30, ఆగస్టు 2023, బుధవారం

నవగ్రహా పురాణం🪐* . *14వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *14వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 5*


ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ , అంగిరసుడూ , కర్దముడూ , పులహుడూ , పులస్త్యుడూ , భృగువూ , వసిష్ఠుడూ , క్రతువూ , వాళ్ళ పత్నులూ.... కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.


కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. *"పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి , ఆశీర్వదించండి !"*


*"కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ , అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో , నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు..."*


*"ద్వాదశ రాశులా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..


*"ఔను కశ్యపా !"* బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. *"మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం , వృషభం , మిథునం , కర్కాటకం , సింహం , కన్య , తుల , వృశ్చికం , ధనస్సు , మకరం , కుంభం , మీనం - ఆకారాలలో స్థిరపడి వున్నాయి !"*


*"ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు..."* అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *"పరమేష్ఠీ పరమేశ్వరులూ , నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !"*


*"చాలా సంతోషం. ప్రారంభించండి !"* పరమ శివుడు అన్నాడు..


అదితి లేచి , శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !


*"లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !"* అన్నాడు విష్ణువు.


లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. *"ధాత ! ఆర్యముడు..."*


అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"మిత్రుడు !"* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.


*"శక్రుడు !"* విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.


విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ , బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.


*"వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !"* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.


పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *"పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"* బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.


పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి - వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ , చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.


నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. *"ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !"*


త్రిమూర్తులూ , దేవతలూ , మానస పుత్రులూ , వాళ్ళ పత్నులూ , నారదుడూ , కశ్యపుడు , ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.


*"త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !"* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.


*"సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో - ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ , అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు !"* విష్ణువు అన్నాడు.


*“తథాస్తు !"* అన్నారు శివుడూ , బ్రహ్మా.


అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని , వక్షానికి హత్తుకుని , బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


అదితి ఆవేశంగా కదిలి చేతులు ఎడంగా చాపి , తన ద్వాదశ పుత్రుల్ని వొడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలూ ఒక్కసారిగా కలిసి , ఒక్కటిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుణ్ని ఆశ్చర్యానందంతో చూస్తోంది. అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు. అందర్నీ కలయజూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు.


 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: