. *🪐నవగ్రహా పురాణం🪐*
. *101వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*శనిగ్రహ చరిత్ర- 1*
యముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. సావర్ణినీ , శనినీ , యమినీ , తపతిని ప్రేమగా పలకరించాడు.
*"అనుకున్నది సాధించావు కద , యమా ?"* సూర్యుడు కుమారుడిని అడిగాడు.
*"అనుకోని అద్భుత పదవిని బ్రహ్మదేవుడు నాకు అనుగ్రహించాడు. నాన్నగారూ !"* యముడు సగర్వంగా అన్నాడు. *"ఆయన నన్ను దక్షిణ దిక్కుకు పాలకుడుగా నియమించాడు !"*
*"చూశారా , స్వామీ ! నా బిడ్డ దిక్పాలకుడయ్యాడు !"* సంజ్ఞ సంతోషంగా అంది.
*"కాలం తీరిన జీవులను పాశబంధంతో తీసుకురావడం , వాళ్ళ పాపపుణ్యాలను పరిగణించి , నరకానికో , స్వర్గానికో పంపించడం - ఇది నా విధి ! పాప పుణ్యాలను నిర్ణయించి , శిక్షలు సక్రమంగా విధించగలిగే పరిజ్ఞానం కోసం పరమేశ్వరుడిని ఆశ్రయించమని ఆ పరమేష్టి నన్ను ఆజ్ఞాపించారు..."*
*"అలాగా !”* సంజ్ఞ సంతోషంగా అంది.
*"చతుర్ముఖుల ఆనతిని అనుసరించి , హిమాలయ పర్వతం మీద పరమశివుడి గూర్చి తపస్సు చేశాను ! ఆయన సాక్షాత్కరించాడు. తాను రూపొందించిన 'శిక్షాస్మృతి'ని నాకు ఉపదేశించాడు."* యముడు ఆనందంగా వివరించాడు.
*"పరమశివుడు శిక్షాస్మృతి రచించాడా ?"* సంజ్ఞ అడిగింది.
*"విశ్వంలో మొట్టమొదటి సారిగా శిక్షాస్మృతిని నిర్మించింది పరమశివుడే , సంజ్ఞా !"* సూర్యుడు అన్నాడు.
*"మేరు పర్వతం మీద దక్షిణాన నా కోసం 'సంయమని' అనే పట్టణం విశ్వకర్మ నిర్మించాడు. వంద యోజనాల పొడవుతో , వంద యోజనాల వెడల్పుతో ఉన్న సభలో నేను నా విధులు నిర్వహించాలి ! మీ ఆశీస్సులతో నా దిక్పాలక పదవిని ప్రారంభిస్తాను !"* యముడు సంతోషంతో చెప్పాడు.
యముడు చెప్తున్న విషయాలు అందరి ముఖాల మీద ఆనందాన్ని పులుముకున్నాయి. ఒక్క శనైశ్చరుడు మాత్రం - నవ్వలేదు. అతని నల్లటి ముఖం మీద తీవ్రమైన అసంతృప్తి , అసూయా జమిలిగా కనిపిస్తున్నాయి.
*"సావర్టీ ! చూశారా మీ సోదరుడు యముడు బ్రహ్మనూ , శివుడినీ - ఇద్దర్నీ మెప్పించాడు. దిక్పాలక పదవి సంపాదించుకున్నాడు. తన పరిపాలన కోసం అద్భుతమైన సభాంగణం , సంయమనీపురం లభించాయి మన యముడికి !"* సంజ్ఞ ఉత్సాహం నూరి పోస్తూ అంది.
*"మీరు కూడా యముడిని ఆదర్శంగా తీసుకుని - సాధించాలి !"* సూర్యుడు. అన్నాడు.
*"యముడి కన్నా ఎక్కువే సాధిస్తాను !"* శని ఆవేశంగా అరిచాడు.
అందరూ అదిరిపడి అతని వైపు చూశారు. శని కళ్ళు నల్లటి కుండ చిల్లుల్లో కనిపించే ఎర్రటి నిప్పుల్లా ఉన్నాయి.
*"శనైశ్చరా...”* సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. *"ఆగ్రహిస్తున్నావు ! ఎందుకు , నాయనా ?”*
*"యముడు పరమేష్టినీ , పరమేశ్వరుణ్ణి - ఇద్దర్ని మాత్రమే మెప్పించాడు ! ఈ శనైశ్చరుడు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ముగ్గుర్నీ మెప్పిస్తాడు !”*
యముడు శని స్పందనతో నివ్వెరపోయాడు. దగ్గరగా వచ్చి , అతని భుజం మీద అనునయంగా చెయ్యి వేశాడు. చిరునవ్వుతో చూస్తూ , *“సోదరా...”* అన్నాడు.
శనైశ్చరుడు యముడి చేతిని విసురుగా తోసి , ఎడంగా జరిగాడు. *“నీ విజయాన్ని మించిన ఘన విజయాన్ని సాధించి , నా శక్తి నిరూపించుకుంటాను !”
******************************************
*"శనీ ! ఏమిటా అహంభావం ?"* సంజ్ఞ గద్దించింది.
*"అహంభావం కాదు , జ్యేష్ఠమాతా ! ఆత్మ విశ్వాసం ! ఈ యముణ్ణి మెచ్చుకున్నట్టే , నన్నూ మెచ్చుకోవాలి మీరు !"*
*"శనైశ్చరా..."* సూర్యుడు మందలింపుగా అన్నాడు.
*"త్రిమూర్తుల వరాలు సంపాందించి గానీ తిరిగి రాను !"* శని హుంకరించాడు. *"ఇప్పుడే - ఇప్పుడే వెళుతున్నాను !"*
*"సోదరా !"* సావర్ణి సముదాయిస్తున్నట్టు అన్నాడు.
*"సాధించి , తిరిగి వస్తాను , సావర్డీ!"* అంటూ శనైశ్చరుడు విసురుగా మందిరంలోంచి వెలుపలికి నడిచాడు.
అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు.
*"స్వామీ... శనైశ్చరుడికి ఎందుకా స్పర్ధ ?"* సంజ్ఞ విచారంగా అంది.
*"వృద్ధి కోసం పూనే స్పర్థ మంచిదే దేవీ !"* సూర్యుడు నవ్వాడు.
*************************************
శని నెమ్మదిగా , మందమందంగా , అడుగులో అడుగు వేసుకుంటూ అరణ్య మార్గంలో వెళ్తున్నాడు.
నారాయణ నామస్మరణ చేసుకుంటూ , ఆకాశ మార్గాన వెళ్తున్న నారదుడు శనిని చూసి , ఆలస్యం చేయకుండా కిందకు దిగి , శనికి అభిముఖంగా నడవసాగాడు. మలుపు తిరిగి , సమీపంలో ఉన్న శనిని సమీపించాడు. 'నారాయణ!' అంటూ...
శని నారదుడి వైపు తీక్షణంగా చూశాడు.
*"అభివాదం మహర్షీ !"* అన్నాడు చేతులు జోడిస్తూ.
*"నారాయణార్పణం ! ఎక్కడికి ప్రయాణం సూర్యనందనా ?”* నారదుడు ఎగాదిగా చూస్తూ అన్నాడు.
శని కళ్ళు చిట్లించాడు. *"మా జనయిత్రి నామధేయం కూడా కలిపి , 'ఛాయా మార్తాండనందనా !' అని సంబోధించవచ్చు కదా ?”*
*“నారాయణ ! నేను అనకపోయినా , నువ్వు ఛాయాసుతుడు కాకపోతావా ? చాలా వేగంగా వెళుతున్నావు... ఎక్కడికో తెలుసుకోవచ్చునా , ఛాయా పుత్రా ?"*
*"అపహాస్యమా , నారదమహర్షీ ? నేను అడుగులో అడుగు వేస్తూ , నడిచేవాడిననీ , అందుకే నన్ను శనైశ్చరుడనీ , మందుడనీ అంటారనీ తెలియదా ? నేను... వేగంగా , అదీ 'చాలా వేగంగా' వెళ్ళడం అనేది సంభవమా ?"* శని సూటిగా అడిగాడు.
నారదుడు శని చూసేలా నాలుక కరుచుకున్నాడు. *"నీ నడకలో అడుగడుగునా కనిపించిన నిర్ణయాన్ని గమనించి , అలా అన్నానులే. ఛాయా మార్తాండ సంభూతా ?"*
*"తపస్సు రహస్య కార్యమైతే , నేను వెళ్ళే పని కూడా రహస్యమే !"* శని ముక్తసరిగా అన్నాడు.
*"తపస్సా ?! ఎవరి గురించి ?”* నారదుడు ఆశ్చర్యంగా అడిగాడు. *"బ్రహ్మా ? విష్ణువా ? మహేశ్వరుడా ?"*
ఈ శనైశ్చరుడికి ముగ్గురూ సమానమే ! త్రిమూర్తులు ముగ్గురి గురించీ తపస్సు చేసే సంకల్పంతో వెళ్తున్నాను"* శని గర్వంగా అన్నాడు.
*“ముగ్గురి గురించా ?”* నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు. *"ఒక్కరైనా చాలుగా , వరాలు వర్షించేవారేగా , ఏ ఒక్కరైనా ?”.*
*“ముగ్గుర్నీ ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుని , బయలుదేరాను , నారదా ! నా నిర్ణయం మారదు !"* శని పట్టుదలగా అన్నాడు. *"ఆ యముడు ఇద్దర్ని మెప్పించాడు. గదా ! నేను ముగ్గుర్నీ మెప్పిస్తాను !”.*
*"నారాయణ ! నారాయణ ! అదన్న మాట సంగతి ! ఆలోచన బాగానే ఉంది. అయితే , ముగ్గురికోసం తపస్సులోనే చాలా కాలం గడిచిపోతుంది...”*
శని గోరోచన గుళికల్లాంటి కళ్ళతో సూటిగా చూశాడు. *"నువ్వు ఇలాగే దారికి అడ్డుగా నిలుచుని , మాటకు మాట పెనవేస్తూ ఉంటే , ఇంకా చాలా కాలం గడిచిపోతుంది. నారదా !"*
*"నారాయణ ! మా సూర్య పుత్రుడు కదా , కుశల ప్రశ్నలు వేద్దామని వచ్చాను ! అంతే ! కాకపోతే , ముగ్గురు మూర్తుల్నీ ప్రసన్నం చేసుకోవాలంటే మూడు కాలాల పాటు , మూడు విడతలుగా..."*
*"నారదా !"* శని గద్దించినట్టు అన్నాడు. *"మూడు విడతలని ఎవరన్నారు ? ఒక్క ముక్కలో చెప్పేస్తాను ! నీ దారిన నువ్వు పో , నా దారిన నన్ను పోనీ ! నేను - బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల ముగ్గురి గురించే ఒకేసారి తపస్సు చేస్తాను ! అంటే త్రిమూర్తుల గురించి ఏక కాలంలో !"*
*"నారాయణ !"* అంటూ నారదుడు నోరు తెరిచాడు. *"ముగ్గురు దేవ దేవుల గురించి ఏక కాలంలోనా ? ఇలాంటి విచిత్రమైన తపశ్చర్య గతంలో లేదు. భవిష్యత్తులో ఉండబోదు..."*
*"వర్తమానంలో ఉంటుంది ! అన్ని లోకాలకూ ఈ వర్తమానం అందించు ! వెళ్ళు !"* అంటూ శనైశ్చరుడు నారదుణ్ణి తప్పుకుని అడుగులో అడుగేసుకుంటూ వెళ్తున్నాడు. నారదుడు అతని వైపు తిరిగి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి