9, డిసెంబర్ 2023, శనివారం

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 25*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*తిరునీల నక్క నాయనారు*


సిరి సంపదలతో కూడిన చోళదేశంలో తిరుచ్చందమంగై అనే అందమైన గ్రామం ఉంది. శివభక్తుడుగా ప్రసిద్ధిచెందిన నీలనక్కరు అక్కడ

జీవనం సాగిస్తూ వచ్చాడు. 


అతడు రోజూ శివుని అర్చిస్తూ శివభక్తులకు

సేవలు చేయడమే తన పరమావధిగా కాలం గడుపుతూ ఉండేవాడు.

ఒక పర్యాయం నీలనక్క నాయనారు అయవంది దేవాలయంలో

నెలకొని ఉన్న పరమేశ్వరుని సన్నిధికి పూజాద్రవ్యాలు తీసుకొని తన భార్యను

వెంట బెట్టుకొని వెళ్లాడు. భక్తితో దేవాలయం ప్రదక్షిణంచేసి స్వామి

గర్భగృహాన్ని సమీపించాడు. 


ఆ సమయంలో ఒక సాలెపురుగు

శివలింగంమీద పడగా పక్కనే ఉన్న తిరునీల నక్క నాయనారు భార్య

దానిని చూసింది. ఒక తల్లికి తన శిశువుమీద ఎంతటి ప్రేమ ఉంటుందో

శివునిమీద అలాంటి ప్రేమ భావాన్ని కలిగిన నీలనక్క నాయనారు భార్య

శివునికి ఏదైనా ఆపద సంభవిస్తుందేమోనని భయపడింది. వెంటనే తన

నోటితో ఆ సాలెపురుగును ఊదింది. 


సాలెపురుగు దూరంగా

కిందపడిపోయింది కాని ఆమె ఎంగిలి తుంపరలు కూడ శివలింగం మీద

పడింది. తిరునీల నక్క నాయనారు తన భార్య కారణంగా శివునిపై ఎంగిలి

పడిందని తెలుసుకొని కోపోద్రేకంతో ఆమెను చూసి “ఓ బుద్ధిహీనురాలా!

శివాపరాధం చేసిన నిన్ను క్షమించను. 


నిన్ను పరిత్యజించాను" అని చెప్పి భార్యను అక్కడే వదలిపెట్టి తాను మాత్రం ఇంటికి వెళ్లి పోయాడు.

ఆరోజు రాత్రి కలలో తిరు నీలనక్క నాయనారుకు పరమేశ్వరుడు

ప్రత్యక్షమై తన శరీరాన్ని చూపించి "భక్తుడా! నా మీద ప్రేమాభిమానాలతో

నీ భార్య నా శరీరంపై ఊదింది. 


ఆమె ఆ విధంగా ఊదడం వలన ఎంగిలి

తుంపరలు పడిన చోటుతప్ప మిగిలిన భాగాల్లో సాలెపురుగు కారణంగా

బొబ్బలు లేచాయి. ఇదిగో చూడు" అని చెప్పి భార్య భక్తి భావాన్ని అతనికి

తెలియజేశారు. తిరు నీలనక్క నాయనారు నిద్రనుండి మేల్కొని స్వప్న

వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తన భార్య శివభక్తిని తలచుకొని

సంతోషంతో పరమేశ్వరుని స్తుతించాడు. 


సూర్యోదయం కాగానే నాయనారు అయవంది దేవాలయానికి వెళ్లి పరమేశ్వరుని పాదపద్మాలకు సాగిలబడి

నమస్కరించారు. తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. తన భార్యను

సంతోషంగా ఇంటికి పిలుచుకొని వచ్చాడు.

శివభక్తులకు సేవ చేయడమే పరమావధిగా తన జీవితాన్ని గడిపిన తిరు నీలనక్క నాయనారు చివరగా శివ సాయుజ్యాన్ని పొందాడు.


*ఇరవై ఐదవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: