18, అక్టోబర్ 2023, బుధవారం

ఆలోచనాలోచనాలు

 ***** ఆలోచనాలోచనాలు ***** అవధాన మధురిమలు ***** శతావధాని శ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రి *****          సమస్యాపూరణములు;---- 1* "" ఉత్తరమున భానుదేవుఁడుదయంబయ్యెన్."" పూరణము---- కం. " నెత్తమ్ములు దళ్కొత్తగ / మొత్తములై యంధతమసములు పోవంగా/ క్రొత్తగ నల్లదె పూర్వ న/ గోత్తరమున భానుదేవుఁడుదయంబయ్యెన్."                                2*"" తండ్రీ! యని పిల్చె నొక్క తన్వి స్వనాధున్.""     పూరణము;--- "కం. గండ్రయయియల్ల బేరుల / యాండ్రవలెన్నేఁడు సరసమాడెదనంచున్ / పండ్రెండేడుల కొమరుల / తండ్రీ! యని పిల్చె నొక్క తన్వి స్వనాధున్."                 3*"" నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్.""   పూరణము;----" కం. స్మేరానన యగుచు మణి / స్ఫార ముకురమందు తనదు చాయంగని త / న్జేరెడు చెలికత్తియకున్ / నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్."            వర్ణణాంశములు 1* జూదము. --- సీ. ఆదియందు తమాస యామీదఁ బేరాస పిదపను పలుబాస తుదకు మోస          దుష్టులతోఁబొత్తు తోరంబుగా హత్తు నభిమానమును మొత్తు నఘము మెత్తు                     కైపున నాడించు గౌరవము హరించు తప్పుత్రోవల దించు దగవుబెంచు              ధనమెల్ల నూడ్చు నిద్రాహారముల మాన్చు మృచ్చులలోఁ జేర్చు మోడ్పుగూర్చు                     తే.గీ. బిచ్చమెత్తించు నలుగడఁబేరడంచు / జూదమునకు మదిరకును లేదు భేద / మరయ దీని నివారింప నగునుగాని / మేటియగువాడు ప్రేరేపఁజేటుగాదె."                  2* సుకవి, దుష్కవులు.        సీ. రసమునేగొను బంభరముమాడ్కి సుకవి, దోషములనే గొనునీగ చాయకుకవి,                        మంచిపోకలనె వీక్షించు నాసుకవి, మెచ్చును చెడ్డపోకలఁజూచి కుకవి.        పరకావ్యముల గౌరవము జూపు సుకవి, యయ్యవి యీసడించుఁ బాయకయ కుకవి.                                  కల యర్థములను జక్కగజెప్పు సుకవి, గ్రచ్చులు గొట్టి  బల్ సున్నజుట్టు కవి.        ..         తే. గీ. సార సారస్వతాపగా చంచదూర్మి / చకచకారావ మిళిత హంసకవి సుకవి / శ్రుత్య సహ్య పదానేక రూడ పద్య / గర్గరారావ ఘటితకాక కవి కుకవి.           ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అ ధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో) తేది 18--10--2023, బుధవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: