20, జనవరి 2024, శనివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩 . 🚩జీవిత గాథ🚩 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . భాగం 153

 చారిత్రాత్మక కథాస్రవంతి🌹
.   ఓం నమో భగవతే రామకృష్ణాయ

.       🚩శ్రీ వివేకానందస్వామి🚩
.                🚩జీవిత గాథ🚩   
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
.                    భాగం 153

చికాగో బయలుదేరడానికి ముందు ఒక వారం స్వామీజీ సత్వరంగా పనిచేయవలసి వచ్చింది. ఆగస్టు 27వ తేదీ ఆదివారం నాడు ఆయన అన్నిస్క్వామ్‌లోని ఒక చర్చ్‌లో ఉపన్యసించారు. "భారత దేశానికి తక్షణ ఆవశ్యకత సాంకేతిక విద్యే కాని, మతం కాదు" అనే అంశాన్ని ఆ ప్రసంగంలో నొక్కివక్కాణించారు. ఆ ప్రసంగం ఉద్వేగమూ, ఉప్పొంగే కార్యతత్పరతలతో నిండిపోయింది.

అది విన్న శ్రోతలు కూడా ఆ ఉద్వేగానికి స్పందించి, అటువంటి విద్యను తక్షణమే అమలుపరచే కళాశాలను భారతదేశంలో స్థాపించడానికి నిధులు వసూలు చేయనారంభించారట! స్వామీజీ గురించీ, అన్నిస్క్వామ్‌లో ఆయన గడపిన రోజుల గురించి శ్రీమతి రైట్ దీర్ఘమయిన వివరణ ఇచ్చారు.....

""ఆయన సామాన్యంగా మోకాలు దిగువ దాకా వచ్చే పొడవైన కాషాయపు అంగీ ధరించేవారు. ఫాదరీలు ధరించే మాదిరిగా అది ఉంది. పొడవైన, మందమయిన ఒక కాషాయ వస్త్రాన్ని నడుముకు బిగించుకొనేవారు. కాళ్లను కాస్త ఈడుస్తూ నడుస్తూన్నట్లుగా కనిపించినా ఆయన నడకలో ఒక ప్రత్యేక ఠీవి ఉంది. పైకెత్తిన తల, తిన్నని మెడ, సునిశిత దృక్కులూ ఆయనకు ఒక అధికారిక వైఖరిని కల్పించాయి.

అంతేకాదు ఆయనను దాటుకొంటూ వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆగి ఆయనను చూడకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఆయన మెల్లగా నడుస్తారు. ఆయనలో తొందరో, వేగమో కనిపించదు. ఆయన విశాల నేత్రాలు కొన్ని సమయాలలో నిప్పులు వర్షిస్తాయి.

'ప్రశాంతంగా కూర్చునివున్న ఆయన కొన్ని సమయాలలో తల పైకెత్తి దృష్టిని పైకప్పుకేసి త్రిప్పి 'శివ శివ' అనడం కద్దు. ఆయన ఉద్వేగం అగ్నిపర్వతపు లావాలా వ్యాపించి అక్కడున్న అందరినీ మాడ్చివేసేదిగా ఉండేది.

చిత్రకారులు తదేకంగా చూస్తూ ఆయన చిత్రాన్ని గీయనారంభించారు.

"ఈ లోకంలో సత్యం అంటూ ఏదైనా ఉందీ అంటే అది ఆధ్యాత్మిక జీవితం మాత్రమే అంటూ ఆయన శిక్షణ పొందినట్లుగా అనిపించింది. భగవంతుని పట్ల ప్రేమ, మనిషి పట్ల ప్రేమ ఇవే సత్యమని ఆయన నమ్మకం."

ఈ విధంగా సాగుతుంది శ్రీమతి రైట్ దీర్ఘవివరణ. డబ్బు విషయంలో స్వామీజీ అనాసక్తతను గురించి ఆమె ప్రత్యేకంగా ఇలా వ్యాఖ్యానించింది:

“ఎవరైనా స్వామీజీకి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు, వారు తమ కేదో కీడు తలపెట్టినట్లు వైదొలగేవారు. 'ఆహా! సరిపడినంత కష్టాలను నేను అనుభవించాను. వాటిలో నన్ను ఎక్కువగా పరీక్షించింది ఏదో తెలుసా? డబ్బును -పదిలపరచడమే' అంటూ పిల్లవాడిలా ఆయన చెప్పేవారు.

 డబ్బు లేకుండా ఏమీ చేయలేం అనే స్థితిలో కూడా ఆయన డబ్బును తిరస్కరించడం మేం నమ్మలేక పోయాం. డబ్బు పట్ల ఒక వ్యక్తి ఇంత అనాసక్తతతో ఉండగలరా అనే ఆలోచన ఆయన వెళ్లిపోయిన చాలా రోజుల దాకా మా మనస్సులలో పాదుకుపోయింది. "🙏

సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్

కామెంట్‌లు లేవు: