శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
జనమేజయా ! వీళ్ళు వెళ్ళేసరికి ఎవరో గంధర్వుడు ఏదో విన్నవిస్తున్నాడు బ్రహ్మదేవుడికి. అది
ముగిశాక రేవతుడు చతుర్ముఖుడికి నమస్కరించి తన కూతురును చూపించాడు. ఈ అమ్మాయిని
ఎవరికిచ్చి వివాహం చెయ్యాలో దయచేసి తెలియజెప్పమని అడిగాడు. చాలామంది రాకుమారులను
పరిశీలించాను. కానీ ఏ ఒక్కడూ నా మనస్సుకు పూర్తిగా నచ్చలేదు. ఏ నిర్ణయమూ చెయ్యలేక నిన్ను అడిగి
చేద్దామని ఇలా వచ్చాను. యోగ్యుడు, బలశాలి, సర్వలక్షణ సంయుతుడు, దానశీలి, ధర్మశీలి అయిన
రాకుమారుణ్ణి వరుడుగా ఆజ్ఞాపించు. ఆ ప్రకారం అతడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అభ్యర్థించాడు.రేవతీ బలరాముల వివాహం
బ్రహ్మదేవుడు క్షణకాలం చిరునవ్వులు చిందించాడు. జరుగుతున్నదీ జరుగబోయే
ఆలోచించాడు. రాజేంద్రా! నువ్వు చూసిన రాకుమారులందరూ కాలచోదితులై త్వరలోనే
అస్తమించబోతున్నారు. దుష్టరాజ సైన్యాలను సంహరించి భూదేవికి భారాన్ని తగ్గించడంకోసం శ్రీమహావిష్ణువు
యదువంశంలో కృష్ణుడుగా అవతరించాడు. అవతార లక్ష్యాన్ని అప్పుడే ఆరంభించాడు. ఇప్పుడు
ద్వారకలో ఉంటున్నాడు. అతడికి ఒక అన్నగారున్నాడు. అతడి పేరు బలరాముడు. శేషాంశసంభూతుడు,
మహావీరుడు. ముసలాయుధధారి. హలాయుధధారి. వెంటనే వెళ్ళి మీ అమ్మాయి రేవతిని అతడికిచ్చి
వివాహం జరిపించు. శుభోదర్కంగా ఉంటుంది. అటు పైని నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో
- అని చతుర్వదనుడు సలహా చెప్పాడు.
రేవతుడు వెంటనే బయలుదేరాడు. సరాసరి ద్వారకకు వచ్చాడు. బలరాముడికిచ్చి రేవతీ
కల్యాణం జరిపించాడు. అటునుంచి అలాగే బదరికకు వెళ్ళిపోయి తీవ్రంగా తపస్సు చేసి శరీరం
చాలించాడు. స్వర్గలోకం చేరుకున్నాడు.
రేవతుడు కూతురితోపాటు వెళ్ళి బ్రహ్మలోకంలో కొన్ని క్షణాలో నిముషాలో ఉన్నాడు కదా ! ఆది
మానవలోక కాలప్రమాణం ప్రకారం శతమో అష్టోత్తరశతమో యుగాలు అవుతుంది కదా! మరి వీళ్ళు
వృద్ధులు కాలేదా ? వృద్ధురాలైన రేవతిని బలరాముడు వివాహం చేసుకున్నట్టా ? రేవతుడు ఇంకెంతటి
ముసలివాడైనట్టు ? అసలు ఇంతకాలంపాటు వాళ్ళకి ఆయుఃప్రమాణం ఎలా నిలిచింది ?
కన్యా వృద్ధావ సంజాతా రాజా వాతితరాం న కిమ్ ।
ఏతావంతం తథా కాలమాయుః పూర్ణం తయోః కథమ్ । (8-48)
జనమేజయా ! బ్రహ్మలోకంలో ముసలితనం, ఆకలి, దప్పిక, మరణం, భయం, అలవట
ఇటువంటివి అసలు ఉండవు.
న జరా క్షుత్పిపాపా వా న మృత్యుర్న భయం పునః ।
న తు గ్లానిః ప్రభవతి బ్రహ్మలోకే పదావఘ ॥
(8-49)
అదిసరే శర్యాతి సంతతియైన రేవతుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన సందర్భంగా, రాక్షసులు
అదునుచూసి కుశస్థలిమీద దండెత్తి అతడి సంతానాన్ని అంతటినీ సంహరించారు. చావగా బతికినవాళ్ళు
భయపడి పలాయనం చిత్తగించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి