18, సెప్టెంబర్ 2023, సోమవారం

ఎక్కడ దృష్టి పెడితే అదే కనిపిస్తుంది*

 👀 *ఎక్కడ దృష్టి పెడితే అదే కనిపిస్తుంది* 🌝


 ఒక మహిళ ప్రతిరోజు గుడికి వెళుతూ ఉండేది. 

 ఒక రోజు ఆమె పూజారిని చూసి ఇట్లా అంది -- ఇకపై నేను గుడికి రాను. 

 అప్పుడు పూజారి అడిగాడు -- ఏం జరిగింది? 

 అప్పుడు ఆమె చెప్పింది -- ఇక్కడ గుడిలో జనాలు చలవాణి లో తమ వ్యాపార విషయాలు మాట్లాడుకుంటున్నారు. కొందరు గుడిని ఊరికే ముచ్చట్లు పెట్టుకొనే స్థానంగా చేసుకున్నారు. కొందరు పూజ తక్కువ, అనాచారాలు, ప్రదర్శనలు ఎక్కువ చేస్తున్నారు. ఇదే చూస్తున్నాను. 

 అప్పుడు పూజారి కొద్దిసేపు మౌనం వహించి తర్వాత ఇట్లా అన్నాడు -- నిజమే కానీ మీ చివరి నిర్ణయానికి ముందు నేను చెప్పింది ఒకటి చేస్తారా? 

 అప్పుడు ఆమె ‘సరే చెప్పండి, ఏం చేయాలి?’ అని అడిగింది. 

 పూజారి అన్నాడు -- ఒక లోటా తీసుకొని నీటితో నింపండి. రెండుసార్లు గుడిచుట్టూ ప్రదక్షిణ  చేయండి. నియమం ఏంటంటే లోటా లో నుండి నీరు కింద పడరాదు. 

 అప్పుడామె -- సరే అలాగే చేస్తాను- అంది. 

 తర్వాత ఆమె కొద్దిసేపటి తర్వాత అట్లా చేసి చూపించింది. 

 అప్పుడు గుడి పూజారి ఆమెను చూసి 3 ప్రశ్నలను అడిగాడు – 

1. ఇప్పుడు మీరు ఎవరినైనా చలవాణిలో మాట్లాడుతూ చూసారా? 

2. ఎవరైనా గుడిలో ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారా? 

3. ఎవరైనా అనాచారం చేస్తూ కళ్ళబడ్డారా? 

 అప్పుడామె అన్నది -- లేదు. నాకు ఇవేమీ కనిపించలేదు. 

 అప్పుడు పూజారి అన్నాడు -- మీరు గుడిలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పూర్తి దృష్టిని లోటా మీదనే ఉంచారు. దాని నుండి ఎక్కడ జలం కింద పడుతుందో అని. అందువల్ల మీరు ఇంక ఏమీ చూడలేదు. ఇవాల్టి నుంచి ఎప్పుడైనా మందిరానికి వస్తే మీ దృష్టినంతా పరమాత్మ మీద పెట్టండి. దానివల్ల మీరు దేనిని, ఎవరిని పట్టించుకోరు. భగవంతుడు మాత్రమే అంతట దృష్టిపథంలో కనిపిస్తాడు.

కామెంట్‌లు లేవు: