9, డిసెంబర్ 2023, శనివారం

గిరిక వచో మాధుర్యం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్.* 

                     🌷🌷🌷

శుభోదయం🙏

                   చొప్పకట్ల.


గిరిక  వచో మాధుర్యం !

--------------------------------- 

              

          ఉ:  " ఇంతి మృదూక్తి  మాధురికి  నిక్షురసం  బెన వోలఁ జాల ,కా


                   ద్యంతము  నోడి   మధ్యమ గుణాశ్రయమై , నెఱకాఁ క  నెన్ని జ


                  న్మాంతరము ల్వహించియుఁ  దనంతనె  ఖండము లయ్యెఁగాని,  యా


                 వంతయుఁ బూన దెంత  వొడి యయ్యు  నఖండ తదీయ  సంపదన్.


                    వసుచరిత్రము--2 ఆ--46 వ పద్యం:  రామరాజ  భూషణుడు.


                                   రామరాజ భూషణ విరచిత  వసుచరిత్ర  ప్రబంధమున  నాయికా  వర్ణన  సందర్భమున  నీపద్యము చోటు

చేసికొన్నది.   గిరిక  వచోమాధుర్యము (మాటలతీయదనము) చక్కర కన్నతీయన , యని  చెప్పదలచి దానికొక  చక్కని కథ

నల్లినాడు. దానిని పరిశీలించుటకు  ముందు కఠిన పదములకు అర్థములను వివరిస్తాను.


            అర్ధములు: ఇంతి- వనిత:  మృదూక్తి- మెత్తనిమాట; మాధురి-తీపి;  ఇక్షురసము- చెరకు రసము; ఎనవోలుట: సమానమగుట;


ఆద్యంతము- మొదలునుండి చివరివరకు;  మధ్యమ గుణాశ్రయము- కణుపులలోచేరి ;( రజోగుణము వహించి)  నెఱకాఁక- అధికమైన ఉష్ణమున ; (పెద్దమంటలో ) జన్మాంతరములు- యెన్నోపుట్టుకలు(అనేక జన్మలనెత్తినా) ఖండములగుట-ముక్కలగుట;  ఆవంతయు -కొంచెమైనను; వొడియగుట- పొడిగా మారుట; అఖండ- అంతులేని (ముక్కలుగాని)  తదీయ సంపదన్-ఆమెవాక్సంపదను;


                భావము: చెఱకురసం  ఆగిరిక వచోమాధుర్యంతో  సమానత్వాన్ని పొందుదామని ప్రయత్నం చేసినదట. ఆప్రయత్నంలో ఆది మొదటినుండి చివరివరకూ ఓడిపోయిందట. అయినా అక్కడితో ప్రయత్నం ఆపిందా లేదే  మధ్యమ గుణాన్ని ఆశ్రయంచిందట

(సామాన్యంగా మధ్యమగుణమనేమాటకు రజోగుణమనే మాట చెపుతాం .)చెరకు  విషయంలో దానిమధ్యమగుణంవేరు.చెరకు కణుపుల మధ్యలోనే రసం విస్తారం ఆరసంలోనే  తీపియధికం. .కణుపులమధ్యలోచేరిందట. తరువాత మంటలోబడిందట. రూపాంతరాలను పొందిందట. బెల్లపు పాకంగా బెల్లపు అఛ్చులుగా యిలా ,తరువాత పొడిగా మారిందట. అయనా అదితుదకు యెన్నివేషాలు వేసినా దానియత్నంఫలింపలేదూ. అంటాడు కవి. అంటే ఆమెమాటలు చెక్కర కన్న తియ్యన యని ఫలితార్థం!


                ఇందుకోసం కవిచేసిన ప్రయత్నం గొప్పది. లోకంలో  తమకన్నా ఉన్నతులను గెలవాలంటే యెంతో పట్టుదలతో ప్రయత్నం చేయాలి ఆపట్టుదల రజోగుణంవలన కలుగుతుంది. అవసరమైతే  పంచాగ్నిమధ్యంలోనిలచి తపస్సుచేయాలి. అదీఫలించకపోతే మరోటి చివరకు వారు రూపుమాసిపోతున్నా వారిప్రయత్నం మానరు. అదిగో ఆవిధంగా చెరకు యీమెవచోమాధుర్యాన్ని పొందటంకోసం ప్రత్నించి ఓడిపోయింది సామ్యత నందలేదు. అనివర్ణన. 

            


                 చెరకు తనప్రయత్నంలో  ఆద్యంతం ఓడటం:.  చెరకును గానుగకు పంపేముందు  మొదలు  నరికేస్తారు. అలాగే ఆచివరి భాగంకూడా కొంతభాగం తొలగిస్తారు అదీవిషయం. మధ్యమగుణాశ్రయమగుట:- కణుపులలో చేరి  యని భావం. నెఱకాక:-చెరకురసం పెద్ద కళాయిలోపోసి క్రింద మంటబెట్టి బగా కాస్తారు. అప్పుడది గట్టిపడుతుంది. జన్మాంతరాలు :-బెల్లమువగైరా రూపాలు.

పొడికావటం : చక్కరగామారటం. 


                   ఇదిగో యింత ప్రక్రియ యీపద్యనిర్మాణంలో  కవి ఉపయోగించాడు. ప్రబంధకవుల  వర్ణనలన్నీయింతే! చివరకుచెప్పిందేమిచటి?


"ఆమెమాటలు చెక్కరకన్నాతియ్యనివి"-అని.

                                               స్వస్తి!

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️

కామెంట్‌లు లేవు: