మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు..
*ప్రసాద సుధాకరం..*
దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రిందట... అప్పుడప్పుడే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ఒక్కొక్క వ్యవస్థా రూపుదిద్దుకుంటోంది..
ఆదివారం నాడు, శ్రీ స్వామి వారికి ప్రభాత పూజ, హారతి అయిన తరువాత, భక్తులకు ప్రసాద వితరణ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తో ఉన్నాము..ప్రసాదంగా చేయించిన పదార్ధాన్ని, అందరికీ అందే విధంగా పంచే వ్యక్తి ఎవరు? ఇదొక ప్రశ్న మా ముందు నిలిచింది..ఎందుకంటే, ఆనాటికి ఆలయ సిబ్బంది గా ఉన్నది ముగ్గురే..టిక్కెట్లు, క్యూ లైన్, ఆలయ పరిశుభ్రత, అన్నీ వాళ్లే చూసుకోవాలి..
అప్పుడు వచ్చాడు సుధాకర్!..18, 19 ఏళ్ల వయసు, చిరునవ్వు..ప్రతి శుక్రవారం, సాయంత్రానికి మొగలిచెర్ల వచ్చి..రాత్రికి మాలకొండ చేరి, శనివారం ఉదయం నుంచీ, సాయంత్రం దాకా ఆ మాలకొండ లో వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో ప్రసాద వితరణ లో,అన్నదాన సత్రంలో స్వచ్ఛందంగా సేవ చేసి, తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరుతున్నాడు..
అతనిని గమనించిన నాకు ఆదివారం పూట ప్రసాదం వితరణకు మాకు పరిష్కారం దొరికింది అని అనిపించింది...ఆమాటే అడిగాను..సంతోషంగా ఒప్పుకున్నాడు..సహజంగా ఆదివారం ఉదయం పూట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది..ఎవ్వరినీ విసుక్కోకుండా ప్రసాద వితరణ చేయాలి..ఈ సుధాకర్ లో ఉన్న సుగుణం ఏమిటంటే..ఎంత మంది వచ్చినా , ముఖంలో అదే చిరునవ్వు!..ఎవరైనా ప్రసాదం కోసం రెండు మూడు సార్లు వచ్చినా..విసుక్కోకుండా పెడతాడు..మా సిబ్బంది లో ఎవరైనా.."అలా పెడితే, ప్రసాదం అయిపోయి చివరలో కొంతమందికి అందదు కదా? " అంటే.."పోనీలే, ఆకలితో ఉన్నట్టున్నాడు!" అంటూ నవ్వేస్తాడు..భక్తులకు పెట్టె ప్రసాదాన్ని తానే దగ్గరుండి ఆలయం లోకి తెప్పించుకుంటాడు..అర్చక స్వామి ఆ ప్రసాదాన్ని శ్రీ స్వామివారికి నివేదన చేసిన తరువాత..ముందుగా అర్చకస్వాముల కొరకు భక్తి పూర్వకంగా ప్రత్యేకంగా కేటాయించి ఇస్తాడు..ఆ తరువాత భక్తులకు పంచిపెడతాడు..
ఆ దత్తుడు చూపిన మార్గం వీడు అనుకున్నాన్నేను..ఆరోజు నుంచీ నేటి వరకూ.. ఆదివారమే కాదు, వేలాదిమంది భక్తులోచ్చే మహాశివరాత్రి రోజు కానీ..స్వామి వారి ఆరాధానోత్సవాల్లో కానీ..సుధాకర్ దే ప్రసాదవితరణ బాధ్యత!..
వారంలో ఐదు రోజులు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయప్పనులు, రెండు రోజులు దైవ సేవ..ఇదీ స్థూలంగా సుధాకర్ దినచర్య..శ్రీ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామికి పరమ భక్తుడు..ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.. పెళ్లి గురించి అడిగితే.."ఆ నరసింహ స్వామి గుడి, ఇక్కడే..ఈ దత్తాత్రేయుడి ప్రాంగణం లోనే కట్టించి, ఆ స్వామి కళ్యాణం ఆ గుడిలో చేయించి, తరువాత చేసుకుంటాను!" అంటాడీ ముప్పైఒక్క ఏళ్ల సుధాకర్!..
ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, విప్పగుంట లో నివాసం ఉండే ఈ సుధాకర్....తక్కువలో తక్కువ... ఓ ఐదారు కోట్ల రూపాయల ఆస్తికి ఏకైక వారసుడు!..
ఏ కార్యక్రమానికి ఎవరు సరిగ్గా సరిపోతారో..అటువంటి వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలనే విషయం..మాకంటే బాగా ఆ సమాధి లో కూర్చున్న అవధూత దత్తాత్రేయుడి కే చక్కగా తెలుసు!!
సర్వం..
శ్రీ దత్త కృప!
*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి