8, నవంబర్ 2023, బుధవారం

ఆలోచనాలోచనాలు

 ***** ఆలోచనాలోచనాలు ***** అవధాన మధురిమలు ***** శతావధానులు పల్నాటి సోదర కవులు 1*శ్రీ కన్నెగంటి ప్రభులింగాచార్యులు 2* శ్రీ కన్నెగంటి చినలింగాచార్యులు 3* శ్రీ కన్నెగంటి వీరభద్రాచార్యులు (పల్నాటి కవిత్రయము) *****                                   సమస్యాపూరణములు ;---- 1* "" పది రెంటిన్ గొని వంశధర్మమును నిల్పన్ జాలె మిత్రాగ్రణీ!""                 మ. ముదిఱేనిన్ గని నీ వరంబుల్ పెక్కు గైకొన్నచో / నది యోగ్యంబని మెత్తురే బుధులు మామా! నన్ను నా భర్తలన్ / వదలంగల్గితి వంతెచాలు నిదె నా వాంఛాద్వయంబంచు ద్రౌ / పది రెంటిన్ గొని వంశధర్మమును నిల్పన్ జాలె మిత్రాగ్రణీ!"                  2* "" ప్రాగ్ధిగ్రావము నందె క్రుంకె రవి శ్రీ లక్ష్మీ నృసింహప్రభూ!""                   శా. దగ్దృశ్య ప్రకృతిప్రపంచ మదరన్ దేవాధిపుల్ భీతిలన్/ దిగ్దంతిప్రతతుల్ చలింప , సుమతీదేవి ప్రభావంబు స / మ్యగ్దీక్షన్ బడనెట్టివేయ నబలుండై దాగి జీవింప నా / ప్రాగ్ధిగ్రావము నందె క్రుంకె రవి శ్రీ లక్ష్మీ నృసింహప్రభూ!      3* "" పిడికిలి క్రింద నాకుఁ గనిపించె సుధాకర సూర్యబింబముల్.""               "వడివడి భర్తతో నడచి వచ్చుచు భవ్యకళాలవాలయై / యొడిగల విత్తనాల సమయోచితపద్ధతి జడ్డిగంబులో / విడచుచు మేలుగూర్చు నరవిందదళేక్షణఁ జూడుమన్న యా / పిడికిలిక్రింద నాకుఁ గనిపించె సుధాకర సూర్యబింబముల్.              4* ""రాటము నందు పెద్దనిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్.""                      ఉ. ఏటికి రావణా? రఘు కులీనుడు, ధీరుడు, సీతసాధ్వి;నీ / ధాటి యడంగు; నీ తరుణి దక్కదు దక్కదునా, విభీషణా! / బోటిని నూరు మార్గముల బొందుదు ; పొందన, రాముచేతిపో / రాటమునందు పెద్ద నిదురంగన రంభయొసంగు సౌఖ్యముల్.                       5* ""పెంకొక్కటి మింటికెగసి పెల్లుగ దిరిగెన్.""                              కం. జింకలపాలెము నందున / ఢంకా వాయించి మంత్రఢాకా యనగా / టెంకాయ విసిరి కొట్టగ / పెంకొక్కటి మింటికెగసి పెల్లుగ దిరిగెన్.                      6* "" గిలిలోపల హాయి తల్లక్రిందుల్ సేయున్.""         కం. నెలఁబోలు మోము లే వె / న్నెల మించిన నగవు హాళినిన్ గొల్పెడి చూ / పులు గల ప్రేయసి నును కౌ / గిలి లోపల హాయి తల్లక్రిందుల్ సేయున్.            7* ""స్త్రీల యుపస్థలందు మెఱసెన్ రతనంబులు చిత్రమందగన్.""                   ఉ. చాలుగ వ్రేతలెల్లరును స్నానము లాడెడివేళ బాలగో/ పాలుడు రాగ సిగ్గుపడి భామలు రత్నమయాంగుళీయముల్ / గ్రాలెడి హస్తపద్మము లెకాయెకి చాటున పెట్టుకోగ ఆ / స్త్రీల యుపస్థలందు మెఱసెన్ రతనంబులు చిత్రమందగన్.                      దత్తపదులు;--- "" ఎల్లి-- పిల్లి -- నల్లి -- మల్లి "" అను పదములతో "" తారాశశాంక ప్రణయం"" ఇతివృత్తంగా పద్యం.            ఉ. ఎల్లి మగండు వచ్చు నిదియే సమయంబిక దాళజాల గం / పిల్లి తొలంగిపోవలదు, ప్రేమ మనస్సుమజాల మాల నే / నల్లి భవద్గళంబున మహాముద మొప్పగ వేయుదాన మా/ మల్లియ తోటకుం గదలుమా! యని తార వచించెఁ జంద్రుతోన్.       2* "" ధర్మరాజు -- భీమార్జున -- నకుల -- సహదేవ "" పదములతో "" రామాయణార్థములో"" పద్యం.                                  తే.గీ. ధర్మరాజముఁ ద్రుంచి సీతను గ్రహించి / భీమబలమున భృగురాము పీచమణఁచి / అర్జున యశః ప్రభల విశ్వమందు నిల్పు / ఇనకులుని సహదేవుని నెన్నవశమె?                          (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యాసర్వస్వం సౌజన్యంతో)    తేది 8--11--2023, బుధవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: