*తాపత్రయం..*
"నా కూతురి బిడ్డ..మనుమరాలు.. ఈ పిల్ల, దీని భర్త బెంగుళూరు లో వుంటారు..పెళ్లై ఆరేళ్ళు అయింది..ఇంకా సంతానం కలగలేదు..డాక్టర్లకు చూపించుకుంటున్నారట..మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు నాతో చెప్పింది..స్వామి దగ్గరకు తీసుకొని వచ్చాను..కానీ ఏం లాభమయ్యా..తనకు ఇటువంటి మొక్కుల మీద నమ్మకం లేదట..స్వామి సమాధి వద్దకు రమ్మని చెపుతుంటే వినటం లేదయ్యా..మీ దంపతులు నచ్చచెప్పి..దీనికి స్వామివారి సమాధి వద్దకు పంపించండి.." అని సుబ్బమ్మగారు మాతో చెప్పుకొని బాధపడుతున్నారు..ఆవిడ ప్రక్కనే ఆమె మనుమరాలు నిలబడి ఉన్నది..
"ఏమ్మా.. నీ పేరేంది?" అని మా ఆవిడ అడిగింది.."లావణ్య.." అని చెప్పింది.."మీ అమ్మమ్మ అంతగా బ్రతిమలాడుతోంది కదా..ఒకసారి స్వామివారి సమాధి ని దర్శించుకొని రాకూడదా?..నీ గురించే కదా ఆవిడ తాపత్రయం.." అని అడిగింది.." పిల్లలు పుట్టలేదని నేనూ మావారు బాధపడుతున్నాము ఆంటీ..డాక్టర్లకూ చూపించుకుంటున్నాము..నాకెందుకో ఇటువంటి విషయాల మీద పెద్దగా నమ్మకం లేదు..ఏమీ అనుకోకండి.." అన్నది.."సరేనమ్మా నే ఇష్టం.." అని చెప్పేసాము..సుబ్బమ్మగారు నిట్టూర్చారు..మేమూ చేసేదేమీ లేక ఊరుకున్నాము..అప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది.."సరేనయ్యా..దేనికైనా ప్రాప్తం ఉండాలి..ఎంతమందికో స్వామివారి దయవల్ల సంతానం కలిగారు..మీరూ చూస్తున్నారు..నేనూ చూసాను..నేనే మొక్కుకుంటాను..సత్రం దగ్గరకు వెళ్లి..భోజనం చేసి..నాలుగు గంటల బస్సుకు తిరిగి వెళ్లిపోతాము.." అన్నారు సుబ్బమ్మగారు.."అలాగేనమ్మా.." అని చెప్పాము..
సుబ్బమ్మగారు, ఆమె మనుమరాలు ఇద్దరూ భోజనం చేసి..మళ్లీ మంటపం లోకి వచ్చారు..వాళ్ళు కందుకూరు వెళ్ళాలి..మరలా నాలుగు గంటలకే బస్సు ఉంది..అందుకని సుబ్బమ్మగారు మంటపం లో ఒక ప్రక్కగా పడుకున్నారు..ఆవిడ ప్రక్కనే లావణ్య కూర్చుంది..పదిహేను నిమిషాల తరువాత లావణ్య కూడా తన అమ్మమ్మ ప్రక్కనే పడుకొని నిద్రపోయింది..వాళ్ళిద్దరికీ మెలుకువ వచ్చేసరికి..నాలుగు గంటల బస్సు వచ్చి, వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది..మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు బస్సు ఉంది..లావణ్య ముభావంగా ఉంది..బస్సు తప్పిపోయినందుకు కోపంగా ఉందేమో అనుకున్నాము..ఐదు నిమిషాల తరువాత..సుబ్బమ్మగారి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది.."ఏమైందమ్మా..అలా ఉన్నావు?" అని సుబ్బమ్మగారు అడిగారు.."అమ్మామ్మా..నాకు బాగా నిద్ర పట్టింది..నిద్రలో ఎవరో బాగా పొడుగ్గా ఉన్న సన్యాసి కనబడ్డాడు..ఒడి పట్టమన్నాడు..చీరచెంగు పట్టుకున్నాను..అందులో ఒక అరటిపండు వేసాడు..పో..పోయి..స్వామిని వేడుకో.. నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు..అంతా నిజం లాగే ఉంది..నాకు అయోమయంగా ఉంది..ఒక్కసారి స్వామివారి సమాధి దగ్గరకు వెళదాము.." అన్నది..
సుబ్బమ్మగారు పట్టరాని సంతోషంతో.."పద తల్లీ ..ఇప్పుడే దర్శించుకుందాము.." అని చెప్పి..మనుమరాలిని వెంటబెట్టుకొని మా దగ్గరకు వచ్చి..విషయం అంతా చెప్పి.."అయ్యా..నువ్వు ఒప్పుకుంటే..దీనిని ఒక్కసారి స్వామివారి సమాధి వద్దకు తీసుకెళ్తాను.." అని ప్రాధేయపూర్వకంగా అడిగారు.."లక్షణంగా తీసుకెళ్లు.." అని చెప్పాను..ఇద్దరూ లోపలికి వెళ్ళి వచ్చారు..లావణ్య లో ఇంటకుమునుపు ఉన్న నిర్లక్ష్యం లేదు..ఆ సాయంత్రం కందుకూరు వెళ్లాల్సిన ఆ ఇద్దరూ..ఏమి ఆలోచించుకున్నారో.. ఆరాత్రికి స్వామివారి మందిరం లోనే వున్నారు..అక్కడే నిద్ర చేశారు..తెల్లవారి మొదటి బస్సులో కందుకూరు వెళ్లిపోయారు..
మరో నెల తరువాత..లావణ్య తన భర్తతో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది.."ఆరోజు అమ్మమ్మ తో వచ్చి వెళ్లిన తరువాత..స్వామివారి పై నమ్మకం ఏర్పడింది ఆంటీ..అందుకే ఈరోజు మావారిని తీసుకొచ్చాను..ఇక్కడ ఇద్దరమూ మూడు రోజులు ఉంటాము.." అన్నది.."సరేనమ్మా.." అని చెప్పాము..స్వామివారి సమాధి వద్దకే పోను అని మొండి కేసిన ఆ అమ్మాయి తన భర్తతో కలిసి మూడు రోజులు స్వామివారి మందిరం లో ప్రతిరోజూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి..స్వామివారి సమాధిని దర్శించుకొన్నది..అలా వరుసగా మూడు నెలల పాటు..ప్రతినెలా మూడురోజులు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చి నిష్ఠతో ప్రదక్షిణాలు చేసి వెళ్లారు..ఆ తరువాత ఆ దంపతులు రావడం ఆగిపోయింది..ఈలోపల సుబ్బమ్మగారు కాలం చేశారు..
మరో పదిహేను నెలల తరువాత..లావణ్య తనభర్తతో కలిసి బిడ్డను ఎత్తుకొని స్వామివారి మందిరానికి వచ్చింది.. "స్వామివారి ప్రసాదం అంకుల్.." అని బిడ్డను చూపిస్తూ లావణ్య భర్త చెప్పాడు..దంపతులిద్దరూ తమ బిడ్డతో సహా స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు.."అమ్మమ్మ మా గురించి చాలా తాపత్రయపడ్డారు..తీరా మాకు సంతానం కలిగాక..చూడటానికి ఆవిడ లేరు.. ఎవరికి ఏది ఎలా నిర్ణయించాలో స్వామివారికే తెలుసు.." అని కన్నీళ్ళతో లావణ్య చెప్పింది..
లావణ్య మనసులో ముందుగా తన మీద భక్తిని స్థిరపరచి..ఆపై సంతానయోగం కలుగచేశారు స్వామివారు..
సర్వం..
శ్రీ దత్తకృప!!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి