర్భుజములను కలిగియున్నారు. పై కెత్తిన కుడిచేతిలోనున్న సుదర్శన చక్రము, ఎడమచేతిలోనున్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావు. 


అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు. దిగువనున్న రెండుచేతులలోను కుడిచేయి వరదహస్తము (అరచేయి భక్తులకు కనిపిస్తూ, వరములను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుంది).


 ఎడమచేయి కట్యావలంబిత ముద్రలో (నడుమువద్ద మడచినచేయి. అరచేయి స్వామివారివైపు ఉంటుంది) ఉంది. నడుము క్రిందభాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు. రెండు మోకాళ్ళూ కొంచెంగా వంగినట్లు కనిపిస్తాయి (స్వామివారు భక్తుల రక్షణకు నడచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా). 


స్వామివారు ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్బాణాల ముద్రలున్నాయి



వేంకటేశ్వరునిగా వ్యవహరించే ఈ ధృవభేరం ఏ దేవతామూర్తిది, మొదటి నుంచి ఏ రూపంగా అక్కడ అర్చన కొనసాగింది అన్న విషయంపై తీవ్ర వాదోపవాదాలు సాగాయి.


నాగేంద్రభూషణ గోవిందా, మంజీర మండిత గోవిందా, తులసిమాలప్రియ గోవిందా, ఉత్పమాలాంకృత గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||33||


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: