శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
* శ్రీహరి తాళధ్వజుడిని ఓదార్చడం
వరదలా పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బేలగా విలపిస్తున్న తాళధ్వజమహారాజును చూసి
శ్రీహరికి హృదయం ద్రవించింది. మెల్లగా చెంతకు చేరాడు. రాజేంద్రా! ఏమిటి దుఃఖిస్తున్నావ్? ఎక్కడికి
వెళ్ళింది నీ ప్రియాంగన? నువ్వు శాస్త్రాలు చదవలేదా? ఏ పండితులను ఆశ్రయించలేదా? ఆమె ఎవరు?
నువ్వు ఎవరు? సంయోగమంటే ఏమిటి? వియోగమంటే ఏమిటి? ఇదంతా ఒక ప్రవాహం. కలుస్తూ
ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఎవరి నావలో వారు దాటిపోతుంటారు. దుఃఖించి ప్రయోజనం లేదు.
ధైర్యం తెచ్చుకో. ఇంటికి వెళ్ళు. సంయోగవియోగాలు దైవాధీనాలు. ఆమెతో నీకు ఇక్కడే ఈ జన్మలోనే
సంయోగం కలిగింది. సుఖాలు అనుభవించావు. బాగానే ఉంది. ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు
తెలుసా? వారిని ఎప్పుడైనా చూశావా? లేదు. కాకతాళీయంగా కలుసుకున్నారు. అలాగే విడిపోయారు.
గతం గతః. ఇప్పుడు శోకించి ప్రయోజనం ఏమిటి? ఎందరు ఎంతగాదుఃఖిస్తే మాత్రం పోయినవాళ్ళు
వస్తారా? ఎప్పుడైనా వచ్చారా? కాలో హి దురతిక్రమః. అందుచేత, లే, లేచివెళ్ళు. వెళ్ళి రాజభోగాలు
అనుభవించు. యథావిధిగా పరిపాలన సాగించు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది ఆవిడ. నువ్వూ
అంతే. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. కర్తవ్యం ఆచరించు. యోగమార్గం తెలుసుకో. మనస్సుమ
చిక్కబట్టుకో. ప్రాణికోటి యాతాయాతాలకు సంబంధించి వాస్తవదృష్టిని అలవరుచుకో. భోగాలు కాలవశావ
వస్తాయి, కాలవశాన పోతాయి. శోకించడం వ్యర్థం. ఇదొక నిష్ఫలమైన సంసారమార్గం. కేవల సుఖయోగమూ
ఉండదు, కేవల దుఃఖయోగమూ ఉండదు. ఘటికాయంత్రంలా రెండూ ఒకదానివెంట ఒకటి
తరుముకుంటూ తిరుగుతుంటాయి. మనస్సుకి ధైర్యం చెప్పుకుని రాజ్యపాలన సాగించు, లేదా
దాయాదులకు అప్పగించి వానప్రస్థం స్వీకరించు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి