18, నవంబర్ 2023, శనివారం

పరమేశ్వర పూజార్హములు

 శు భో ద యం🙏


మణులు  పరమేశ్వర  పూజార్హములు  కావా?

--------------------------------------------------------------   చ


చ: "  ఉనికి  శిలోచ్చయంబు , నిజయోష  శిలోచ్చయ  రాజపుత్రి ,  నీ


                  ధనువు  శిలోచ్చయంబు ,పురదాహ!  రథీకృత  రత్నగర్భ!    నీ


                   మనమున  కీ  శిలాశకల  మండలమెట్లు  ప్రియంబు  సేసె ?   నే


                    మనగలవాఁడ  నిన్ను ? వ్రత  హాని యొనర్చు   దురాత్ముఁడుండగన్ .


                            శ్రీ కాళహస్తీశ్వరమాహాత్మ్యము-   2   ఆ-- 122  పద్యము.  ధూర్జటి మహాకవి ; 


                  అర్ధములు:  ఉనికి- నివాసము; (  నిజరూపము)  శిలోచ్చయంబు- రాళ్ళసముదాయము; నిజయోష:  నీభార్య ; శిలోచ్చయరాజపుత్రి- పర్వత రాకుమారి; రథీకృతము: రథముగా నుపయోగించునది;  రత్నగర్భ- భూమి (రత్నములు కడుపులోకలది)

శిలాశకలములు-రాతిముక్కలు;  మండలము- సముదాయము; వ్రతహాని- నియమమును పాడుచేయు;

 

 సందర్భము: పరమేశ్వరునకు శ్రీ  ,కాళము ,హస్తి , వరుస గాపూజచేసిపోతున్నాయి. ఒకరిపూజ మరియొకరికి నచ్చటంలేదు.

ఒకరోజున పాము పూజించిన  తదుపరి ఏనుగు పూజకు వచ్చింది. అంతకు ముందే పాము మణులతో పరమేశ్వరుని యర్చించి

వెళ్ళింది. అక్కడి దృశ్యంచూచి  ఏనుగు చాలా బాధపడింది. యెందుకు? మణులైనా రాళ్ళేగదా  యవి. అందుకని. ఇప్పుడు పద్యభావం వినండి యేనుఁగు ఆంతర్యం మీకు బోధపడుతుంది.


                        "  పరమేశ్వరా!  నీకు  రాళ్ళకి  కొదవైనదనే  యీరాతిముక్కలను  నెత్తికెత్తుకున్నావా? 


                అసలు  నీరూపమే రాయికదా',(శివలింగం రాతితోతయారు చేస్తారు) నీవుండేదే  రాళ్ళగుట్టపై (హిమగిరి)  యిక నీభార్యేమో

పర్వత రాజపుత్రిక (   పెద్దరాతికి పుట్చినది రాచిప్పతో సమానం) పోనీ నీవిల్లుచూదామా  మేరుపర్వతం .( అదికూడా రాళ్ళగుట్టే)  నీవు 

రథంగా చేసికొన్నది కూడా రత్న గర్భయే ( శివునిరథం భూమి. ఆమెను రత్నగర్భ యంటారు.రత్నాలు రాళ్ళేకదా)  యిన్నిరాళ్ళు  నీచుట్టూ ఉండగా  నీకు రాళ్ళకి కొదవైనదనా ? ఈరాతిముక్కలను  నెత్తిని బెట్టుకున్నావు?  స్వామీ! నిన్నేమన గలనయ్యా!  నాపూజా వ్రతమును పాడుచేయుటకు జూచే  దుర్మార్గుని  నిందింపవలెను. "


                   అని యేనుఁగు తనమనస్సులోని  బాధను శంకరునితో  చెప్పుకొన్నది. ధూర్జటి చాతుర్యమును జూచితిరా? శివుని సర్వస్వమును శిలామయముగా  నిరూపించినాడు. స్తుతి నిందాలంకారము. 


                                                     స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: