18, నవంబర్ 2023, శనివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 90*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 90*


*శ్రీరామకృష్ణులు నిష్క్రమిస్తున్నారు:*


ఆగస్ట్ 16వ తేదీ ఏ రోజు రాకూడదని భక్తులు పరితపించారో ఆ రోజు రానే వచ్చింది. నాడు ఆదివారం. శ్రీరామకృష్ణులు వ్యాధి అంతదాకా లేనంత తీవ్రరూపం దాల్చింది. ఆయన నాడి అస్తవ్యస్తంగా ఉంది. అతుల్ అనే భక్తుడు ఆయన నాడిని పరీక్షించి, ఆయున పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించాడు. చుట్టూ వున్న వారితో ఇక ఆయన బ్రతకడం కష్టమని తెలిపాడు.


సూర్యాస్తమయం కాబోతున్నది. శ్రీరామకృష్ణులు శ్వాసించడంలో బాగా ఇబ్బందిపడుతున్నారు.  భక్తులు వెక్కివెక్కి ఏడ్వ సాగారు. తమ జీవితాలలో ఇంతవరకు ఏ దివ్యప్రకాశం ఆనందాన్ని నింపుతూ వచ్చిందో, అది ఆరిపోతున్నదని గ్రహించిన అందరూ ఆయన చుట్టూచేరారు. కాసేపటి తరువాత శ్రీరామకృష్ణులు తనకు ఆకలిగా ఉందన్నారు. ద్రవాహారం ఇచ్చారు. కాని ఆయన త్రాగలేకపోయారు. ఎంతో శ్రమతో కాస్త త్రాగగలిగారు. మూతి తుడిచి మెల్లగా ఆయనను పడుకోబెట్టారు.  ఇద్దరు విసరసాగారు. పడుకొని ఉన్నవారు హఠాత్తుగా అట్లే సమాధిమగ్నులయ్యారు. దేహం శిలలా నిశ్చలమయిపోయింది, శ్వాస స్తంభించింది.


ఇన్ని రోజులుగా రేయింబవళ్లు ప్రక్కనే ఉండి సేవలు చేస్తూవచ్చిన శశికి ఈ సమాధిస్థితి మామూలుగా కలిగే సమాధి స్థితిలా తోచలేదు. ఏదో పెద్ద మార్పు ఉన్నట్లు అనిపించి విలపించసాగాడు. అప్పుడు నరేంద్రుడు అందరిని, "హరిః ఓం తత్సత్" అని ఉచ్చరించమన్నాడు. చాలాసేపు ఆ మంత్రాన్ని ఉచ్చరించారు.


అర్ధరాత్రి గడిచాక శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలిగింది. ఆకలిగా ఉందన్నారు. భక్తులు పట్టుకోగా లేచి కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా ఒక గ్లాసు జావ సునాయాసంగా త్రాగారు. ఇంత ఆహారం ఆయన పుచ్చుకొని చాలా రోజులయింది. జావ త్రాగాక ఒంట్లో కాస్త సత్తువ వచ్చినట్లుగా ఉందన్నారు. ఆయన నిద్రపోతే మంచిదని నరేంద్రుడు సూచించాడు. 


నొప్పి కారణంగా ప్రక్కనే ఉన్నవారికి సైతం వినపడనంత అతిమెల్లగా మాట్లాడే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బిగ్గరగా, "అమ్మా, కాళీ!" అంటూ మూడుసార్లు పిలిచి మెల్లగా పడుకొన్నారు. పిదప నరేంద్రుడు క్రిందికి వెళ్లాడు.


రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలు. మంచం మీద పడుకొని ఉన్న శ్రీరామకృష్ణుల శరీరంలో హఠాత్తుగా పారవశ్యస్థితి జనించింది. రోమాంచిత మయింది. దృష్టి నాసికాగ్రంలో ఏకాగ్రమయింది. పెదవులపై దరహాస చంద్రికలు వెల్లివిరిసాయి. ఆయన సమాధిమగ్నులయ్యారు. ఇంతకాలంగా ఆయన అనుభవిస్తూ వచ్చిన సమాధి కాదది, మహాసమాధి; కాళీమాత ఒడిలో ఆమె అనుంగు పుత్రుడు శాశ్వతంగా నిద్రించిన ప్రగాఢ సమాధి! ఈ సమాధి తదుపరి ఆయన ప్రాణం శరీరంలోకి తిరిగి రాలేదు. అది 1886 ఆగస్ట్ 16వ తేదీ.


అప్పుడు మాతృమూర్తి శ్రీశారదాదేవి ఆయన ప్రక్కన లేరు. కబురు అందగానే ఒక్క పరుగున మంచం ప్రక్కకు వచ్చి, "అమ్మా కాళీ! ఎక్కడికి వెళ్లిపోయావు  తల్లీ!" అంటూ బిగ్గరగా విలపించారు. అందరి హృదయాలూ  ద్రవించిపోయాయి. శ్రీరామకృష్ణుల పావన భౌతికకాయం కాశీపూర్ శ్మశాన వాటికలో దహించబడింది. ఒక కంచు పాత్రలో అస్థికలు సేకరించి గురుదేవుల పడక మీద ఉంచారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: