31, జులై 2024, బుధవారం

శ్రీరాముణ్ణి అందరూ అనుసరించాలి*

 *శ్రీరాముణ్ణి అందరూ అనుసరించాలి* 


ప్రతి ఒక్కరూ సుఖదుఃఖాలను సమంగా చూడగలిగిన దృష్టిని అలవరచుకోవాలి. కానీ మనం ఈవిధంగా ప్రవర్తించం. ఆనందం వచ్చినప్పుడు మనల్ని మనమే మర్చిపోతాం. దుఃఖం వచ్చినప్పుడు క్రుంగిపోతాం. అలా కాకుండా మనం శ్రీరాముణ్ణి అనుకరించడానికి ప్రయత్నించాలి. 

*"నిన్ను రేపు చతుస్సాగర పర్యంతమైన భూమండలానికి రాజుగా చేస్తాను"* అని శ్రీరామునితో దశరథుడు చెప్పినప్పుడు ఆయన *'సరే'* అన్నాడు. అదే దశరథుడు మరునాడు పిలిచి *"నువ్వు అన్నీ విడిచి అరణ్యానికి వెళ్ళాలి"* అని చెపితే కూడ వెనుకటి వలెనే *"సరే"* అన్నాడు. రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నప్పుడు ఆనందం  పరవశుడై పోలేదు. అరణ్యానికి వెళ్ళమన్నప్పుడు దుఃఖాక్రాంతుడైపోలేదు.

ధర్మమార్గంలో ఉన్నవానికి తిర్యగ్జంతువులుకూడ సహాయం చేస్తాయి. తిర్యజ్గంతువుల మాట అటుంచి సోదరుడు కూడా దుర్మార్గుణ్ణి విడిచి వేస్తాడు.

" *యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతామ్ |* 

 *అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి ||* 

రామాయణంలో వర్ణించిన రామరావణుల చరిత్ర ఈ విషయాన్ని స్పష్టీకరిస్తుంది. శ్రీరాముడు ఎల్లప్పుడూ ధర్మమార్గాన్ని అనుసరించాడు. కలలో కూడ అధర్మం వైపు చూడలేదు. *"ధర్మమే రాముని రూపంలో అవతరించింది"* అని వాల్మీకి వర్ణించాడు.

ఇందుకు విరుద్ధంగా రావణుడున్నాడు. అతడు మూర్తీభవించిన అధర్మం. ఒకప్పుడు విశ్వామిత్రుడు యాగం చేశాడు. దానివల్ల రావణునికి కలిగే నష్టం ఏదీ లేదు. అయినా ఈ యాగం జరగడం అతనికి ఇష్టం లేదు. అందుచేత దానికి విఘ్నం కలిగించమని వెప్పి మారీచ సుబాహుల్ని పంపాడు. అదే విధంగా దండకారణ్యంలో ఉండే మునులందరికీ అతడు చాలా కష్టాలు కలిగించాడు. ఇవన్నీ రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలిసినవే. అతడు చేసిన చాలా చెడ్డపని ఏమనగా శ్రీమహాలక్ష్మీ అవతారమూ, మహా పతివ్రతా అయినా సీతా దేవిని అపహరించడం. అలాంటప్పుడు వాని సాక్షాత్సోదరుడే అయిన విభీషణుడు కూడా వానిని విడిచి పెట్టేశాడంటే ఆశ్చర్యం ఏముంది? రావణుణ్ణి అధర్మ మార్గం నుండి  తప్పించడానికి విభీషణుడు ఎంతగానో ప్రయత్నించాడు. ఎంత చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత *"ఏది జరగాలో  అది జరుగుతుంది. అయితే నేను మాత్రం నీవు అవలంబించిన అధర్మమార్గంలో నీకు అండగా ఉండలేను"* అని రావణునితో చెప్పి రావణుని వదిలి వేసాడు. తరువాత రాముని ఆశ్రయించి ఆయన కృపకు పాత్రుడయినాడు.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: