18, సెప్టెంబర్ 2023, సోమవారం

గుణపాఠం

 *గుణపాఠం..*


ఆదివారం ఉదయం ఐదు గంటలకు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో స్వామివారి ప్రభాతసేవ కార్యక్రమాలు మొదలవుతాయి..అప్పటినుంచి మరో గంటా నలభై ఐదు నిమిషాలపాటు ఆ కార్యక్రమం అలా సాగిపోతూనే ఉంటుంది..ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆఖరి హారతి ఇచ్చిన తరువాత..భక్తులను స్వామివారి మందిరం లోకి దర్శనానికి అనుమతి ఇస్తాము..సహజంగానే ఆ సమయం లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది..మేమందరమూ ఆ హడావిడి లో ఉంటాము..


ఆరోజు ఉదయం ఏడున్నర గంటలకు కందుకూరు నుంచి వచ్చే మొదటి బస్సులో ఒక యువతి స్వామివారి మందిరానికి వచ్చింది..మందిరం లోపలికి వచ్చి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?" అని నన్నే అడిగింది.."నేనే" అని జవాబు చెప్పి.."మీ రెవరు..?" అని అడిగాను.."ఇక్కడ సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని వచ్చాను..ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి.." అన్నది.."అమ్మా..చూస్తున్నారు కదా..ఇప్పుడు మీతో మాట్లాడే వ్యవధి లేదు..అన్యధాభావించవద్దు..ఇంకొక రెండు గంటల తరువాత..భక్తులు రావడం తగ్గుతుంది..ఈలోపల మీరు వెళ్లి స్నానం చేసి..స్వామివారి దర్శనానికి రండి..ముందు స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఆ తరువాత సమయం చూసుకొని..నాతో మాట్లాడవచ్చు.." అని చెప్పాను.."సరే.." అని వెళ్ళిపోయింది..మరో అరగంటకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చింది కానీ..లోపలికి వెళ్ళలేదు..నా టేబుల్ వద్దనే ఒక ప్రక్కగా నేలమీద కూర్చుని.."ప్రసాద్ గారూ.మీకు తీరిక దొరికిన తరువాత..మీతో మాట్లాడి..ఆపై స్వామివారి సమాధి వద్దకు వెళతాను..అక్కడ నా మనసులోని మాట చెప్పుకుంటాను.." అన్నది..


మరో గంట తరువాత..నా వద్దకు రమ్మని చెప్పి..ప్రక్కనే కుర్చీలో కూర్చోమని చెప్పి.."అమ్మా..ఇప్పుడు చెప్పండి.." అన్నాను..అంతవరకూ ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్న ఆమె..తన రెండు చేతులతో ముఖం కప్పుకొని..ఏడ్చేసింది..అలా ఒక ఐదు నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నది..ప్రక్కనే ఉన్న మా ఆవిడ..ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి..ఓదారుస్తూ.."అమ్మా..నీ కొచ్చిన కష్టం చెప్పు..ఇప్పుడు నువ్వు స్వామివారి సన్నిధిలో ఉన్నావు..భయపడకు..వ్యధ చెందకు.." అని చెప్పింది..కొద్దిసేపటికి తేరుకొని.."నా పేరు సుశీల..పెళ్లై పదేళ్లు అవుతున్నది..మాకొక బాబు..వాడికి ఎనిమిదేళ్ల వయసు..థర్డ్ క్లాస్ చదువుతున్నాడు..మావారు సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం చేస్తున్నారు..నేనూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసాను..బాబు పుట్టిన తరువాత మానేసాను..ఖాళీగా ఉన్న సమయం లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని మావారితో చెప్పాను..నిజానికి ఆయన చెవిలో పోరు పెట్టాను..నేను ఖాళీగా వున్నాను..నేను నిర్వహిస్తాను..అని రోజూ మా వారితో చెప్పాను..ముందు ఆయన ఒప్పుకోలేదు..చివరకు ఒప్పుకున్నారు..ఇద్దరమూ బాగా చర్చించుకుని..చిట్ ఫండ్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకొని..మొదలుపెట్టాము..మొత్తం నేనే నిర్వహించేదాన్ని..మొదటి మూడేళ్ళూ చాలాబాగా నడిచింది..ఆ తరువాతే మా కష్టాలు మొదలయ్యాయి..చిట్ పాడుకున్న వాళ్ళు కొన్నాళ్ళు డబ్బు కట్టారు..ఆ తరువాత మెల్లిగా ఆలస్యం చేయసాగారు..మాకు రావాలసింది ఎప్పుడైతే ఆలస్యం అయిందో..మేము కట్టాల్సిన వాళ్లకు సకాలం లో చెల్లించలేకపోయాము..కొందరికి చెక్ లు ఇచ్చాము..అవి కూడా నేను సంతకాలు చేసి ఇచ్చాను..నాలుగేళ్లు తిరిగే సరికి..బాగా ఇరుక్కుపోయాము..ఇద్దరు ముగ్గురు నేనిచ్చిన చెక్ లు అడ్డం పెట్టుకొని కోర్టులో కేస్ వేశారు..ఇంకొక పదిహేను రోజుల్లో కోర్టుకు హాజరు కావాలి..మావారు నేను నలిగిపోతున్నాము..ఏ దిక్కూ తోచలేదు.. ఈ మాధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..మా వారితో చెప్పి..చివరి ఆశగా ఇక్కడికి వచ్చాను.." అని మళ్లీ ఏడ్చేసింది..


కొద్దిసేపటి తరువాత..స్వామివారి సమాధి ని దర్శించుకొని..స్వామివారి పాదుకులకు నమస్కారం చేసుకొని..ఇవతలకు వచ్చి.."స్వామివారిని వేడుకున్నాను..నా సమస్యకు పరిష్కారం దొరికితే..మావారితో సహా ఇక్కడకు వచ్చి..మూడు రాత్రుళ్ళు నిద్ర చేసి..అన్నదానం చేసి వెళతాను.." అని మొక్కుకున్నాను..అన్నది.."చూద్దాం తల్లీ..స్వామివారిని త్రికరణ శుద్ధిగా నమ్ముకో..మంచి జరుగుతుంది.." అని మేమిద్దరం చెప్పాము..మధ్యాహ్నం వెళ్లిపోయింది..మూడు నాలుగు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం నాటి సాయంత్రం ఐదు గంటల వేళ..సుశీల తన భర్త, కుమారుడితో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది..నేరుగా మా దంపతుల వద్దకు వచ్చి..మాకు తన భర్తను పరిచయం చేసి.."మా సమస్య ఒక రకంగా తీరిపోయింది..ఇక్కడి నుండి వెళ్లిన తరువాత..అమెరికా లో ఉన్న మా అన్నయ్య కు విషయం తెలిసి..నా అప్పులు తీర్చడానికి అవసరమైన నగదు సర్దుబాటు చేసాడు..ముందు కేసుల్లోంచి బైటపడ్డాను.. మాకు వెసులుబాటు కలిగింది..కానీ..గుణపాఠం కూడా నేర్పింది..స్వామివారు సకాలం లో దారి చూపారు..మా అన్నయ్య రూపం లో స్వామివారే మమ్మల్ని కరుణించారు..ఇంకెప్పుడు అత్యాశకు పోను..స్వామివారి వద్ద ప్రమాణం చేయడానికి వచ్చాను..ఇప్పుడిప్పుడే మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు..త్వరలో వచ్చి నా మొక్కు చెల్లించుకుంటాను.." అని చెప్పింది..


సుశీల సమస్యకు పరిష్కారం చూపడమేకాక..జీవితం లో అత్యాశకు పోకుండా..చక్కటి పాఠం కూడా నేర్పారు స్వామివారు.


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: