🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *71వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*కుజగ్రహ చరిత్ర - 1*
*"అమ్మా....నన్ను 'కుజుడు' అంటారు కదా ? ఆ మాటకు అర్థమేమిటమ్మా ?"* కుజుడు ఒకసారి ఉన్నట్టుండి భూమాతను అడిగాడు.
భూదేవి యుక్తవయస్కుడైన కుజుడిని చిరునవ్వుతో చూసింది. కుజుడు అందంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు ! మొక్కగా ఉన్నప్పట్నుంచీ , పాదు చేసి , నీళ్ళు పోసి , జాగ్రత్తగా పెంచిన వృక్షాన్ని చూస్తున్నట్టు తృప్తిగా చూసింది భూదేవి కుజుణ్ణి. కుజుడు సాధారణ వృక్షం కాదు. చేవ కలిగిన శైవ వృక్షం !
*"ఏమిటమ్మా , అర్ధం చెప్పకుండా అలా చూస్తున్నావు ?"* కుజుడు నవ్వుతూ అడిగాడు. భూదేవి చిరునవ్వు నవ్వింది. *"నిన్ను చూస్తూ ఉంటే - ఇంకా , ఇంకా చూడాలనిపిస్తుంది. మంగళా !"*
*"అదిగో - మరొక పేరు !"* కుజుడు నవ్వుతూ అన్నాడు. *"మంగళుడు - ఈ ద్వితీయ నామధేయానికి నువ్వు అర్ధం చెప్పాలి !!*
*"అలాగే , అంగారకా !"* భూదేవి పకపక నవ్వింది. *"ఈ మూడో పేరుకు కూడా ముద్దైన అర్ధం ఉంది ! అది కూడా చెప్తాను !”*
కుజుడు భూదేవి దగ్గరగా కూర్చుని , తలను ఆమె వొడిలో పెట్టుకుని , విశ్రాంతిగా పడుకున్నాడు. చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూశాడు. *"ఎందుకో... ఎప్పుడూ నీ వొడిలో విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తూ ఉంటుందమ్మా !"*
భూదేవి కుజుడి తల నిమురుతూ , చిరునవ్వు నవ్వింది. *“అది నా అదృష్టం. నాయనా ! అలసిపోయే కోట్లాది ప్రాణులు ఎప్పుడూ , నా వొడిలో ఆదమరిచి పడుకుంటాయి ! తల్లిలాగా అందర్నీ , అన్నింటినీ వొడిలోకి చేరదీసి , విశ్రాంతి ఇచ్చే ఆనందం నాది !"*
*"మొదటి పేరు: కుజుడు !"* కుజుడు చిరునవ్వు నవ్వుతూ గుర్తుచేశాడు.
*"సరే... విను ! భూమి , అచల , అనంత , విశ్వంభర , స్థిర , ధర , ధరణి , ధరిత్రి , ధాత్రి , క్షోణి , క్షితి , వసుమతి , వసుంధర , వసుధ , ఉర్వి , విపుల , పృధ్వి , క్ష్మా , అవని , మహి , మేదిని , ఇల , జగతి , రత్నగర్భ , సర్వంసహ - ఇవన్నీ నా నామధేయాలు. వీటితో బాటు 'కు' అనే ఏకాక్షర నామధేయం కూడా వుంది. "కు" నుండి జన్మించినందుకు - నిన్ను పరమేశ్వరుడు "కు - జుడు" అన్నారు !*
*"ఓహో...' కుజుడు' అంటే 'భూమిజుడు' అనీ , భూపుత్రుడు అనీ అర్థమన్నమాట ! అయితే అమ్మా , నీకు ఎన్ని పేర్లున్నాయో అన్ని పేర్లూ నేను కూడా పెట్టుకోవచ్చు కుజుడు నవ్వుతూ అన్నాడు. *"ఇప్పుడు రెండో పేరు... మంగళుడు..." కదూ !"*
*"నువ్వు మంగళవారం నాడు జన్మించావు. ఆ కారణంతో అందరూ 'మంగళుడు' అన్నారు !!* భూదేవి చిరునవ్వుతో అంది. *"నీ మూడవ పేరు 'అంగారకుడు... ఆ పేరు రావడానికి కారణం నీ శరీర వర్ణం ! 'అంగారకం' అంటే నిప్పు ! అగ్ని వర్ణంలో ఉన్నావు. కాబట్టి నిన్ను 'అంగారకుడు' అన్నాం !"*
*“ఓహో ! అర్థంలేని నామధేయాలు నీ కుమారుడికి లేవన్న మాట !"* కుజుడు నవ్వాడు.
భూదేవి కుజుడి తలను ప్రేమగా నిమిరింది. ఆమె విశాల విలోచనాలు వొడిలో ఉన్న కుజుడి ముఖం మీద ప్రేమామృతాన్ని కురిపిస్తున్నాయి. *"అవును... నీవి అన్నీ సార్ధక నామధేయాలే ! ఒక ప్రశ్న అడుగుతాను , నిజం చెప్పు ! నీ పేర్లకున్న అర్థాలు నిజంగా నీకు తెలియవా ?"*
కుజుడు ఆమె కళ్ళలోకి నిదానించి చూసి , పక్కున నవ్వాడు. *“ఎందుకు తెలీదమ్మా ! తెలుసు...".*
*"అయితే ఎందుకడిగావు ?”* భూదేవి ప్రశ్నించింది.
*"ఎందుకంటే... నువ్వు వివరిస్తూ ఉంటే... నేను వింటూ ఉంటే... హాయిగా , ఆనందంగా ఉంటుంది ! అమ్మ మాట... అతి మధురం ! తెలుసా ?"* కుజుడు నవ్వాడు. భూదేవి శృతి కలిపింది.
*"అమ్మ మాట అతి మధురం..."* కుజుడన్న మాట ఆమెలో ఆలోచనలు రేపుతోంది. *"కుజా ! నీకో విషయం చెప్పాలి...”.*
*“ఓ ! చెప్పమ్మా ! చెప్పానుగా ! కన్నతల్లి మాట కర్ణామృతమే !"* కుజుడు భూదేవి కంఠం చుట్టూ చేతుల్ని వేస్తూ అన్నాడు.
*"నేను... నీ కన్నతల్లిని కాను , నాయనా ! 'చేకొన్న' తల్లిని !"* భూదేవి కుజుడి కనుబొమల్ని సున్నితంగా వేళ్ళతో సవరిస్తూ అంది.
*"అమ్మా..."* అంటూ కుజుడు ఆమె వొడిలోంచి లేవబోయాడు.
భూదేవి అతన్ని అదిమి , వొడిలోనే పడుకోబెట్టింది.
*"నువ్వు పరమశివుడి నుదుటి మీద నుంచి జారి పడిన స్వేదబిందువు నుండి ఆవిర్భవించావు ! ఆయన తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మహత్తర సమయంలో ఆ సంఘటన జరిగింది. స్వేదబిందువు నాలో ఉన్న ఆకర్షణ శక్తి వల్ల సహజంగా - ఇదిగో , ఇప్పుడు నువ్వు నా వొడిలో పడుకున్నావు చూడూ - అలా నా వొడిలో పడింది. తక్షణం ఆ స్వేద కణం అంతర్థానమై , ఆ స్థానంలో అగ్నివర్ణంలో అందమైన శిశువుగా నువ్వు ఆవిర్భవించావు. 'అమ్మా ! అవనీ , నీ వొడిలో పడిన బాలుడు , నీ బాలుడే ! నువ్వే పెంచి , పెద్దవాణ్ణి చేయి !' అన్నాడు పరమేశ్వరుడు. "*
*"పరమేశ్వరుడు అలా ఎందుకన్నారమ్మా ?"* కుజుడు ప్రశ్నించాడు.
*"ఆ సందర్భంలో ఆయనది భార్యలేని , భారమైన ఏకాంత జీవితం ! ఆయన సతి , సతీదేవి దక్షయజ్ఞంలో దగ్ధమైపోయింది. బిడ్డలు తల్లి పెంపకంలోనే లక్షణంగా , సవ్యంగా ఎదగగలరని శివుడికి తెలుసు..."* భూదేవి వివరించింది. *“నీకు మరొక విషయం తెలుసా ? నేను విష్ణుపత్నిని. పరమశివుడు నాకు సోదరుడు. సోదరుడి సంతానానికి తల్లి లేనప్పుడు - సోదరి పాలిచ్చిపెంచడం అపరాధం కాదు , నిషిద్ధం కాదు. నీకు నా చనుబాలు త్రాగిస్తూ , నేను ఎంత పులకించిపోయేదాన్నో !"* భూదేవి కనుగొనల నుండి ఆనందబాష్పాలు కుజుడి ముఖం మీద పడ్డాయి.
*"అమ్మా !"* కుజుడి కంఠంలో మమకారం బరువుగా పలికింది. *"పరమశివుడితో నీ సంబంధ బాంధవ్యం ఏదైనా సరే , నీతో నా బాంధవ్యం ఏదైనా సరే - నేను నిన్ను ఎన్నటికీ 'అమ్మా' అనే పిలుస్తాను !"*
*'అందుకు అభ్యన్తరం ఏముంది నాయనా !"* భూదేవి ఆనందంగా అంది. *"నువ్వెప్పుడూ నా బిడ్డడివే ! నువ్వు ఇష్టపడే వ్యక్తులకు మాత్రమే ఈ భూదేవి ఆస్తిగా దక్కుతుంది ! అది అలా ఉంచితే - నీకు యధార్ధ మాత ఉంది. ఆమె... నీ పితృదేవులైన పరమేశ్వరుల పత్ని. సతి , పార్వతిగా అవతరించి , ఆయన పత్ని అయ్యింది. ఆమెకు 'దుర్గ' అనీ , 'చండిక' అని నామధేయాలున్నాయి. ఇంకా చాలానే ఉన్నాయి. నువ్వు ఇప్పటి దాకా నీ 'తల్లి'ని చూడలేదు...”*
*"అమ్మా... ఆ తల్లి... నా జనకుల పత్ని... నీలాగా అందంగా ఉంటుందా ?"* కుజుడు అమాయకంగా అడిగాడు.
*“ఆమె సౌందర్యఖని ! సౌందర్యలహరి ! త్రిలోక సుందరి ! ఆ శివాని త్రిజగన్మోహిని ! నువ్వు ఆ జనయిత్రిని దర్శించాలి ! ప్రార్థించాలి ! కీర్తించాలి ! ఆశీస్సులు అందుకోవాలి ! వరాలు మూట కట్టుకోవాలి..."* భూదేవి చెప్పుకు పోతోంది.
*"అమ్మా....నువ్వుంటే అన్నీ ఉన్నట్టే...”*
*"అలా అనకు తండ్రీ ! నీకు శివపత్ని అయిన ఆ ఆదిపరాశక్తి కరుణ అవశ్యం. త్రిజగన్మాత అయిన ఆమె నీకు మాత కావడం నీ అదృష్టం. నీ విద్యాభ్యాసం పూర్తయింది. యువకుడివయ్యావు ! నువ్వు వివాహం చేసుకోవాలి. ఆ శుభకార్యానికి శుభసూచకంగా అద్రిసుతను ఆరాధించి , అనుగ్రహం సంపాదించు !”* భూదేవి ప్రోత్సహిస్తూ అంది.
*“సరే ! అయితే , రేపే కైలాసానికి వెళ్తాను !"* కుజుడు లేచి , కూర్చుంటూ అన్నాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి