8, జూన్ 2024, శనివారం

కార్యసాధనకు

 *కార్యసాధనకు ప్రయత్నం అవసరం*

ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు , కర్మేంద్రియములు అని అర్ధం . వాటిలో మనస్సు కూడా ఒక ప్రధానమైన ఇంద్రియం . అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం . తనకు ఇష్టమైనదానికోసం పోవటం మనస్సు యొక్క సహజ లక్షణం . అది దానికి ఇష్టంలేని దానిమీదికి పోదు . ఎందుచేతనంటే దానివలన మనస్సుకు ప్రయోజనం లేదుకనుక . అలాంటప్పుడు ఎందుకు శ్రమపడాలి ? కాబట్టి మనస్సుకు ( ఇంద్రియానికి ) ఏది ఆకర్షణగా ఉంటుందో , దేనివలన తాను కోరుకున్న అనందం కలుగుతుందో దానిమీదనే ఆసక్తి ప్రసరిస్తుంది . అది లౌకికమైన తాత్కాలిక ఆనందం , కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాల వైపు మనస్సు పోదు . అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషయాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం . ఆ విధంగా మనస్సును మళ్లించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు . 

కాబట్టి లౌకిక సుఖాన్ని కాదనుకుని నిత్యమైన పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చేయాలి . ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉండాలి . కార్యసాధనకు ప్రయత్నం అవసరం , ముఖ్యం . లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖంగా చేయటం ఎట్లా సంభవిస్తుంది . కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి , ఆలోచన చేయాలి . ఆలోచన అంతర్ముఖం చేసుకొని మనస్సు ఏ విషయాలకు లోనవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి . 


మనకు ఇష్టంలేని ప్రస్తావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది . క్రోధం అంతః శత్రువు . హద్దు మీరుతుంది . చేయకూడని పని చేయిస్తుంది . మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది . దీనివలన అనర్ధం జరుగుతుంది . అది తనకూ మంచిది కాదు . ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు . అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించాలి . 


సహనం , వివేకం జీవితంలో అలవరుచుకోవాలి . మనకు అనుకోని విధంగా ఒక ఆపద ఏర్పడింది అనుకుందాము . త్రోవను పోయే ఒకనిని హఠాత్తుగా పాము కాటువేసింది అనుకుందాము . అది ఆకస్మికమైన విపత్తు . దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి , ఇతరులను నిందించి , పాముపై క్రోధం పెరిగి , దానిని చంపటానికి ప్రయత్నించి , అది కనపడకుండా పోయి , భయము పెంచుకుంటూపోతే చేయవలసిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది తప్ప ఉపయోగం ఉండదు . అటువంటి ఆపద సమయములలోనే మనము సహనము , వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి .

ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది . ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉంది ఉంటుంది . అదియే దైవ ప్రేరణ . దీనినే మనం లౌకికంగా ఒక సామెతగా కూడా వాడుతూవుంటాము  . అట్లా విచారణచేయటమే వివేకం . ఈ విచారణను వివేకముచే స్థిరపరచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము . ఈ విధమైన విచక్షణచేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులను , అవరోధాలను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది . నీటిని సహనంతో అధిగమించాలి . దీనినే తితిక్ష అని కూడా అంటారు . తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు అర్హుడు , యోగ్యుడు . అటువంటివానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది . శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం . శాస్త్రం అనేది ఏది నిర్దేశిస్తుందో అది చేయాలి . ఆ విధంగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు . శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి , విశ్వాసం ఉంటే చాలదు , శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించి తీరాలి .  


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* .

కామెంట్‌లు లేవు: