20, జనవరి 2024, శనివారం

శిరస్సువంచి ఆమోదిద్దాం!

 మన మనస్సు
మనలను మోసం చేయడం
మొదలెట్టక ముందే,
మన రచనలను ఆపేద్దాం!

వయస్సుతోపాటే వచ్చే చాంచల్యాన్ని
సవినయంగా శిరస్సువంచి ఆమోదిద్దాం!

అన్ని అవయవాలలాగే మెదడుకూడా
అవిశ్రాంత శ్రమతో అలసిపోయి విశ్రాంతి కోరుతుంది!

మనం రాసే పుల్లా-పుడకా కవిత్వాలు
తలకుమాసిన కధలు రాకపోతే
జనాలేమీ బెంగెట్టుకోరు!

కవన కాలుష్యం, కధా శకలాలు తగ్గాయని
గొప్ప ఊరట చెందుతారు!

మన తరం అడ్డు తొలిగితే, మన వెనక
ఆగిపోయిన కలాలు కొత్త ఊపిరితో
జవసత్వాలతో కొత్త సృష్టి  చేస్తాయేమో!
అందుకేమనం పేజీలను, వేదికలను ఖాళీ చేయాలి!

'నేనొక్కడిని ఆగిపోతే 'అని మహాకవి అన్నాడంటే
అది ఆయనకే చెల్లుబాటు!మనబోంట్లందరంకూడ
ఆగమంటే నగుబాటుతప్ప మనకు ఏమీ మిగలదు!

మనం రాసిందాంట్లో, చేసిందాంట్లో
ఒక్క ముక్కపనికొచ్చినా మానవాళి
జాగ్రత్తగా భద్ర పరుచుకుంటుంది!

ఆవిషయం నిస్పాక్షికంగా
అవలోకనం చేసుకుంటే
మనకే తెలుస్తుంది!!
            *

                    -సత్య భాస్కర్ ఆత్కూరు

కామెంట్‌లు లేవు: