🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 67*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
'భగవంతుడు లేడు; ఒకవేళ ఉన్నప్పటికీ, ఆయనను గురించి చింతనచేసి ప్రయోజనం లేదు' అని నిరూపించడానికి నేను ప్రయత్నించడంతో నేను నాస్తికుజ్జయిపోయాను, దుష్టులతో కలిసి మధుపానం చేస్తున్నాను, వెలయాళ్ల ఇంటికి పోతున్నానని ఏ మాత్రం సంశయించకుండా మాట్లాడసాగారు!
ఎవరికీ అణగిమణగి మెలగే నైజం చిన్నతనం నుండే నాకు లేదు. అది ప్రస్తుతం తప్పుడు పుకారు వలన ఘనీభవించి కరడుగట్టింది. 'ఈ దుఃఖమయమైన సంసారంలో ఏదో కొంతసేపయినా ఆ దుఃఖాలను మరచిపోవడానికి మధుపానం చేయడమో, వెలయాళ్ల వద్దకు వెళ్లడమో కించిత్తు కూడా తప్పు కాదు. ఈ రీతిలో సుఖం లభిస్తుందని నాకు నిశ్చయంగా తెలిస్తే ఎవరికీ భయపడకుండా నేనూ ఆ మార్గాన్ని అనుసరిస్తాను' అంటూ వాళ్లు అడగకుండానే అందరితోను చెప్పసాగాను.
"ఈ వార్త గాలికన్నా వేగంగా వ్యాపించింది. శ్రీరామకృష్ణులకూ, ఆయన భక్తులకు చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజం తెలుసుకోగోరి కొందరు వచ్చారు. 'శిక్ష పడుతుందని భయపడి భగవంతుణ్ణి విశ్వసించడం పిరికి తనం' అంటూ ఉద్వేగంతో చెప్పి హ్యూమ్, పెయిన్, మిల్, కామ్టేలాంటి పలువురు పాశ్చాత్య తాత్వికులను ఉదాహరణగా చూపి, 'భగవంతుడు ఉన్నాడనడానికి ఎలాంటి ఆధారమూ లేదు' అంటూ తీవ్ర ఉద్వేగంతో వాదించాను. సంస్కరించ లేనంతగా నేను చెడిపోయాను అని నిశ్చయించుకొని వారు వెళ్లిపోయారు. నాకు చాలా సంతోషం కలిగింది.
"శ్రీరామకృష్ణుల గురించి ఆలోచన మెదలినప్పుడు మనస్సు సందిగ్ధావస్థలో పడిపోయింది. ఇవన్నీ విని ఆయన కూడా బహుశా నమ్ముతారేమోననిపించింది. ఒక్క క్షణమే, 'ఇలాంటి నిరాధారమైన పుకార్లు విని నేనెటువంటి వాడినో ఆయన నిర్ధారణ చేసే పక్షంలో అలాగే చేసుకోనీ, నేను కలత చెందును అని మరుక్షణమే సరిపెట్టుకొన్నాను. కాని ఆయన దీనికి ఎలా స్పందించారో విని ఆశ్చర్యపోయాను. మొదట ఆయన ఎలాంటి బదులు చెప్పలేదు.
ఆ తరువాత భవనాథ్ విలపిస్తూ, 'మహాశయా! నరేంద్రుడు ఇంతగా దిగజారిపోతాడని నేను కలలో సైతం ఊహించలేదు' అని చెబుతున్నప్పుడు ఆగ్రహంతో, 'మూర్ఖుడా! వాగ బోకు! నోరు ముయ్యి. నరేంద్రుడు ఆ రకంగా వ్యవహరించడని జగజ్జనని నాతో చెప్పింది. ఇలాగే నువ్వు మరోసారి మాట్లాడావంటే నీ ముఖం కూడా చూడను' అని అతడితో నిష్కర్షగా చెప్పారట.
"కాని అహంకరించి ఈ విధంగా నాస్తికులమైతే ఏం ప్రయోజనం? చిన్న తనం నుండి, అందునా ప్రత్యేకించి శ్రీరామకృష్ణులను దర్శించాక నేను పొందిన అద్భుతమయిన దివ్యదర్శనాలు నా హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తు న్నాయి కదా! కనుక, 'నిశ్చయంగా భగవంతుడు ఉన్నాడు. ఆయనను సాక్షాత్కరించుకొనే మార్గమూ ఉంటుంది. లేకపోతే జీవించనవసరం లేదు.
అన్ని దుఃఖాలకూ, ఆటంకాలకూ మధ్య ఆ మార్గాన్ని కనుగొనే తీరాలి' అని భావించాను. ఈ విధంగా రోజులు దొర్లిపోసాగాయి. మనస్సు సందేహానికీ స్పష్టతకూ మధ్య ఊగిసలాడింది. మెల్లమెల్లగా ప్రశాంతత వైదొలగిపోసాగింది, దారిద్య్రమూ ఏ విధంగాను తగ్గేటట్లు కనిపించడం లేదు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి