8, జూన్ 2024, శనివారం

హనుమజ్జయంతి ప్రత్యేకం - 8

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం - 8

       (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


VIII. హనుమ - చేసిన ప్రార్థనలు 


అ) సముద్ర లంఘనానికి ముందు చేసిన ప్రార్థన 


హనుమ 

  - సూర్యునికి, 

  - మహేంద్రునికి, 

  - వాయుదేవునికి, 

  - బ్రహ్మకు, 

  - పంచభూతాలకీ నమస్కరించి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. 

    తన తండ్రియైన వాయుదేవునికి మరల నమస్కరించి, దక్షిణ దిక్కుకు పోవు ఉద్దేశంతో తన శరీరాన్ని పెంచాడు. 


స సూర్యాయ మహేంద్రాయ  

పవనాయ స్వయంభువే I 

భూతేభ్య శ్చాంజలిం కృత్వా 

చకార గమనే మతిమ్ ॥ 

అంజలిం ప్రాఙ్ముఖః కుర్వన్ 

పవనా యాత్మయోనియేI 

తతోఽభివవృధే గంతుం 

దక్షిణో దక్షిణాం దిశమ్ ॥ 

       ( - సుందరకాండ 1/8,9 ) 


  - సరియైన బుద్ధికై సూర్యుని, 

  - ఇంద్రియాలకై ఇంద్రుని, 

  - ప్రాణాది వాయువులకై వాయుదేవుని, 

  - ఆలోచనా సృష్టికై సృష్టకర్త అయిన బ్రహ్మకీ, 

  - పాంచభౌతికమైన దేహమూ, ప్రపంచానికీ సంబంధించి పంచభూతాలకీ అంజలి ఘటించాడు. 

      వాయుదేవుడైన తండ్రికి మరొకసారి  ప్రార్థన. 


ఫలితం


    సూర్యుడు తాపంలేకుండా చూడడమే కాక, బుద్ధి సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకునేటట్లు అనుగ్రహించాడు. 

    ఇతర దేవతలు కూడా వారివారి స్థానాలకి సంబంధించి అనుగ్రహించారు.


ఆ) సీతాదర్శనం కాక విచారిస్తున్నప్పుడు చేసిన ప్రార్థన 


    లక్ష్మణునితో గూడిన రామునకు నమస్కారము. 

    జనక సుతయైన సీతకు నమస్కారము. 

    రుద్ర - ఇంద్ర - యమ - వాయువులకు నమస్కారము. 

చంద్ర - సూర్య - మరుద్గణములకు కూడా నమస్కారము. 


నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ 

దేవ్యై చ తస్యై జనకాత్మజాయై I 

నమోఽస్తు  రుద్రేంద్రయమానిలేభ్యో 

నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ॥ 

         ( - సుందరకాండ 13/59 ) 


    ఋషిగణములతో పాటు దేవతలు గూడ నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక! 

    బ్రహ్మయు, దేవతలు, అగ్నియు, వాయువు, వజ్రపాణియైన ఇంద్రుడునూ నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక! 

    పాశహస్తుడైన వరుణుడును, చంద్రసూర్యులును, అశ్వనీ దేవతలును, శివుడును నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక! 

    సర్వభూతములును, భూతముల కధిపతియైన మహావిష్ణువును, దారిలో కనిపించెడి - కనిపించని భూతములన్నియు నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురు గాక! 


సిద్ధిం మే సంవిధాస్యంతి 

దేవా స్సర్షిగణా స్త్విహ ॥ 

బ్రహ్మా స్వయంభూ ర్భగవాన్ 

దేవాశ్చైవ దిశంతు మే I 

సిద్ధి మగ్నిశ్చ వాయుశ్చ 

పురుహూతశ్చ వజ్రభృత్ ॥ 

వరుణః పాశహస్తశ్చ 

సోమాదిత్యౌ తథైవ చI 

అశ్వినౌ చ మహాత్మానౌ 

మరుత శ్శర్వ ఏవ చ ॥ 

సిద్ధిం సర్వాణి భూతాని 

భూతానాం చైవ యః ప్రభుః I దాస్యంతి మమ యే చాన్యే 

హ్యదృష్టాః పథి గోచరాః ॥ 

         ( - సుందరకాండ 13/64 నుండి 67 వరకు )


    సీతారామలక్ష్మణులకూ ముఖ్య దేవతలకూ నమస్కరించాడు. 

    అందఱికీ ప్రభువుతో కూడిన పరివార దేవతలతో సహా అందఱూ తన ప్రయత్నం సఫలీకృతం చేయడంలో అనుగ్రహించవలసినదని ప్రార్థించాడు. 


ఫలితం 


    ఆ ప్రయత్నంలో సఫలుడై, అశోకవనంలో సీతా దర్శనం పొందగలిగాడు. 


    మనం హనుమను ప్రార్థిస్తే, 

  - ఎప్పుడెప్పుడేదేది కావాలో అప్పుడప్పుడు అదే అదే, 

  - ఎక్కడెక్కడ ఏదేది కావాలో అక్కడక్కడ అదే అదే, 

  - ఎంతెంత అవుసరమో అంతంతా, 

  - ఎలాఎలా మనకి అవుసరమో అలాఅలా అనుగ్రహిస్తాడు. 

    మనకి ఏది హితమో అదే ఇస్తూ, తానే స్వయంగా సర్వమూ చూసుకుంటాడు. 


బుద్ధిర్బలం యశో ధైర్యం 

నిర్భయత్వం అరోగతా I 

అజాడ్యం వాక్పటుత్వంచ 

హనుమత్స్మరణా  భవేత్ ॥ 

    

               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: