11, సెప్టెంబర్ 2023, సోమవారం

మౌనంబే మునిజనులకు


*కం*

మౌనము దివ్యాభరణము

మౌనంబే మునిజనులకు మాహాత్మ్యమిడున్.(మహిమల నొసగున్)

మౌనమ విశిష్ట సహనము

మౌనము నందుండు టెల్ల మాన్యము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మౌనమనేది ఒక గొప్ప ఆభరణము,మౌనమే మునులకు గొప్ప శక్తుల నిచ్చును. మౌనమనేది గొప్ప సహనము, మౌనముగా ఉండగలగడమే గొప్ప గుర్తింపు అవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*కం*

ఆయువు తీరకమునుపే

కాయమువిడనెంచినంత కాలుడు గొనడే!!(గొనునా)

రేయుగ యత్నించిన కడు

గాయంబుల వేగవలయు కాయము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఆయువు తీరక ముందే దేహము విడిచిపెట్టాలనుకున్నా యముడు తీసుకెళ్ళడు (కదా!!). విజృంభించి (రేయున) ప్రయత్నాలు చేసినచో పెద్ద గాయముల తో శరీరం బాధపడవలసి వస్తుంది.

*సందేశం*:-- కష్టాలకు భయపడి చావాలని ప్రయత్నాలు చేస్తే తీరని ఆయువు నీకు తీరని వేదన మిగుల్చుతుంది. ఆయువు తీరేవరకూ కర్మఫలములైన కష్టసుఖాలను అనుభవించక తప్పదు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: