పరమేశ్వర ఆరాధన !
చ: ఉనికి శిలోచ్చయంబు , నిజయోష శిలోచ్చయరాజ పుత్రి , నీ
ధనువు శిలోచ్చయంబు , పురదాహ! రథీకృత రత్నగర్భ ! నీ
మనమున కీ శిలాశకల మండలమెట్లు ప్రియంబు సేసె? నే
మనగలవాడ నిన్ను? వ్రతహానియొనర్చు దురాత్ముఁడుండగన్.
శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మ్యము--2--ఆ : 122పద్యం: ధూర్జటి మహాకవి!
అర్ధములు: శిలోచ్చయము-- రాళ్ళసముదాయం-పర్వతం; నిజయోష-- భార్య ; పురదాహ--త్రిపురములను దహించినవాడా! రథీకృత--రథముగా చేయబడిన; రత్నగర్భ-- భూమి; శిలాశకలములు--రాతిముక్కలు: మండలము--సముదాయము;
భావము; త్రిపురములను దహించిన ఓపరమశివా! రత్నగర్భను రథముగా నెన్నుకొనినవాడా! నీనివాసం రాళ్ళగుట్ట(కొండ )నీభార్యయా పర్వత రాజపుత్రి ( ఒకపెద్ద బండరాయి కూతురు) నీకు రాళ్ళకేమి కొదవయ్యా! నీపరివారమంతా రాళ్ళేకదా? అయినా నీకీ రాతిముక్కలెలా ప్రియమయ్యాయి స్వామీ! నిన్నని పనేమిలే నాపూజా వ్రత భంగకారకుడుండగా!
అని భావము.
ఇదియొక గొప్పపద్యము. నిందాస్తుతితో పరమేశ్వరారాధనము చేయుట. వినుటకిదినింద వలేగన్పించును గాని , నిజమున కిది పరమేశ్వర తత్వమను ప్రస్తుతించుటయే.
హిమవత్పర్వతమాతని నివాసమని, పరమేశ్వరుడు మనకందనంత స్థానంలో ఉంటాడనీ భక్తితో ఆరాధిస్తే అతని సన్నిధికి చేరగలమని సూచిమచటమే! పరివత రాకుమారిగా పార్వతిని పేర్కొనటం ప్రకృతి స్వరూపిణియని చెప్పటమే! పర్వతములు
భూధహములట!- అంటే భూభార వహన శక్తిగలవని యర్ధము. అట్టిపర్వతములకు శివుడు బంధువగుట పరోక్షముగా భూభారనిర్వహనమునకు తోడుపడుటయే.పర్వతరాజపుత్రి యతని భార్య యగుట ,సకల ప్రాణిసముదాయమునకు మాతృరూపిణిగా సూచించుటయే!
రథీకృత రత్నగర్భ! యని సంబోధించటం సమస్త రత్నములకు నెలవైన భూమి యతని సేవకి యని సూచిమచుట. దానివలన రత్నములకు లోటులేనివాడని సూచించుట. ఇన్నియున్నవాడవే నీకేని లోటని యాఱాతిముక్కల కాసపడితివని పరనేశ్వరుని నిలదీయుట. ఈపద్యమువందలి చమత్కారము.
ఇంతకు కథాపరముగా అక్కడ జరిగినదిది. కాళము --అనగా పాము రత్నములతో పూజించి వెడలిన వెనుక హస్తి వచ్చింది. అది మృగమాయె దానికేమితెలుసు.? అవి మణులని విలువైన రత్నములని.మణులుకూడ రాళ్ళేయగుట రాతిముక్కలవలె
నది భావించినది. పరమేశ్వరుని పూలతోపూజించాలిగానీ పనికిరాని రాళ్ళతోనా? అని బాధపడి వానిని తొలగించి పూలతో ఆకులతో పూజించి వెడలిపోతుంది.
ఈవిధంగా ఈగ్రంధంలో మృగజాతుల ఆరాధనా విశేషాలను ధూర్జటిబహు రమ్యంగా వర్ణించాడు.
వ్యాజ స్తుత్యలంకారం ఈపద్యంలో ప్రధానంగా గమనింపదగినది.
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి